ప్రమాదం నా కారు వల్ల జరగలేదు
పట్నా: ఆదివారం జరిగిన కాన్వాయ్ ప్రమాదంపై కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ స్పందించారు. ప్రమాదం తన వాహనం వల్ల జరగలేదని వివరణ ఇచ్చారు. తన కాన్వాయ్ లోని జీపు ఢీకొని ఆ యువకుడు మృతి చెందాడని ఆయన మీడియాకు తెలిపారు. పాట్నా జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో యువకుడిని తన కారు ఢీకొట్టలేదని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని రామ్ కృపాల్ తెలిపారు. ఇప్పటికే యువకుడి కుటుంబానికి సాధ్యమైనంత సహాయం చేశానని, మృతుని బంధువులను కలిసి సానుభూతి తెలిపానని వెల్లడించారు. ఆ యువకుడు తమ బిడ్డలాంటివాడని వ్యాఖ్యానించారు.
అయితే తన కాన్వాయ్‌లోని ఒక వాహనం మాత్రమే యువకుడిని ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడని సెలవివ్వడం విమర్శలకు తావిస్తోంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. మంత్రి ఎస్కార్ట్ జీపు ఢీకొట్టడంతోనే యువకుడు మృతి చెందినప్పటికీ... తన కారు యువకుడిని ఢీకొట్టలేదని విడ్డూరంగా సమాధానం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..
కాగా ఆదివారం ఉదయం కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ వెళుతుండగా ఆయనకు రక్షణగా వస్తున్న కాన్వాయ్ లోని వాహనం డెహ్రాడూన్ గ్రామంలో రాహుల్ కుమార్ (18 ) యువకుడు బైక్ పై వస్తుండగా ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, కారు పూర్తిగా పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.