ఆ భవనానికీ స్మార్ట్ టౌన్ హోదా!
న్యూఢిల్లీ: టర్కీ తర్వాత ఒక దేశ ప్రథమ పౌరుడు నివసించే అతి పెద్ద నివాసంగా పేరొందిన రాష్ట్రపతి భవన్ త్వరలో స్మార్ట్ టౌన్‌షిప్‌గా మారనుంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్ (ఐబీఎమ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఈ మేరకు భవన్లో చేపట్టబోయే ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ సెంటర్ (ఐఓసీ), 'మానిటర్' పేరుతో తయారుచేసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్లను ప్రారంభించారు.
ఈ అప్లికేషన్‌ను ఉపయోగించి నీటి నిర్వహణ, విద్యుత్, చెత్త డిస్పోజింగ్, తోటల నిర్వహణలను పర్యవేక్షించనున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో స్మార్ట్ పట్టణాలను ఎలా నిర్మిస్తారో రాష్ట్రపతి భవన్లో కూడా అదే మోడల్‌ను అనుసరిస్తారు. ఏదైనా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసి వాటిని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ మోడల్ ను రాష్ట్రపతి భవన్ కు అన్వయిస్తారు. నిపుణుల బృందాలు, రాష్ట్రాల పరిపాలన భవనాలు, జిల్లా పరిపాలనా కేంద్రాలతో దీన్ని అనుసంధానిస్తారు.