వేతనం తీసుకోకుండా పనిచేస్తా: వివేక్
సాక్షి, హైదరాబాద్: తనకు నెలసరి వేతనం వద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. జీతం, హెచ్‌ఆర్‌ఏ లేకుండానే సలహాదారుగా కొనసాగేందుకు సమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఉన్న వివేక్ నియామక ఉత్తర్వుల్లో ప్రభుత్వం పలు సవరణలు చేస్తూ బుధవారం జీవో నం.468ను జారీ చేసింది.
నెల జీతం రూ.లక్ష, హెచ్‌ఆర్‌ఏ రూ.50 వేలను మినహాయిస్తున్నట్లు ఇందులో స్పష్టం చేసింది. నెలసరి కన్వేయెన్స్ అలవెన్స్ రూ.30 వేలు, ఇంధన ఖర్చు రూ.15 వేలు చెల్లిస్తా మని నిబంధనల్లో మార్పులు చేసింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ కల్పించింది.