తెలంగాణకు రాజు అయినా...
హైదరాబాద్ : తెలంగాణకు రాజు అయినా ....గురువు ముందు మాత్రం ఆయన ఇప్పటికీ విద్యార్థే. తనకు విద్య నేర్పిన ఉపాధ్యాయుడిని ఆయన మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవటమే కాకుండా, ఆయనను తగిన రీతిలో సత్కరించారు. అంతేకాకుండా గురువుకు చేతులు జోడించి వినయంగా నమస్కరించారు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా?... ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తనకు చిన్నప్పుడు తెలుగు పాఠాలు నేర్పిన మృత్యుంజయ శర్మను కేసీఆర్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. మృత్యుంజయ శర్మ మెదక్ జిల్లా దుబ్బాక మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశారు.
కాగా అమ్మ జన్మ ఇస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడని . గురువు మంచి వ్యక్తి అయితే రాయి కూడా పాఠం నేర్చుకుంటుందని కేసీఆర్ ...ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన గురువు మృత్యుంజయ శర్మ ఫీజు లేకుండా పాఠాలు చెప్పారని..తాను ఇలా మాట్లాడుతున్నానంటే గురుదేవులు పెట్టిన అక్షర భిక్షేనని ఆయన గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే.