Mominpeta
-
వికారాబాద్ జిల్లాలో అమానుషం.. ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. టేకులపల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు చెందిన దంపతులు సుభాష్, మంజుల టేకులపల్లి గ్రామంలో కోళ్లఫారం వద్ద పని చేసేవారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు మైత్రి(2), మహేశ్వరి(15 నెలలు) ఉన్నారు. అయితే శనివారం రోజు ఉదయం పిల్లలు ఇద్దరు మృతి చెంది ఉండగా.. మంజుల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మంజులను వైద్యం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారులను తల్లిదండ్రులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతో భోజనంలో విషయం కలిసి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. -
ఏం తమాషా చేస్తున్నావా.. నిన్నెందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పు?
సాక్షి, మోమిన్‌పేట: ‘ఏం తమాషా చేస్తున్నావా.. నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పు’..? అంటూ కలెక్టర్ నిఖిల పంచాయతీ కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబ్ చార్ట్ ప్రచారం నీ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని తేలిపోయిందని మండిపడ్డారు. గ్రామంలో చేపట్టే ఎన్ఆర్ఈజీఎస్ పనులను దగ్గరుండి చేయించాల్సిన బాధ్యత సెక్రటరీలదేనని స్పష్టంచేశారు. కలెక్టర్ నిఖిల శుక్రవారం ఎన్కేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కృష్ణచైతన్యరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితవాడలో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. శ్మశానవాటికకు గోడ నిర్మించాలని, ఇందుకు అవసరమైన నిధులు తానే ఇస్తానని సర్పంచ్ అంతమ్మకు హామీ ఇచ్చారు. కబ్రస్థాన్‌కు వెళ్లే మార్గం పాడవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ముస్లింలు కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆమె రోడ్డును పరిశీలించి, నివేదిక అందజేయాలని ఎంపీడీఓ శైలజారెడ్డిని ఆదేశించారు. చర్యలతో బాధ్యతలు గుర్తుచేస్తా.. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తాను జనగాం జిల్లాలో పనిచేసినప్పుడు మొదట కార్యదర్శులు ఇలానే ప్రవర్తించారని.. పనిలో ఆలసత్వం ప్రదర్శించిన నలుగురిపై వేటు వేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఇక్కడ కూడా కార్యదర్శులు బాధ్యతగా పని చేయడం లేదని అసహనం వ్యక్తంచేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే బాధ్యతలు గుర్తొస్తాయని తెలిపారు. సెక్రటరీలు ఉదయం ఆరు గంటలకే గ్రామాల్లో ఉండాలని సూచించారు. ధర్నాలకు భయపడేది లేదని, ఎవరిపని వారు చేస్తే సమస్యలేవీ ఉండవన్నారు. కార్యదర్శుల పని కేవలం లైట్లు, నీళ్లు, మురుగు కాల్వలే కాదని, ఉపాధి పనులు సైతం పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు. నూతన చట్టంలో కార్యదర్శుల జాబ్‌కార్డు పూర్తిగా పొందిపర్చినట్లు వివరించారు. కృష్ణచైతన్యరెడ్డికి వెంటనే మెమో జారీ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. 15 రోజుల్లో మళ్లీ వస్తానని, గ్రామంలో పరిస్థితులు మారకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఎన్కేపల్లిలో రిజిస్టర్లను తనిఖీ చేస్తున్న కలెక్టర్ నిఖిల -
పెళ్లి దుస్తుల్లోనే విగతజీవిగా ప్రవళిక.. పాడె మోసిన ఎమ్మెల్యే ఆనంద్
సాక్షి, వికారాబాద్: వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయిన సంఘటనతో మోమిన్‌పేట, రావులపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. మోమిన్‌పేటకు చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవళికను మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి ఇచ్చి శుక్రవారం వివాహం జరిపించారు. ఆదివారం ఉదయం తమ బంధువులతో కలిసి మోమిన్‌పేటకు వచ్చిన నవాజ్‌రెడ్డి విందు ముగించుకుని సాయంత్రం కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంత చెప్పినా వినకుండా కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి వాహనాన్ని వాగు దాటించే ప్రయ త్నం చేశాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో నవ వధువుతో పాటు పెళ్లి కొడుకు రెండో సోదరి శ్వేత మృతిచెందారు. బాలుడు శశాంక్‌రెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ సహాయక చర్యల్లో ఎమ్మెల్యే.. పెళ్లి కారు వాగులో కొట్టుకుపోయిన సమాచారం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం ఉదయమే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. వాగు ప్రవాహం, బురద నీటిలో నాలుగు కిలోమీటర్లు నడిచారు. వధవు ప్రవళిక, పెళ్లి కొడుకు అక్క శ్వేత మృతదేహాలు దొరకడంతో స్వయంగా పాడెకట్టి, ఒడ్డుకు చేర్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మోమిన్‌పేటలో ప్రవళిక అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రవళిక పెళ్లి దుస్తుల్లోనే విగత జీవిగా కనిపించడం అందరినీ కంటతడి పెట్టించింది. నవ వధువు తల్లిదండ్రులు రోధించిన తీరు కలచివేసింది. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సబితా వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు ప్రమాదంలో మృతి చెందిన నవ వధువు ప్రవళిక కుటుంబాన్ని, రావులపల్లిలో వరుడు నవాజ్ రెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆమెతోపాటు చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మేతుకు ఆనంద్ ఉన్నారు. అదే విధంగా శంకర్పల్లి మండలం కొత్తపల్లి ఎల్లమ్మ వాగులో కారులో గల్లంతై మృతి చెందిన ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులను కూడా మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు పడే సమయంలో రోడ్లపై, కల్వర్టుల వద్ద వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు వెల్లడించారు. డ్రైవర్ బతికే ఉండు.. వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి ఆదివారం రాత్రే ప్రమాదం నుంచి బయటపడ్డాడని డీఎస్పీ సంజీవరావు తెలిపారు. మర్పల్లి పీఎస్‌లో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరదలో కొట్టుకుపోయిన కారు కిలోమీటర్ దూరం వెళ్లి, చెట్టు కొమ్మలకు తట్టుకుని ఆగిందన్నారు. ఈ సమయంలో డ్రైవర్ కారులో నుంచి నీటిలో దూకి, ఈదుకుంటూ వెళ్లి రెండు గంటల పాటు చెట్టు కొమ్మలు పట్టుకుని ఉన్నాడన్నారు. వరద తగ్గిన తర్వాత అర్ధరాత్రి ఒడ్డుకు చేరుకున్నట్లు తెలిపారు. ఎవరైనా తనకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని భయపడి అదే రాత్రి అంరాద్కుర్దు గ్రామానికి వెళ్లి బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు స్పష్టంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి రాఘవేందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుడి దుర్మరణం మోమిన్‌పేట మండల పరిధిలోని ఏన్కతలకు చెందిన శామల వెంకటయ్య(60) ఆదివారం గ్రామానికి చెందిన శ్రీనివాస్, సాయిలతో కలిసి కారులో కౌకుంట్లకు బయలుదేరారు. తిరిగి వచ్చే క్రమంలో శంకర్పల్లి మండలం కొత్తపల్లి వద్ద కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. గ్రామస్తుల సహకారంతో శ్రీనివాస్, సాయి ప్రాణాలతో బయటపడగ వెంకటయ్యమృతి చెందాడు. సోమవారం ఏన్కతలలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. -
తీవ్ర విషాదం: వాగులో కొట్టుకుపోయిన కారు.. నవ వధువు మృతి
సాక్షి, వికారాబాద్: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన నవ వధువును వాగు బలితీసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే ఆమె మృత్యువాత పడింది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైలారం బాల్‌రెడ్డి కుమారుడు నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన ప్రవళ్లికతో శుక్రవారం వివాహం జరిగింది. విందు కోసం వధూవరులు, బంధువులు ఆదివారం మోమిన్‌పేటకు వెళ్లారు. సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ సమీపంలోని వాగు దాటేక్రమంలో ప్రవాహ తీవ్రతను అంచనా వేయని డ్రైవర్ కారును అలాగే ముందుకు తీసుకెళ్లాడు. దీంతో అందులో ఉన్న నవ దంపతులతో పాటు పెళ్లికూతురు సోదరి, వరుడి అక్క, చెల్లి, ఎనిమిదేళ్ల బాలుడు ఇషాంత్‌రెడ్డి గల్లంతయ్యారు. వరదలో గల్లంతైన వారిలో వరుడు, ఆయన సోదరి మాత్రం ప్రాణాలతో బయటపడగా.. వధువు ప్రవళ్లికతో పాటు మరొకరి మృతదేహం సోమవారం లభ్యమైంది. మరో ఇద్దరికి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వికారాబాద్ డిఎస్పీ సంజీవరావు తెలిపారు. చదవండి: విషాదం: వరదలో కొట్టుకుపోయిన కారు.. -
అదుపు తప్పిన బస్సు
మోమిన్‌పేట: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కిం దికి దూసుకెళ్లిన ఘటనలో మహిళా కండక్టర్‌తోపా టు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వికారాబా ద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.తాండూరు డిపోకు చెందిన బస్సు (టీఎస్ 34ఏ 6125)ను తీసుకొని డ్రైవర్ ఉస్మాన్, కండక్టర్ లక్ష్మి మధ్యాహ్నం సమయంలో ప్రయాణికులతో తాండూరు నుంచి సంగారెడ్డికి బయలుదేరారు. మోమిన్‌పేట మండలం కేసారం దాటాక మొరంగపల్లి సమీపంలోని రైల్వే గేటు వద్ద ఉన్న మ లుపులో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దిగింది. అక్కడే ఉన్న రైల్వే గేటుకు సంబంధించిన ఇనుప స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కండక్టర్ లక్ష్మి చేతికి బలమైన గాయమైంది. బస్సులో ఉన్న మో త్కుపల్లికి చెందిన దంపతులు ఎల్లమ్మ, మొగుల య్య గాయపడ్డారు. మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని 108వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయం లో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. -
భారీ చోరీతో కలకలం
మోమిన్‌పేట : ప్రధాన రహదారిపై ఉన్న దుకాణంలో భారీ చోరీ మోమిన్‌పేట ప్రజలు భయాందోళనకు గురిచేస్తోంది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న శ్రీశాంకరీ ఎంటర్‌ప్రైజెస్‌లో 68 తులాల బంగారం, రూ.96వేల నగదును దర్జాగా దొంగలు అపహరించుకొని పోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పెద్ద మొత్తంలో చోరీ జరగడం మండలంలో ఇది మొదటిసారి. ఈ చోరీలోని దొంగలను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన 9మంది డైరెక్టర్లుగా శ్రీశాంకరీ ఎంటర్‌ప్రైజెస్‌ను ఏడాది క్రితం ప్రారంభించారు. ఇందులో బంగారం తాకట్టుపెట్టుకొని డబ్బులు అప్పుగా ఇస్తారు. తొమ్మిది మందిలో ఒకడైన మల్లేశ్, అతడికి సహాయకుడిగా మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన రియాద్లు వ్యాపారం నడిపిస్తున్నారు. ప్రతి రోజు లావాదేవీలు ముగిసిన తర్వాత దుకాణంలో ఉన్న ఇనుప పెట్టెలో బంగారం, నగదును ఉంచి తాళం వేసి తాళంచెవులను దుకాణంలోనే మల్లేశ్, రియాద్‌లకు తెలిసిన ప్రదేశంలో దాచేస్తారు. అన్ని కోణాల్లో దర్యాప్తు దుకాణంలోని సీసీ కెమెరాలు గురువారం ఉదయం నుంచి పనిచేయడం లేదని నిర్వాహకుడు మల్లేశ్ చెబుతున్నారు. అయితే సీసీ కెమెరాలు పనిచేయని రోజు సాయంత్రమే దొంగతనం జరిగింది. దుకాణం వెనుక ఉన్న వెంటిలేటర్ చువ్వలను తొలగించిన దొంగలు.. దర్జాగా దూరి బంగారంతో పాటు నగదును అపహరించుకుపోయారు. అయితే తాళంచెవులు దాచిన సంగతి మల్లేశ్, రియాద్‌లకు ఇద్దరికే తెలుసు. దాచి ఉన్న తాళంచెవులు దొంగలకు ఎలా దొరికాయనేది మిస్టరీ. ఇది పూర్తిగా తెలిసినవారి పనేనని పలువురు అనుమానిస్తున్నారు. దొంగలు మొదట ఇనుపపెట్టెను తెరిచేందుకు పలు విధాలుగా ప్రయత్నించి ఉండాలి. కానీ అలాంటిదేదీ చేయకుండా నేరుగా దాచిన వారు వచ్చి తాళం తీసి ఇనుపపెట్టె తెరిచినట్లుగా దొంగలు తమ పని కానిచ్చి వెళ్లిపోయారు. ఈ కేసులో వివరాలు సేకరించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని, ఘటనా స్థలాన్ని శనివారం ఎస్పీ అన్నపూర్ణ సైతం పరిశీలించారు. దొంగలను త్వరలో పట్టుకుంటాం మోమిన్‌పేట : బంగారం తాకట్టు దుకాణంలో చోరికి పాల్పడిన దొంగలను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ అన్నపూర్ణ పేర్కొన్నారు. శనివారం మోమిన్‌పేట మండల కేంద్రంలో గురువారం రాత్రి చోరీకి గురైన శ్రీశాంకరీ ఎంటర్ప్రైజెస్ తాకట్టు దుకాణంను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుకాణంలో దొంగతనం జరిగిన రోజే మరమ్మతులకు గురైన సీసీ కెమెరాలను ఆమె పరిశీలించారు. అదే విధంగా అంతకు ముందు నమోదైన ఫూటేజీ, రాత్రి సమయంలో ఎవరెవరు ఆ వీధి గుండా సంచరించారో.. కాలనీలోని సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దొంగతనానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు. ఆమె వెంట సీఐ శ్రీనివాస్, ఎస్ అరుణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
ఇంటి బిల్లులకు వ్యవసాయ బకాయిలతో ముడి
మోమిన్‌పేట: ‘మోకాలికి.. బోడి గుండు కు ముడిపెట్టినట్లు’ వ్యవహరిస్తున్నారు విద్యుత్ అధికారులు.. రైతుల వ్యవసా య బకాయిలను గృహ విద్యుత్ వినియోగానికి అధికారులు ముడిపెడుతున్నారు. వ్యవసాయ బకాయిల సర్‌చార్జి, ఇండ్ల విద్యుత్ బిల్లుకు జతచేసి చేతికి అందిస్తున్నారు. ఒక్కసారిగా వేలల్లో వచ్చిన బిల్లును చూసి రైతులు నివ్వెరపోతున్నారు. నిర్ణీత గడువులోపు ఈ బకాయిలు చేల్లించకుంటే గృహ విద్యుత్ కనెక్షన్లు కత్తిరిస్తామని అధికారులు చేస్తున్న హెచ్చరికలతో రైతులు లబోదిబోమంటున్నారు. అనావృష్టితో పంటలు నష్టపోయి కరువు కోరల్లో చిక్కి అల్లాడుతున్న ఈ తరుణంలో విద్యుత్ సిబ్బంది రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఉచితమే.. వ్యవసాయానికి 2004 నుంచి ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుంది. ఉచితం కదా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని రైతు మొదట భావించారు. అధికారులు మాత్రం నెలకు రూ.30లు సర్వీసు చార్జి చెల్లించాలని ప్రకటించారు. కానీ ఈ విషయం రైతులకు బోధపడలేదు. అధికారులు కూడా సరైన ప్రచా రం నిర్వహించలేదు. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు చెల్లించాల్సిన సర్వీసుచార్జిలను రైతులు చెల్లించలేదు. ప్రస్తుతం అవి తడిసి మోపెడయ్యాయి. ఏడాదికి రూ.360లు చెల్లించాలి. చెల్లించలేని రైతులకు రూ.3600 కలిపి ఇంటి బిల్లుకు జోడిస్తున్నారు. రైతులకు ఆరు నెలలకోసారి రూ.180లు చెల్లించాలని బిల్లులు ఇవ్వాలి. ఈ విషయంలో విద్యు త్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలలకు ఇవ్వాల్సిన బిల్లు ఏడాదికి కూడా ఇవ్వలేదు. ఓవైపు రైతులు, మరోవైపు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పదేళ్లుగా సర్వీసుచార్జి కింద చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోయాయి. మండలంలో.. మండలంలో ఆధికారికంగా వ్యవసాయ కనెక్షన్లు, ఇంటి సర్వీసులు కలిపి 10,673 ఉన్నాయి. వ్యవసాయ బకాయిలు రూ.38లక్షలు, ఇంటి బిల్లుల బకాయిలు రూ.2.50 కోట్లు, కేటగిరీ -7 కింద ప్రభుత్వ పాఠశాలల బకాయిలు రూ.3.5లక్షలకు పేరుకుపోయాయి. ఇంటి బిల్లు, పదేళ్ల వ్యవసాయ బకాయిలు కలిపి ఏకమొత్తంలో చెల్లించాల్సి రావడంతో రైతులకు తలకు మించిన భారంగా మారింది. ఒక్కో రైతుకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు బిల్లులు చెల్లించాల్సి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
మోమిన్‌పేట సీఐకి ఉత్తమ పోలీస్ అవార్డు
మోమిన్‌పేట: మోమిన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.వి.రంగా ఉత్తమ పోలీస్ అవార్డుకు ఎంపికయ్యారు. మోమిన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఏప్రిల్ 29, 2014న బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి మూడు నెలల్లోనే ఆయన పరిధిలోని 15 కేసుల్లో 6హత్య కేసుల మిస్టరీని ఛేదించి నిందితులను రిమాండ్‌కు పంపాడు. ఆయన ప్రతిభను గుర్తించిన డిపార్ట్మెంట్ ఎ.వి.రంగాను ఉత్తమ పోలీస్ అవార్డుకు ఎంపిక చేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆయన అవార్డును తీసుకోనున్నారు. -
డంపింగ్ యార్డులకు స్థలాలు గుర్తించండి
మోమిన్‌పేట: ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలాన్ని తప్పనిసరిగా గుర్తించాలని కలెక్టర్ ఎన్. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మన ఊరు- మన ప్రణాళిక’లో గుర్తించిన ప్రాధాన్యతా అవసరాలను ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. తాగునీరు, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి వాటిపై అంచనాల తో నివేదికలు తయారు చేయాల ని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో చెత్తను వేసేందుకు డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, సృ్మతి వనం ఏర్పాటుకు తప్పనిసరిగా స్థలాలను పరిశీలించాలన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రత్యేకాధికారి రమణారెడ్డిని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఓ కమిటీని ఏర్పాటు చేసి 2 నెలల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ ప్రత్యేకాధికారితో కమిటీ వేసి ప్రతి గ్రామాన్ని పర్యవేక్షించాలని ఏపీఓ అంజిరెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఎంపీడీఓ కె.సువిధ, తహసీల్దార్ రవీందర్, వైద్యాధికారి సాయి బాబా, వ్యవసాయాధికారి నీరజ పాల్గొన్నారు.