మా హక్కును కాలరాశారు..
ముంబై: ఇటీవల నగరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సుమారు రెండు లక్షలమంది ఓటర్ల పేర్ల గల్లంతుపై బోంబే హైకోర్టులో గురువారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. యాక్షన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ నెట్వర్కింగ్ ఇన్ ఇండియా(అగ్ని), బ్రైట్‌లైట్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా వేసిన పిల్‌ను ఈ నెల ఆరున విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. ఓటర్ల లిస్టులో పేర్ల గల్లంతును సవాలు చేస్తూ ఇప్పటికే ఒక పిల్ దాఖలైన విషయం తెలిసిందే. పుణే ఓటర్లు దాఖలు చేసిన ఈ పిల్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్లో పెట్టిన ముంబై నగర, శివారు ప్రాంతాల ఓటర్ల జాబితాలో 2,10,213 మంది ఓటర్ల పేర్లు తొలగింపబడినట్లు వెల్లడైంది. తొలగించిన వారిలో చాలామంది చనిపోయారని, మరికొంత మంది ముంబైను వీడి బయటకు వెళ్లిపోయినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై స్వచ్ఛంద సంస్థలు స్పందించాయి. పేర్లు గల్లంతైన వారిలో సుమారు 6,500 మంది తమ పేర్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ స్వచ్ఛంద సంస్థల ద్వారా కోర్టులో పిల్ దాఖలు చేశారు. వారిలో చాలామంది 2009 లోక్‌సభ ఎన్నికల్లోనే కాక, 2011లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు.
భారతీయ పౌరుల ప్రాథమిక హక్కు అయిన ఓటును వినియోగించుకోకుండా తమను అడ్డుకున్నారని వారు కోర్టును ఆశ్రయించారు. బాధితుల పేర్లను తొలగించే విషయంలో ఎన్నికల అధికారులు నియమనిబంధనలను పాటించలేదని వారు వాదించారు. ఓటర్ల లిస్టునుంచి పేర్లు తొలగించే ముందు ఎన్నికల అధికారులు సదరు వ్యక్తికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ ఇష్టానుసారం పేర్లు తొలగించారని బాధితులు తమ పిటిషన్లో వాపోయారు. ఎన్నికల అధికారుల ఈ చర్య వల్ల తాము లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోలేకపోయామని, బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే నగరంలో గల్లంతైన 2,10,123 ఓట్లు అభ్యర్థుల జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొన్నారు. కాబట్టి తిరిగి వారిని ఓటుహక్కు వినియోగించుకునేలా కోర్టు ఆదేశించాలని కోరారు. ఓటర్ల లిస్టులో పేర్ల తొలగింపు సమయంలో ఎన్నికల అధికారులు నియమ నిబంధనలను పాటించారా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి విచారణ జరిపించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. ఓటర్ల లిస్టు నుంచి గల్లంతైన వారిలో అర్హుల పేర్లను తిరిగి ఓటర్ల లిస్టులో చేర్చాలని, వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోర్టును కోరారు.