Mulkanoor
-
హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూర్ ఎస్సీ బాలికల హాస్టల్లో భూక్య రజిత అనే విద్యార్థిని సోమవారం రాత్రి నేయిల్‌పాలిష్ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. హుస్నాబాద్ మండలం మైసమ్మవాగుతండాకు చెందిన రజిత ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె తన గదిలో నేయిల్‌పాలిష్ తాగగా గమనించిన విద్యార్థులు మ్యాట్రిన్ ఉమకు తెలిపారు. ఆమె వెంటనే రజితను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. రజితకు ప్రాణపాయం లేదని తెలిసింది. -
ప్రియుడి వంచన తట్టుకోలేక..
యువతి ఆత్మహత్య సుందరగిరిలో ఘటన చిన్నముల్కనూర్‌లో బంధువుల ఆందోళన చిగురుమామిడి : ప్రియుడి వంచన భరించలేక ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ప్రియుడే కారణమని మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. దీంతో బంధువులు మృతదేహంతో ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన ఎనగందుల యశోద–రాయమల్లు దంపతుల కూతురు సుజాత(23) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. ఈమెకు చిన్నముల్కనూర్‌కు చెందిన దొబ్బల మహేశ్‌తో ఐదేళ్లక్రితం పరిచయం ఏర్పడింది. మహేశ్‌కు ఇదివరకే పెళ్లయింది. ప్రస్తుతం అతడి భార్య గర్భిణి. ఈ విషయం దాచాడు. క్రమంగా వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దలకు తెలిసింది. దీంతో మహేశ్ తాను సుజాతను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సుజాతకు వచ్చే రూ.11వేల వేతనాన్ని మహేశ్ వాడుకున్నాడు. సుజాత డబ్బులతో ఓ ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సుజాత తనను పెళ్లి చేసుకోవాలని మహేశ్‌ను వారం రోజులుగా ఒత్తిడిచేస్తోంది. దీంతో మహేశ్ తనకు రూ.5లక్షల కట్నం, ఎకరం పొలం ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పేదవారైన సుజాత తల్లిదండ్రులు తమకున్న 20గుంటల పొలం ఇస్తామని చెప్పారు. శుక్రవారం సుజాత తల్లి యశోద మహేశ్ ఇంటికి వెళ్లి తన బిడ్డను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే మహేశ్, అతడి తండ్రి చంద్రయ్య ఆమెను దూషించి పంపించారు. విషయం తెలుసుకున్న సుజాత మనస్తాపం చెందింది. మహేశ్ ఇక తనను పెళ్లిచేసుకోడని భావించింది. ‘మమ్మి నన్ను క్షమించు. మహేశ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడిని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోలేను. ఆయనే నా ప్రాణం.. ఐదు లక్షల కట్నం ఇవ్వమనడం బాధ కలిగించింది. ఇప్పుడు మహేశ్ తన మరదలుతో తిరుగుతున్నాడు. ఇది నాకు నచ్చలేదు. నా చావుకు మహేశ్ కారణం’ అని రాత్రి మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి గదిలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికి చనిపోయింది. మృతదేహంతో ఆందోళన సుజాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం చిన్నముల్కనూర్‌లోని మహేశ్ ఇంట్లో వేసి ఆందోళనకు దిగారు. అతడి తల్లి రాజమ్మను మహిళామండలి సభ్యులు చితకబాదారు. ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటుచేశారు. బంధువులు హుస్నాబాద్–కరీంనగర్ రహదారిపై గంటసేపు ధర్నా చేశారు. మహేశ్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు. పొద్దుపోయాక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఈ సంఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. హత్యానేరం కింద శిక్ష అనుభవించిన మహేశ్.. మహేశ్ గతంలో ఒక హత్యానేరంలో శిక్ష అనేభవించాడు. 2011, జూన్ 26న చిన్నముల్కనూర్‌కు చెందిన బోనగిరి ఎల్లయ్య–కనుకమ్మ దంపతుల ఏకైక కుమారుడు అక్షయ్(11)ను హత్య చేశాడు. అక్షయ్ అక్కను పెళ్లి చేసుకున్న మహేశ్ ఆస్తి కోసం బండరాయితో కొట్టి చంపేశాడు. అక్షయ్ తల్లిదండ్రులకు ఉన్న ఎకరం భూమి కోసం ఈఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. -
పాడిని పెంచి...కరువును తరిమి
లాభాల బాటలో ‘మిల్క్’నూర్ స్వకృషి డెయిరీ రూ. 88కోట్లతో వ్యాపారం నేడు 14వ మహాసభ భీమదేవరపల్లి: ఓ వైపు అనావృష్టి వెంటాడగా మరో వైపు అప్పుల బాధ తీవ్రమైంది. గత్యంతరం లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దైనందిన రోజులవి. మెట్ట ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేక వర్షాలు సక్రమంగా కురవక గ్రామల ప్రజలు కరువుతో అల్లాడిపోయారు. కుటుంబాల్లో దర్భర పరిస్థితులు చూసిన మహిళలు మొక్కవోని ధైర్యంతో ముందడుగువేశారు. పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పైసా పైసా కూడబెట్టుకొని సమష్టిగా సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. క్రమక్రమంగా గ్రామాల్లో సంఘాలను విస్తరించుకొని పొదుపు ద్వారా కూడబెట్టుకున్న డబ్బులతోనే ముల్కనూర్ మహిళ స్వకృషి డెయిరీని ఏర్పాటు చేసుకున్నారు. నేడు ఆ డెయిరీ లాభాసాటిగా వ్యాపారం సాగిస్తూ అనేక కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారింది. మండలంలో ముల్కనూర్ స్వకృషి స్థాపించి 13 ఏళ్ళు పూర్తి చేసుకొని 14వ వసంతంలోకి అడుగిడుతున్న తరుణంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రారంభం... కరీంనగర్, వరంగల్ జిల్లాలోని 72 గ్రామాల్లో 6 వేల మంది సభ్యులు రూ.7 కోట్లతో మండలంలోని ముల్కనూర్‌లో 2002 ఆగస్టు 17న మహిళ స్వకృషి డెయిరీ ప్రారంభించారు. క్రమంగా వ్యాపారం విస్తరించడంతో ప్రస్తుతం 131 గ్రామాల్లో 21 వేల సభ్యులతో రూ.88 కోట్ల వ్యాపారం చేస్తూ లాభాల బాటలో డెయిరీ పయనిస్తుంది. ప్రతి రోజు సంఘాల నుంచి 45 వేల పై చిలుకు లీటర్ల పాలను సేకరిస్తూ 22 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. అవినీతికి చెక్... అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి గ్రామంలోని పాల సంఘాన్ని కంప్యూటరీకరించారు. సంఘానికి, డెయిరీకి కంప్యూటీకరణ ఉండడంతో ప్రతి రోజు ఏ గ్రామం నుంచి ఎన్ని పాలు సేకరించారు అనే విషయం ఆన్లైన్లో తెలుస్తోంది. దీంతో అవినీతికి ఆస్కారం ఉండదు. పాలు సేకరించగానే వెన్న శాతం, డబ్బులు సభ్యురాలి పాసుబుక్కులో నమోదు చేస్తారు. ఫలితంగా ఏ రోజు ఎన్ని డబ్బులు వచ్చాయనే విషయం సభ్యురాలికి తెలుస్తోంది. 15 రోజుల కొకమారు సంఘంలో సభ్యులకు పాల బిల్లును అందిస్తారు. వైఎస్సార్ సందర్శన అభివృద్ధి బాటలో నడుస్తోన్న డెయిరీని చూసేందుకు వివిధ దేశాల ప్రతినిధులు ఇక్కడికి వస్తుంటారు. సీఎం హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006 మార్చి 18న ముల్కనూర్‌కు వచ్చి ఇక్కడి విషయాలను తెలుసుకుని మహిళలకు కితాబునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ నర్సింహాన్ సైతం డెయిరీని సందర్శించారు. నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు సభ్యులకు డెయిరీ అందిస్తున్న సేవలకు గానూ 2012 డిసెంబర్ 6న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా డిల్లీలోఅధ్యక్షురాలు కడారి పుష్పలీల, జీఎం భాస్కర్‌రెడ్డిలు ఉత్తమ సహాకార సంఘ ఆవార్డును అందుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకు మూడు పర్యాయాలు డెయిరీకి ఐఎస్వో గుర్తింపు లభించింది. డెయిరీ అందిస్తున్న సేవలు పశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నారు. దాణా, తౌడు, గడ్డి గింజలు, మినలర్ మిక్షర్, వ్యాధినిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణతో పాటు పశుభీమా సౌకర్యాన్ని కూడ డెయిరీ కల్పిస్తుంది. క్షేత్ర స్థాయిలో పాడి పశువుల పెంపకం, ఆహారం, యాంత్రీకరణ అంశాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. సంఘ సభ్యులు, నామినీలు మరణిస్తే కుటుంబాలకు రూ. 2వేల చొప్పున అందిస్తున్నారు బోనస్ పంపిణీ ఈ నెల 31న ముల్కనూర్ స్వకృషి డెయిరీలో 14 వ మహాసభ నిర్వహిస్తున్నట్లు డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల, జీఎం భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది వ్యాపారం ద్వారా వచ్చిన లాభాల నుంచి రూ. 5.73 కోట్ల బోనస్‌ను సంఘాలకు అందించనున్నారు. పదమూడేళ్ళుగా రూ.20.90 కోట్ల బోనస్‌ను పంపిణీచేశారు. మహాసభకు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. -
24న ముల్కనూరుకు సీఎం రాక
చిగురుమామిడి : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దత్తత గ్రామమైన మండలంలోని చిన్న ముల్కనూర్‌కు ఈ నెల 24న వస్తారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ తెలిపారు. బొమ్మనపల్లిలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఈ నెల 22న రావాల్సి ఉండగా, గ్రామజ్యోతి కార్యక్రమంలో బిజీగా ఉన్నందున పర్యటన 24న ఖరారైందని పేర్కొన్నారు. గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. తాను హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆరు గ్రామాలను తాను దత్తత తీసుకున్నప్పటికీ మిగిలిన గ్రామాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో రానున్న నాలుగేళ్లలో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. -
అమెరికాలో కరీంనగర్ జిల్లా వాసి మృతి
చిగురుమామిడి, న్యూస్‌లైన్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్‌కు చెందిన న్యాలకొండ అభినయ్‌రెడ్డి(22) అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, విమల దంపతులకు అభినయ్‌రెడ్డితోపాటు ఓ కూతురు ఉంది. వీరి కుటుంబం 30 ఏళ్లుగా కరీంనగర్‌లోనే నివాసం ఉంటోంది. కరీంనగర్లో బీటెక్ పూర్తి చేసిన అభినయ్‌రెడ్డి ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని తెహ్రాట్ అనే ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ నెల 4న అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లాడు. ఈ నెల 5న ఉదయం 10 గంటల ప్రాంతంలో(భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) మరణించాడు.