హస్తిన లింకు హైదరాబాద్‌లో... | CBI team came to trial in the Qureshi case | Sakshi
Sakshi News home page

హస్తిన లింకు హైదరాబాద్‌లో...

Published Sat, Oct 27 2018 1:12 AM | Last Updated on Sat, Oct 27 2018 12:37 PM

CBI team came to trial in the Qureshi case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సీబీఐ అంతర్గత పోరుకు ప్రధాన ‘కీ’ హైదరాబాద్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీ ఎపిసోడ్‌పై కేసు.. ఢిల్లీ సీబీఐ పరిధిలో జరిగిన దాని మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కేసులో అలోక్‌వర్మతోపాటు స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తాన్‌ల మధ్య పోరు తీవ్రమవడం, ఆ తర్వాత ఇద్దరినీ సెలవులో పంపడం, కొందరిని బదిలీ చేయడం, ఇన్‌చార్జి డైరెక్టర్‌గా మరో అధికారి రావడం అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన సాన సతీశ్‌బాబు సీబీఐ అధికారులపై చేసిన అవినీతి ఆరోపణలు, డబ్బుల డిమాండ్‌ వ్యవహారంపై ప్రత్యేక బృందం శుక్రవారం హైదరాబాద్‌ చేరుకుంది. ఓ జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని అధికార బృందం ఢిల్లీ నుంచి మొయిన్‌ ఖురేషీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ విచారించేందుకు రావడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఖురేషీతో సంప్రదింపులు జరిపిన సుఖేశ్‌గుప్తా, కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ, వ్యాపారవేత్త సాన సతీశ్‌బాబును మరోసారి విచారించేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్‌ వచ్చినట్లు  తెలిసింది.  

సీఎం రమేశ్‌ లింకేంటి? 
అలాగే సాన సతీశ్‌ బాబును కాపాడేందుకు టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్‌ కూడా సీబీఐ డైరెక్టర్లను సంప్రదించిన ఎపిసోడ్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వారితో ఖురేషీ మధ్యవర్తిత్వం, అప్పటి సీబీఐ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్‌ సిన్హాలతో సాగించిన లావాదేవీలపై వీరిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు డైరెక్టర్లపై సతీశ్‌బాబు ఇచ్చిన వాంగ్మూలంలో నిజానిజాలు తేల్చే వ్యవహారంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం రమేశ్‌కు సీబీఐ డైరెక్టర్లకు ఉన్న లింకు ఏంటి? డైరెక్టర్లతో ఎప్పటి నుంచి లాబీయింగ్‌ చేస్తున్నారు? ఏయే కేసులో వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు? తదితర అంశాలపై రమేశ్‌ను ప్రశ్నించడంతో పాటు ఆయన కార్యాలయాలు, నివాసంలో సోదాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లో ఈ కేసులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లభించాయని, వీటి ద్వారా డైరెక్టర్ల వ్యవహారంలో మరింత క్లారిటీ వస్తుందని, ఈ కోణంలోనూ విచారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. మంగళవారమే సతీశ్‌బాబును సీబీఐ ఢిల్లీ అధికారులు అక్కడికి పిలిపించి కొన్ని అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. అంతలోనే అధికారుల బృందం హైదరా బాద్‌ రావడం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రస్తుతం సీఎం రమేశ్‌ విదేశీ పర్యటనలో ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement