ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫొటో మార్ఫింగ్, ఇద్దరి అరెస్ట్
కార్గాన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఫోటోను మార్ఫింగ్ చేసిన ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ భగవత్ ఫోటోను అభ్యంతరకంగా మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ఆ ఫోటో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేయడం మధ్యప్రదేశ్లో కలకలం సృష్టించింది.
22 ఏళ్ళ షాఖిర్, 20 ఏళ్ళ వసీమ్ అనే యువకులు మోహన్ భగవత్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి భికన్ గోన్ పట్టణంలోని స్థానిక సోషల్ నెట్ వర్కింగ్ గ్రూప్లో పోస్టు చేశారు. కాగా ఆ ఫొటోను మార్చి 16న పోస్టు చేసినట్లు గుర్తించామని, వారిద్దరినీ అరెస్టు చేసినట్లు ఏఎస్పీ అంతర్ సింగ్ కనేష్ వెల్లడించారు.
మరోవైపు మోహన్ భగత్ మార్ఫింగ్ ఫొటోపై ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరికీ వ్యతిరేకంగా ఐటీ చట్టం సెక్షన్ 67, భారత శిక్షాస్మృతి 505 (2) సెక్షన్లకింద భికాన్ గాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కోర్టు వారిద్దర్ని ఈనెల 30 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే నిందితులు మాత్రం తమకు ఆ ఫొటో మరో గ్రూప్ నుంచి వచ్చిందని, కేవలం దాన్ని తాము పోస్టు చేసినట్లు చెప్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు.