'మోహన్ భగవత్ ప్రగతిశీల ఆలోచనాపరుడు'
ఆలయాల్లో స్త్రీల ప్రవేశం కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్... తమ హక్కుల పోరాటంలో మోహన్ భగవత్ వైఖరిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారు. తాజాగా ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలంటూ డిమాండ్ చేసిన ఆమె... మోహన్ భగవత్ జీ ప్రగతిశీల ఆలోచనాపరుడు అంటూ ప్రశంసలు కురిపించారు. ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలన్న తమ వైఖరిని ఆయన గౌరవిస్తారని భావిస్తున్నానన్నారు.
స్త్రీ, పురుష సమాన హక్కుల కోసం పోరాటంలో భాగంగా తృప్తిదేశాయ్ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలన్న తమ డిమాండ్ ను మోహన్ భగవత్ గౌరవిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. తాము సాధించాలని ప్రయత్నిస్తున్న హక్కులపై సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తమ వైఖరిని తెలియజేయాలన్నారు. ఆ విధంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ సమానత్వంకోసం పోరాడుతున్న తమకు.. మద్దతు పలుకుతుందని నమ్ముతున్నట్లు తృప్తి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రీయ సేవికా సమితి ద్వారా మహిళలు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆర్ ఎస్ ఎస్ లో ప్రత్యక్షంగా సభ్యంత్వం కోసం తృప్తి డిమాండ్ ను లేవనెత్తారు.
తృప్తిదేశాయ్ పోరాటంతో ఇటీవలే శని సింగనాపూర్, నాసికా త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే తృప్తి తాజా డిమాండ్ పై మాట్లాడిన బిజెపి ఉపాధ్యక్షుడు కాంత నలవాడే మాత్రం ఆమె డిమాండ్లు అర్థరహితమని, అనవసరమైన సమస్యలు సృష్టించకుండా.. మహిళలను వేధిస్తున్న ఇతర సమస్యల పరిష్కారానికి పోరాడితే మంచిదని సూచించారు.