చెవిలోన జోరీగ..
చెప్పులోన రాయి.. చెవిలోన జోరీగ.. అని ఓ పద్యం ఉంది. ఇంగ్లండ్‌లో ఓ మధ్యవయస్కుడికి సరిగ్గా ఇలాంటి బాధే ఎదురైంది. మూడు రోజుల క్రితం చెవిలో దూరిపోయి, అప్పటినుంచి తలలో గుయ్యిమంటూ తెగ ఇబ్బందిపెడుతున్న ఆ జోరీగను తీయించుకోడానికి రాబ్ ఫీల్డింగ్ (43) అనే వ్యక్తి ఆస్పత్రికి పరుగెత్తాడు. దాంతో అక్కడి వైద్యులు గంటన్నర పాటు కష్టపడి శస్త్రచికిత్స చేసి, అప్పటివరకు బతికున్న ఆ జోరీగను బయటకు తీశారు.
ఫీల్డింగ్ మంచం మీద పడుకుని చదువుకుంటుండగా ఆ జోరీగ ముందు అతడి కళ్లజోడు మీద వాలింది. దాన్ని తరిమేస్తుంటే, తాను ఊరుకుంటానా అంటూ చెవిలోకి దూరిపోయింది. అది తన తలలోనే తిరుగుతున్నట్లు అనిపించిందని అతడు గోలపెట్టాడు. ఏం జరిగిందో నర్సులు చెప్పేసరికి తాను షాకయ్యానని, ముందు చెవిలో లైటు వేసి చూస్తే ఒక కాలు మాత్రమే వాళ్లకు కనపడిందని చెప్పాడు. చెవిలో దాదాపు 2 సెంటీమీటర్ల లోతున కర్ణభేరికి సమీపంలోనే ఉండటంతో చాలా నొప్పి పుట్టిందన్నారు. ఓ గరాటును చెవిలో దూర్చి, మార్గాన్ని వెడల్పు చేసి, ఆ జోరీగను చిన్నపాటి శ్రావణం (ఫోర్సెప్స్)తో బయటకు తీశారు. అలా తీసే క్రమంలో జోరీగ చచ్చిపోయింది. ఫీల్డింగ్ దాన్ని భద్రంగా ఓ జార్లో దాచుకున్నాడు.