డీప్ ఫేక్ బారిన రష్మిక, కత్రినా..రక్షణ కోసం ఏం చేయాలంటే..!
టాలీవుడ్ నటి రష్మిక మందన్న, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఢీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సాంకేతికతో వస్తున్న విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకుని కొందరూ ఈ దురాగతాలకు పాల్పడుతున్నారు. ప్రముఖుల, సెలబ్రెటీలనే గాక సాధారణ మహిళలు సైతం బాధితులుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో 37% ఈ ఫోటో లేదా వీడియో మార్ఫింగ్ ఫేక్ కేసులే అధికంగా వస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. బాధితుల పరువు ప్రతిష్ట దిగజార్చి వారిని నానారకాలుగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న ఉదంతాలెన్నో తెర మీదకు వస్తున్నాయి. తెలిసో తెలియక ఇలా మీ ఫోటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ బారిన పడినట్లయితే వెంటనే ఏం చేయాలి? ఈ సమస్యను నుంచి సునాయాసంగా ఎలా బయటపడాలి తదితరాల గురించే ఈ కథనం!.
మార్ఫింగ్ అంటే..
మీ వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలు కొందరూ మార్ఫింగ్ టెక్నాలజీని ఉపయోగించి అశ్లీలంగా లేదా అభ్యంతరకరంగా మార్చి సోషల్ మీడియాలో వదులుతుంటారు. దీంతో ఒక్కసారిగా మీ వ్యక్తిగత పరువు, గౌరవం కోల్పోయినవాళ్లుగా మిగిలిపోతాం. ఇలాంటప్పుడూ తెలియకుండానే మన మానసిక స్థితి బలహీనమవుతుంది. దీన్నే ఆసరాగా తీసుకుని మీ నుంచి లబ్ధి పొందే కుట్రకు తెగబడుతుంటారు ఆన్లైన్ నేరగాళ్లు. నిజానికి ఏ వ్యక్తి అయినా ఈ స్థితిలో మానసికంగా నిలువునా కూలబడిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని బాగున్నప్పుడే ధైర్యంగా ఉండటం వేరు.
పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడూ తట్టుకుని నిలబడేవాడు నిజమైన ధైర్యవంతుడు అని గుర్తించుకోండి. ఇక్కడ మీకు కావల్సింది మానసిక స్థితిని స్ట్రాంగ్ ఉండేలా చేసుకోవడమే మీ మొట్టమొదటి తక్షణ కర్తవ్యం. ఆ తర్వాత మీ బాధని, ఆవేదనని అర్థం చేసుకునేవాళ్లు లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసి, సాయం చేస్తారనుకునేవాళ్లకు అసలు విషయాన్ని చెప్పాలి. కనీసం మీకు అలా సాయం చేసేవాళ్లు లేకపోతే సైబర్‌క్రైం, షీ టీం వంటి విమెన్ సంరక్షణ కోసం వస్తున్న పోలీసు విభాగాలను ఆశ్రయించి ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
డీప్ ఫేక్ వీడియోలు ఎలా గుర్తించొచ్చంటే..
డీప్ ఫేక్ వీడియోలను గుర్తించొచ్చు. ఎందుకంటే మన వాళ్లు లేక మనమో దీనికి గురైతే పరిస్థితిని వివరించడానికి ఇది ఉపకరిస్తుంది. ఎప్పుడైనా ఇలా ఏఐ సాంకేతతో డీప్ ఫేక్ వీడియోలు చేసినట్లయితే..ఆ వీడియోలను నిశితంగా గమనిస్తే వాటి ఆడియో సీన్లో వ్యక్తి ముఖకవళికలను గమనించాలి. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్‌ని గమనించినా అర్థమైపోతుంది అది ఫేక్ అని. అలాగే విజువల్స్ కూడా క్లారిటీగా ఉండవు. ఇలా ఫోటోలు, వీడియోలు మార్చే సాంకేతిక తోపాటు అలాంటి వాటిని గుర్తించే టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. అలాంటి డీప్ ఫేక్ వీడియోలు లేదా ఫోటోలు గుర్తించే టూల్స్ ఏంటంటే..
సెంటినెల్
ఇంటెల్ రియల్-టైమ్ డీప్‌ఫేక్ డిటెక్టర్
WeVerify (వీ వెరీఫై)
మైక్రోసాఫ్ట్ వీడియో ప్రమాణీకరణ సాధనం
Phoneme-Viseme టూల్
తక్షణమే చేయాల్సిన మరోపని
ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని సాయం చేసేలా కొన్ని హెల్ప్లైన్ల అందుబాటులో పెట్టారు. అలాగే ముఖ్యంగా 18 ఏళ్ల నిండని చిన్నారుల సైతం బాధితులవ్వకూడదననే ఉద్దేశ్యంతో కొన్ని ఆన్లైన్ చారిటీ సంస్థలు సాంకేతికతో కూడిన ప్రముఖ టూల్స్‌ని కూడా తీసుకొచ్చాయి. నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కంప్లైయింట్ ఇవ్వడానికి భయపడే బాధితుల కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ముందుగా హెల్ప్‌లైన్ నెంబర్ 1902కి కాల్ చేసి మీ ఫోటో లేదా వీడియోలు మార్ఫింగ్ అయినా వాటి గురించి పూర్తి వివరాలను తెలియజేయాలి.
ఆ తర్వాత వెబసైట్ లింక్‌లో https://stopncii.org/ మీ ఒరిజన్‌ల ఫోటో తోపాటు మార్ఫింగ్‌కి గురైన ఫోటోను అప్లోడ్ చేయాలి. అంతే మీ ఫోటో ఇంటర్నెట్లో ఎక్కడ ఉన్నా వెంటనే డిలీట్ అయిపోతుంది. ఈ వెబ్సైట్ మీ గోప్యతను కాపాడుతుంది. బాధితులకు మద్దతుగా ఉండేందుకు రూపొందించిన వెబ్సైట్ ఇది. ఇది 2000లో ప్రారంభమైంది. ఆన్లైన్లో బాధితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య వాటాదారులతో కలిసి పనిచేస్తుంది.
వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో షేర్ చేసేటప్పుడూ..
సోషల్ మీడియా ఖాతాలలో మీ డేటాను గోప్యంగా ఉంచండి
మీ వ్యక్తిగత చిత్రాలను ఆన్లైన్లో పబ్లిక్‌గా ఎప్పుడూ షేర్ చేయవద్దు
చిత్రాలను పంచుకునేటప్పుడు వాటర్‌మార్క్ ఉపయోగించండి
మీ సోషల్ మీడియా ఖాతాల స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లతో రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి.
అనుకోని సంఘటన ఎదురైతే తెలియజేసేలా అందుకు సంబంధించిన సాక్ష్యం, స్క్రీన్ షాట్లను సేవ్ చేయండి.
బాధితులు తీసుకోవాల్సిన చర్యలు
సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదున నమోదు చేయండి
cybercrime.gov.inలో మీ వివరాలు చెప్పకుండా కూడా ఆన్లైన్ ఫిర్యాదును నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది.
అలాగే సోషల్ మీడియా ఖాతా సహాయ కేంద్రానికి నివేదించండి
ఈ నేరానికి సంబంధించిన చట్టాలు
ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66,37 వంటి కేసులు పెట్టోచ్చు
ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసినందుకు, చీటింగ్ చేసినందుకు సెక్షన్ 354(డీ), 465, 463 వంటి కేసులు పెట్టొచ్చు
బాధితులు చిన్న పిల్లలైతే చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన సెక్షన్ 14, 15 వంటి బలమైన కేసులు పెట్టొచ్చు. వీటికి జైలు శిక్ష, భారీ మొత్తంలో జరిమాన విధించడం జరుగుతుంది.
(చదవండి: ఆర్ట్ సైంటిస్ట్! ఆర్ట్, సైన్సును కలిపే సరికొత్త కళ!)