ఐ ఫోన్ ను గన్‌తో పేల్చేసింది!
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు లేని జీవితాన్ని ఊహించలేం. ఫోన్ వాడకం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల చేతుల్లో కూడ ఐఫోన్లు, యాండ్రాయిడ్స్ కనిపించడం సాధారణంగా మారిపోయింది. అంతేకాదు తల్లిదండ్రులతో ఏమాత్రం సంబంధం లేకుండా పిల్లలు ఫోన్లకే అతుక్కుపోతున్న జాడ్యం రాను రాను పెరిగిపోతోంది. ఇటువంటి మితిమీరిన వినియోగం ఒక్కోసారి పిల్లలపట్ల తల్లిదండ్రులకు ఏహ్యభావాన్ని, విసుగును, చికాకును కూడ తెప్పిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న ఓ వీడియో అందుకు తార్కాణంగా నిలుస్తోంది.
యాండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో లేని కాలంలో కుటుంబ సభ్యుల మధ్యా... తల్లిదండ్రులు, పిల్లల మధ్యా కాస్తో కూస్తో ఉండే సంబంధాలు.. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పూర్తిగా తగ్గిపోతున్నాయి. అదే నేపథ్యంలో తన పిల్లలు విసుగు వచ్చేంత ఎక్కువగా ఐ ఫోన్ వాడటం, సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోవడం చూసి విసుగు చెందిన ఓ తల్లి భరించలేకపోయింది. పిలిచినా పలక్కుండా ఉండే మితిమీరిన ఫోన్ వాడకం ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అందుకే తన పిల్లలు వాడుతున్న ఐ ఫోన్ ను గన్ తో పేల్చేసింది. ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతూ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది.
సామాజిక మాధ్యమాల మోజులో తన మాటలను కూడ పట్టించుకోని పిల్లల ప్రవర్తనకు ఆ తల్లి విసుగు చెందిపోయింది. అందుకే ఓ చెట్టు కొమ్మపై ఐ ఫోన్ ను పెట్టి గన్ తో పేల్చేసింది. అయినా ఆమె కోపం చల్లారలేదు. కొమ్మ పైనుంచి తెచ్చి, సుత్తితో చితక్కొట్టేందుకు ప్రయత్నించింది. తిరిగి మరోసారి ఫోన్ పై తుపాకీతో తన ప్రతాపం చూపించింది. తన పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యమని, దాని ముందు ఎంతటి ఎలక్ట్రానిక్ వస్తువైనా పనికిరాదంటూ ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది.