పంచాయతీల్లో ఆకలి కేకలు..!
ఒంగోలు టూటౌన్: జిల్లాలోని పంచాయతీల్లో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. 3 నుంచి 11 నెలల వరకు వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. కందులాపురం పంచాయతీలో 9 నెలలు, కంభం పంచాయతీలో 3 నెలలు, వై.పాలెంలో 7 నెలలు, త్రిపురాంతకంలో 6 నెలలు, దోర్నాలలో 5 నెలలు, దర్శి, కురిచేడు పంచాయతీలలో ఐదు నుంచి ఆరు నెలల వరకు కార్మికులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. అదే విధంగా కరేడు పంచాయతీలో 6 నెలలు, ఉలవపాడులో 3 నెలలు, సింగరాయకొండలో 5 నెలలు, మూలగుంటపాడులో 5 నెలలు, ఎన్జీపాడులో 4 నెలలు, బి.నిడమానూరు పంచాయతీలో 11 నెలల వరకు వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇవే కాకుండా ఇంకా జిల్లాలోని చాలా పంచాయతీల్లో పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు అందటం లేదు. నెలల తరబడి జీతాలు అందకపోవడం, దుకాణాలలో బకాయిలు పెరిగిపోవడంతో అప్పు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది.
నిద్రలేచి పంచాయతీలను శుభ్రం చేస్తున్నా కార్మికులకు నెలవారీ జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారంటూ సీఐటీయూ నాయకుల పివి శేషయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం జిల్లా పంచాయతీ అధికారి ఎన్‌ఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. వేతనాలపై ఫ్రీజింగ్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. పంచాయతీ కార్మికులకు కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం రోజు వారి వేతనం రూ.386 చెల్లించాలని డిమాండ్ చేశారు. అంటే నెలకు రూ.11, 580 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. స్వచ్ఛభారత్ పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప పారిశుద్ధ్య పనిలో ఉన్న కార్మికుల స్థితిగతుల గురించి ఆలోచించే తీరిక లేకపోవడం దారుణమని అన్నారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంతో పాటు టెండర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న 1028 పంచాయతీలలో కార్మికుల పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితి నుంచి కార్మికులను విముక్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.