moin qureshi
-
సానా సతీష్ ఈడీ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న హైదరాబాద్ పారిశ్రామికవేత్త సానా సతీష్‌బాబు కీలక విషయాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో ఉన్న లింకులపై సానా సతీష్ సమాచారం ఇచ్చారు. సానా సతీష్‌తో సంబంధం ఉన్న ప్రముఖులకు ఈడీ నోటీసులు అందించింది. వీరిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, నగల వ్యాపారి సుఖేష్ గుప్తా, ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్, వ్యాపార వేత్త చాముండిలకు ఉన్నారు. (చదవండి : అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌బాబు అరెస్ట్) మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సతీష్ నిందితుడిగా ఉన్నారు. 2013లో వజ్రాల వ్యాపారీ సుఖేష్ బెయిల్‌కోసం మాంసం వ్యాపారీ మొయిన్ ఖురేషీకి సానా రూ. కోటీ 50లక్షలు ఇచ్చారని కేసు నమోదయింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో సానా లావాదేవీలు నడిపినట్లు ఈడీ విచారణలో తేలింది. అంతే కాకుండా సుఖేష్ బెయిల్ కోసం షబ్బీర్ అలీ, ఖురేషీ, సానా సీబీఐ కార్యాలయానికి వెళ్లారని విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో వారికి ఈడీ నోటీసులు అందించింది. సుఖేష్ గుప్తా కోసం లైజనింగ్ చేసిన ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా తనకు ఎలాంటి నోటీలులు అందలేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. -
ఈడీ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించిన సానా సత్తీష్
-
అక్రమాస్తుల కేసు: సాన సతీష్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషీ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌కు చెందిన సతీష్‌బాబు సానను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం ఇతడిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలోని కార్యాలయంలో సతీష్‌ను రాత్రంతా ప్రశ్నించారు. మధ్యాహ్నం తర్వాత ఆయన్ని ఢిల్లీలోని పటియాలా కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా సతీష్‌బాబుపై సీబీఐ కేసు నమోదయిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టిన ఖురేషీ కేసులో సతీష్ సాక్షిగా ఉన్నారు. ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నేతలకు ఆయన బినామీగా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలోనే ఆయన వ్యక్తిగత ఆస్తులపై పలుమార్లు ఈడీ సోదాలు కూడా జరిపింది. విద్యుత్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేసిన సతీష్‌కు.. వేలకోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణలో అనేక విషయాలను వెల్లడించిన సతీష్‌పై మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. -
హస్తిన లింకు హైదరాబాద్‌లో...
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సీబీఐ అంతర్గత పోరుకు ప్రధాన ‘కీ’ హైదరాబాద్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ ఎపిసోడ్‌పై కేసు.. ఢిల్లీ సీబీఐ పరిధిలో జరిగిన దాని మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కేసులో అలోక్‌వర్మతోపాటు స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తాన్‌ల మధ్య పోరు తీవ్రమవడం, ఆ తర్వాత ఇద్దరినీ సెలవులో పంపడం, కొందరిని బదిలీ చేయడం, ఇన్చార్జి డైరెక్టర్‌గా మరో అధికారి రావడం అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన సాన సతీశ్‌బాబు సీబీఐ అధికారులపై చేసిన అవినీతి ఆరోపణలు, డబ్బుల డిమాండ్ వ్యవహారంపై ప్రత్యేక బృందం శుక్రవారం హైదరాబాద్ చేరుకుంది. ఓ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని అధికార బృందం ఢిల్లీ నుంచి మొయిన్ ఖురేషీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ విచారించేందుకు రావడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఖురేషీతో సంప్రదింపులు జరిపిన సుఖేశ్‌గుప్తా, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, వ్యాపారవేత్త సాన సతీశ్‌బాబును మరోసారి విచారించేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది. సీఎం రమేశ్ లింకేంటి? అలాగే సాన సతీశ్ బాబును కాపాడేందుకు టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ కూడా సీబీఐ డైరెక్టర్లను సంప్రదించిన ఎపిసోడ్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వారితో ఖురేషీ మధ్యవర్తిత్వం, అప్పటి సీబీఐ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలతో సాగించిన లావాదేవీలపై వీరిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు డైరెక్టర్లపై సతీశ్‌బాబు ఇచ్చిన వాంగ్మూలంలో నిజానిజాలు తేల్చే వ్యవహారంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం రమేశ్‌కు సీబీఐ డైరెక్టర్లకు ఉన్న లింకు ఏంటి? డైరెక్టర్లతో ఎప్పటి నుంచి లాబీయింగ్ చేస్తున్నారు? ఏయే కేసులో వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు? తదితర అంశాలపై రమేశ్‌ను ప్రశ్నించడంతో పాటు ఆయన కార్యాలయాలు, నివాసంలో సోదాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లో ఈ కేసులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లభించాయని, వీటి ద్వారా డైరెక్టర్ల వ్యవహారంలో మరింత క్లారిటీ వస్తుందని, ఈ కోణంలోనూ విచారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. మంగళవారమే సతీశ్‌బాబును సీబీఐ ఢిల్లీ అధికారులు అక్కడికి పిలిపించి కొన్ని అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. అంతలోనే అధికారుల బృందం హైదరా బాద్ రావడం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రస్తుతం సీఎం రమేశ్ విదేశీ పర్యటనలో ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. -
సీబీఐ డీఎస్పీ అరెస్ట్
న్యూఢిల్లీ: సీబీఐలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్‌ను వ్యాపారవేత్త సతీశ్ సానాకు సంబంధించిన అవినీతి కేసులో అరెస్టు చేశామని సీబీఐ అధికారులు సోమవారం చెప్పారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన కేసులో సతీశ్ విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా, శని, ఆదివారాల్లో దేవేంద్ర కుమార్ కార్యాలయంలో, ఇంట్లో తనిఖీలు చేసి కొన్ని ఫోన్లు, ఐపాడ్‌ను స్వాధీనం చేసుకున్నామనీ, వాటిలోని సమాచారాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే అవినీతి కేసులోనే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై కూడా ఇప్పటికే కేసు నమోదైన విషయం ఆదివారం వెలుగులోకి రావడం తెలిసిందే. మరోవైపు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ఆస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో వారికి ప్రధాన మంత్రి కార్యాలయం నోటీసులు పంపింది. ఆదివారమే అలోక్ వర్మ పీఎంవోలోని సీనియర్ అధికారులను కలిశారు. సతీశ్ నిందితుడిగా ఉన్న కేసును ఆస్తానా నేతృత్వంలోని సీబీఐ బృందం విచారిస్తుండగా, ఆ బృందంలో దేవేంద్ర ఒకరు. సతీశ్ నుంచి ఆస్తానా రూ. 5 కోట్ల లంచాన్ని మనోజ్ ప్రసాద్ అనే మధ్యవర్తి ద్వారా తీసుకుని సతీశ్‌కు అనుకూలంగా విచారణను ప్రభావితం చేశారనేది ఆస్తానాపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేయడంలో దేవేంద్ర ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. గత నెల 26న సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఆస్తానా బృందం చెబుతోందనీ, అయితే ఆ రోజున సతీశ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లు తమ విచారణలో తెలిసింది కాబట్టి వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారని తేలిందని సీబీఐ అధికారులు చెప్పారు. సీఎం రమేశ్‌తో మాట్లాడారా? తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, తన పాత మిత్రుడు సీఎం రమేశ్‌తో ఈ ఏడాది జూన్‌లో తాను మాట్లాడానని సతీశ్ పేర్కొనట్లు దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ‘‘నాపై ఉన్న కేసుకు సంబంధించి సీఎం రమేశ్‌తో నేను మాట్లాడాను. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో తాను మాట్లాడతానని రమేశ్ నాకు అభయమిచ్చారు. ఆ తర్వాత కలిసినప్పుడు సీబీఐ డైరెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాననీ, ఇకపై సీబీఐ నన్ను విచారణకు పిలవదని రమేశ్ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత జూన్ నుంచి నన్ను సీబీఐ పిలవలేదు. దీంతో నాపై విచారణ ముగిసిందని నేను అనుకున్నా’ అని సతీశ్ దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే అలోక్ వర్మపై ఆస్తానా సీవీసీ వద్ద చేసిన ఆరోపణలను బలపరిచేందుకే సతీశ్ వాంగ్మూలాన్ని దేవేంద్ర ఇలా ఫోర్జరీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆస్తానా బృందంలోని ఇతర సభ్యులపై కూడా విచారణ జరుపుతున్నట్లు సీబీఐ చెప్పింది. సతీశ్ నుంచి అలోక్ వర్మ రూ. 2 కోట్ల లంచం తీసుకున్నారని ఈ ఏడాది ఆగస్టు 24నే ఆస్తానా ఆరోపించారు. పూర్తి వివరాలు విచారణలోనే తెలియాల్సి ఉంది. అసలు ఏమిటీ కేసు? మొయిన్ ఖురేషీ డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్ విద్యార్థి. ఆ తరువాత యూపీలో మాంసం ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు. అనేక ఇతర రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. ఆయనపై పన్ను ఎగవేతలు, హవాలా కార్యకలాపాలు తదితర కేసులున్నాయి. వాటిపై పలు కేసులను సీబీఐ విచారిస్తోంది. దేశం నుంచి రూ. 200 కోట్లను అక్రమంగా దేశం నుంచి తరలించారనే కేసును ఈడీ విచారణ జరుపుతోంది. ఈ విచారణల్లో భాగంగా జరిపిన సోదాల్లో ఖురేషీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు, సహచరుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ తనకున్న పరిచయాలతో సీబీఐ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురు నిందితుల నుంచి భారీగా డబ్బులు తీసుకునేవాడు. దీనికి సంబంధించి కూడా ఆయనపై ఓ కేసు విచారణలో ఉంది. అలా ఖురేషీకి సంబంధించిన కేసులో ఒక నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీశ్. కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డైరెక్టర్ అస్తానాకు ఇవ్వాలని చెప్పి తన వద్ద ఖురేషీ రూ. 3 కోట్లు తీసుకున్నాడని మెజిస్ట్రేట్ కోర్టులో సతీశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్‌ల పేర్లను సతీష్ ప్రస్తావించారు. ఈ వాంగ్మూలమే ఆస్తానాపై కేసు నమోదుకు ప్రాతిపదికగా మారింది. ఎఫ్ఐఆర్లో ఏముంది? సతీశ్ వాంగ్మూలం, ఫిర్యాదుల ఆధారంగానే ఆస్తానాపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాల ప్రకారం.. ‘మధ్యవర్తులు మనోజ్, సోమేశ్‌లు దుబాయ్‌లో సతీశ్‌ను కలుసుకున్నారు. సీబీఐ కీలక అధికారి సహాయంతో సతీశ్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానాకు సోమేశ్ ఫోన్ చేసి సతీశ్‌తో మాట్లాడించారు. రూ. 5 కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తాననీ, 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారు. దీంతో మనోజ్‌కు దుబాయ్‌లోనే సతీశ్ కోటి రూపాయలు ఇచ్చాడు. తర్వాత సునీల్ మిత్తల్‌కు ఢిల్లీలో రూ.1.95 కోట్లు ఇచ్చాడు. అయినా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ నుంచి సతీశ్‌కు నోటీసులు వచ్చాయి. దీంతో సతీష్ మనోజ్‌ను కలిసి డబ్బలిచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా రూ. 2.05 కోట్లు కూడా ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. అక్టోబర్ 9న 2 కోట్లు ఇస్తానని సతీశ్ హామీ ఇచ్చాడు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పంపాడు. ఆ తర్వాత సీబీఐ నుంచి సతీష్‌కు ఎలాంటి సందేశాలూ రాలేదు. అక్టోబర్ 10న రూ. 25 లక్షలను సతీశ్ మనోజ్‌కు ఇచ్చాడు. మిగతా సొమ్మును అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉండగా తీసుకునేందుకు మనోజ్ భారత్ వచ్చి అరెస్టయ్యాడు’. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఆస్తానాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఆస్తానా అంతకు ముందు సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్‌కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మాక్సిస్ తదితర కుంభకోణాల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. అలోక్ వర్మపై 10 అవినీతి ఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించారు. -
ఈడీ చార్జిషీటులో షబ్బీర్ అలీ!
న్యూఢిల్లీ/హైదరాబాద్: వివాదాస్పద మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీపై మనీ ల్యాండరింగ్ కేసుపై చార్జిషీటు దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ నేత, శాసనమండలి విపక్షనేత షబ్బీర్ అలీ పేరును చేర్చింది. సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈడీ సమర్పించిన చార్జిషీటులో.. షబ్బీర్ అలీ లంచం ఇవ్వజూపారని పేర్కొంది. ‘సతీశ్ సానా అనే వ్యాపారవేత్తతో ఢిల్లీ వెళ్లిన షబ్బీర్ అలీ మనీ ల్యాండరింగ్ కోసం మొయిన్ ఖురేషీకి కోటిన్నర ఇచ్చారు’ అని ఈడీ చార్జిషీటులో పేర్కొంది. అయితే, ఈ వార్తలను షబ్బీర్ అలీ ఖండించారు. ‘నేను అక్రమాలకు, వివాదాలకు దూరంగా ఉంటాను. మొయిన్ ఖురేషీ ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నా పేరు ఎందుకు చార్జిషీటులో ఉంటుంది. నాకు ఖురేషీతో సంబంధాలున్నాయని ఈడీ చెబుతుంటే.. ఖురేషీ అబద్ధమైనా ఆడుతూ ఉండాలి. లేదా ఈడీ అర్థరహితమైన ఆరోపణలు చేస్తుండాలి. ఇంతవరకు నాకు ఎలాంటి నోటీసులూ అందలేదు. నోటీసులొచ్చాక దీనిపై స్పందిస్తా’ అని ఆయన తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న వారందరిపైనా విచారణకు అనుమతించాలని ఈడీ తరపు న్యాయవాది ఎన్కే మట్టా కోర్టును కోరారు. మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఖురేషీ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా, సీబీఐ కేసునుంచి బయటపడేందుకు సాయం చేస్తానంటూ ఓ వ్యాపారి వద్దనుంచి రూ. 5.75 కోట్లను మొయిన్ ఖురేషీ వసూలు చేసినట్లు (ఈడీ) చార్జిషీట్లో పేర్కొంది. ‘ఓ వ్యాపారి, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ కేసునుంచి బయటకు తీసుకొస్తానని.. సీబీఐ డైరెక్టర్ (అప్పటి చీఫ్ ఏపీ సింగ్ పేరును ప్రస్తావిస్తూ) తనకు తెలుసని వ్యాపారిని నమ్మించాడు. అతనినుంచి రూ. 5.75 కోట్లు వసూలు చేశాడు. మరో వ్యాపారికీ ఇదే విధంగా చెప్పి రూ.1.75 కోట్లు తీసుకున్నాడు’ అని ఈడీ పేర్కొంది. ఏపీ సింగ్, ఖురేషీ సహా పలువురిపై మనీల్యాండరింగ్ సహా పలు నేరారోపణలను ఈడీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
‘మాల్యాలా చేయొద్దు.. భారత్‌కు తిరిగి రా’
న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్ అధికారులకు మస్కా కొట్టి దుబాయ్‌కి ఎగిరిపోయిన మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషిని ఢిల్లీ హైకోర్టు బుధవారం విజయ్ మాల్యాతో పోల్చింది. మాల్యాలాగా విదేశాలకు పారిపోయి తిరిగిరాకుండా ఉండొద్దని వ్యాఖ్యానించింది. మీరు భారత్‌లో లేరంటే దానర్ధం కోర్టుకు హాజరు కావాలనుకోవడం లేదని తెలుస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. 'ముందు, దేశానికి రండి, ఇంటరాగేషన్‌లో పాల్గొనండి' అని కోర్టు ఆదేశించింది. నవంబరు మధ్య కల్లా భారత్‌కు వచ్చి నవంబరు 22న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాత్కాలిక ఆదేశాలు జారీ చేసేది లేదని న్యాయస్థానం తేల్చి చెప్పా రు. తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులివ్వాలన్న ఖురేషీ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. (చదవండి....ఇమిగ్రేషన్ అధికారులకు మొయిన్ ఝలక్!) -
ఇమిగ్రేషన్ అధికారులకు మొయిన్ ఝలక్!
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తనను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులకు మాంసపు ఎగుమతి వ్యాపారి మొయిన్ ఖురేషీ ఝలక్ ఇచ్చాడు. ఆదాయ పన్ను కేసులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూపించి దుబాయ్‌కు చెక్కేశాడు. పొరపాటును గుర్తించిన అధికారులు కంగు తిని, విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శనివారం జరిగింది. మనీల్యాండరింగ్ కేసులో ఖురేషీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ‘లుక్ అవుట్ సర్కు్యలర్’(ఎల్వోసీ) జారీ చేసిన నేపథ్యంలో అతన్ని విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించారు. అతను తాను విదేశాలకు వెళ్లడంపై ఆంక్షలు లేవంటూ జారీ చేసిన ఓ కోర్టు ఉత్తర్వును వారికి చూపారు. దీంతో అతడిని దుబాయ్‌కు వెళ్లేందుకు ఇమిగ్రేషన్ అధికారి అనుమతించారు. కాసేపయ్యాక ఈడీ బృందం అతన్ని తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. కోర్టు ఉత్తర్వు ఆధారంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించిన విషయాన్ని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వును మరోసారి పరిశీలించగా.. అది ఆదాయ పన్ను కేసులో జారీ చేసిందని, ఈడీ కేసులో జారీ చేసింది కాదని గుర్తించారు.