జనాభా, ఎంపీల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోవాలి
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల్లో ఓటింగ్ జరిగినప్పుడు ఓటింగ్ వెయిటేజీకి రాష్ట్రాల జనాభాను గానీ, రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల సంఖ్యను గానీ ప్రాతిపదికగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. గురువారం ఇక్కడ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు.
అలాగే కేంద్రం గానీ, రాష్ట్రాలు గానీ ప్రతిపాదనలు సమర్పించినప్పుడు ఏదైనా కారణంతో కేంద్రం ఓటింగ్లో పాల్గొననప్పుడు ఏం చేయాలన్న విషయంలో నిర్ధిష్ట నిబంధన ఉండాలని సూచించారు. సీజీఎస్టీ, ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీ చట్టాలను అమలులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలని, అయితే 2017 ఫిబ్రవరి మాసాంతంలో పూర్తయ్యేలా గడువు పెట్టాలని కోరారు.