పాస్‌పోర్టులు 5 శాతమే
చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేష్కుమార్ పర్దేశి, ఆర్పీవో డాక్టర్ శ్రీకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకీ విసృ్తతమవుతున్న విద్య, ఉపాధి అవకాశాల నేపథ్యంలో దేశంలో పాస్‌పోర్టుల కోసం గిరాకీ బాగా పెరిగినా వంద కోట్లకు పైగా ఉన్న భారతావనిలో ఐదు శాతం మందికి మాత్రమే పాస్‌పోర్ట్‌లు ఉన్నట్లు వెల్లడైంది. అందులోనూ దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి పాస్‌పోర్టులు పొందిన వారు 55 % వరకు ఉండటం గమనార్హం. పాస్‌పోర్ట్‌ల జారీ, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, కరీంనగర్లో పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రం ఏర్పాటుపై జాతీయ చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేష్కుమార్ పర్దేశి, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో చలామణిలో (వాల్యూడ్) ఉన్న పాస్‌పోర్ట్‌లు 5.19 కోట్లు మాత్రమేనని వివరించారు. అతి చిన్న వయసు వారిలో 2 రోజుల బిడ్డకు పాస్‌పోర్ట్ ఇవ్వగా పెద్ద వయసు వారిలో 116 ఏళ్ల వ్యక్తికి పాస్‌పోర్ట్ ఇచ్చినట్లు చెప్పారు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం నిబంధన వివరాలను స్థానిక భాషల్లోనూ త్వరలో వెబ్సైట్లో అందుబాటులోకి తేనున్నారు. కరీంనగర్లో పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రం ఈనెల 8న ప్రారంభం కానుంది. జిల్లా వాసులు పాస్‌పోర్టు కోసం ఇక అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు.
వచ్చే ఏడాదినుంచి ఈ-పాస్‌పోర్ట్
వచ్చే ఏడాది నుంచి దేశంలో ఈ-పాస్‌పోర్ట్ విధానం అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జారీ చేస్తున్న పాస్‌పోర్ట్‌లకే చివరి పేజీలో ఓ ఎలక్ట్రానిక్ చిప్‌ను అమరుస్తారు. పాస్పోర్ట్దారుడి ఫొటోలతోపాటు వేలిముద్రలు, సంతకం ఇందులో పొందుపరుస్తారు. నకిలీ పాస్‌పోర్ట్‌లకు ఆస్కారం ఉండదు. దీనికి సంబంధించి విదేశాంగ శాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి.
కానిస్టేబుళ్లకు పామ్టాప్లు: ఇకపై పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ త్వరగా నిర్వహించేందుకు తనిఖీ కోసం వచ్చే కానిస్టేబుళ్లకు పామ్‌టాప్(ల్యాప్‌టాప్‌ల తరహా)లు అందిస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ విధానం విజయవంతమైంది. ఇప్పటివరకు పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పోలీస్ వెరిఫికేషన్ పత్రాలు పోస్ట్‌లో వెళుతున్నాయి. ఇకపై మెయిల్ ద్వారా పామ్టాప్కు పంపుతారు. సర్కిళ్ల వారీగా కానిస్టేబుళ్లు వీటిని అందుకుని విచారణ జరిపి ఎస్పీకి నివేదిక ఇస్తారు. అక్కడ వెరిఫికేషన్ తరువాత డిజిటల్ సంతకాలతో కూడిన పత్రాలను తిరిగి మెయిల్ ద్వారా పాస్‌పోర్ట్ కార్యాలయానికి చేరవేస్తారు. ఇదంతా 3 రోజుల్లో పూర్తవుతుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పైలట్ ప్రాతిపదికన ఈ విధానం ప్రారంభించనున్నట్టు శ్రీకర్‌రెడ్డి తెలిపారు.
తొలి స్థానంలో హైదరాబాద్: పాస్‌పోర్ట్ కార్యాలయాల పరంగా హైదరాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీసు 2013లో 6.4 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 4.6 లక్షల పాస్‌పోర్టుల జారీతో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. రాష్ట్రాల పరంగా చూస్తే 7.84 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. కేరళలో 9.4 లక్షలు, తమిళనాడులో 8.5 లక్షలు, మహారాష్ట్రలో 8.2 లక్షల పాస్‌పోర్టులు జారీ చేశారు.
రూ.30 కోట్లతో సికింద్రాబాద్‌లో కొత్త కార్యాలయం
ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఉన్న పాస్‌పోర్ట్ కార్యాలయం స్థానంలో కొత్త కార్యాలయాన్ని నిర్మించనున్నారు. దీనికోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పాస్‌పోర్ట్ కార్యాలయంతోపాటు అధికారుల నివాస గృహాల సముదాయం కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు.
2013లో పాస్‌పోర్ట్‌ల జారీ ఇలా
- 2013లో జారీ చేసిన పాస్‌పోర్ట్‌లు 84.86 లక్షలు. ఇందులో భారత్‌లో 72.76 లక్షలు జారీ చేస్తే మిగతావి వివిధ దేశాల్లోని ఎంబసీలు, కాన్సులేట్‌ల్లో జారీ చేశారు.
- పాస్‌పోర్ట్‌లు పొందుతున్న వారిలో 66% మంది పురుషులు కాగా 34 మంది మహిళలున్నారు.
- 19% మంది విద్యార్థులు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. పట్టభద్రుల దరఖాస్తులు 29% పైనే.
- సగటున పాస్‌పోర్టు దరఖాస్తుదారుల్లో 31 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉన్నారు.
- రాష్ట్రంలో తత్కాల్ దరఖాస్తుల సంఖ్య 30 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది.
- దేశవ్యాప్తంగా 2013లో పాస్‌పోర్టుల జారీ ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం లభించగా, హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి రూ. 103 కోట్ల ఆదాయం సమకూరింది.