తేమ శాతం ఆధారంగా మద్దతు ధరలు
సీసీఐ, మార్క్ఫెడ్లకు పూనం మాలకొండయ్య ఆదేశం
హైదరాబాద్: పంటలో ఏర్పడిన తేమ శాతం ఆధారంగా పత్తికి మద్దతు ధరలు చెల్లిస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. కనీస మద్దతు ధరల అమలుపై ఆమె ఆదివారం సంబంధిత మార్కెటింగ్, వ్యవసాయ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మద్దతు ధర చెల్లింపులపై సమీక్షించారు. ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మద్దతేది... మహాప్రభో’ కథనానికి స్పందించిన మాలకొండయ్య ఈ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 8 శాతం తేమ ఉంటే రూ. 4,050 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు.
9 శాతం ఉంటే రూ. 4,009.50, 10 శాతం ఉంటే రూ. 3,969, 11 శాతం ఉంటే రూ. 3,929.50, 12 శాతం ఉంటే రూ. 3,888 చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో 16.76 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా 205.77 లక్షల క్వింటాళ్లు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామని తెలిపారు. పత్తి, మొక్కజొన్న, వరి రైతులకు కనీస మద్దతు ధర చెల్లించే విషయంలో ధాన్యం అయిపోయేంత వరకు కొనుగోళ్లు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్క్ఫెడ్ సహా వివిధ కొనుగోలు సంస్థలను మాలకొండయ్య ఆదేశించారు.