రెండు ‘ఎత్తిపోతల’కు పచ్చజెండా
తుమ్మిళ్ల, కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి నీటి తరలింపు పథకాలకు కేబినెట్ ఆమోదం
► కాళేశ్వరంలోని మల్లన్నసాగర్, ఇతర రిజర్వాయర్ల టెండర్ల ప్రక్రియకు ఓకే
► పాలమూరులోని ప్యాకేజీ–1, ప్యాకేజీ–16 మార్పులకు ఆమోదం
సాక్షి, హెదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి హక్కుగా ఉన్న నీటి వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చి, మరింత ఆయకట్టుకు నీరిచ్చేందుకు వీలుగా మరో రెండు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు శనివారం రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి రివర్సబుల్ పంపింగ్ విధానంలో శ్రీరాంసాగర్‌కు తరలించే ఎత్తిపోతలు, ఆర్డీఎస్ కింది ఆయకట్టుకు నీరిచ్చేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటే కాళేశ్వరంలో ప్రధాన రిజర్వాయర్‌గా ఉన్న మల్లన్నసాగర్ సహా ఇతర నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి సమ్మతం తెలిపింది.
సబ్ కమిటీ సిఫార్సులకు ఓకే..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం ఎల్లంపల్లి నుంచి వరద కాలువ (ఎప్ఎఫ్సీ) ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తరలిస్తూ అదనపు (సప్లిమెంటేషన్) ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎస్సారెస్పీని 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ పూడిక కారణంగా 80 టీఎంసీలకు తగ్గిపోయింది. ప్రాజెక్టు లక్ష్యం ప్రకారం 9 లక్షల 73 వేల ఎకరాలకు సాగునీరందడానికి 95 టీఎంసీ లు కావాలి.
ఎగువ ప్రాంతాల్లో బాబ్లీ వంటి ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీరాం సాగర్‌కు ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ఎస్సీరెఎస్పీలో 54 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉన్నది. ఈ దృష్ట్యా పూర్తి ఆయకట్టుకు నీరందించడం కష్టంగా మారింది. ఈ దృష్ట్యా దాదాపు రూ.650 కోట్ల వ్యయ అంచనాలతో 105 మెగావాట్ల విద్యుత్తుతో 31 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మించేలా ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ నీటి తరలింపు పథకాన్ని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో రోజుకు 0.75 టీఎంసీల నీటిని ఈ పధకం నుంచి సరఫరా చేసి మొత్తంగా 43 టీఎంసీలు తరలించేలా ఈ పథకాన్ని రూపొందించగా దీనికి కేబినెట్ ఓకే చెప్పింది. 10 నెలల్లో దీన్ని పూర్తి చేసేలా నీటి పారుదల శాఖకు సూచన చేసింది.
ఇక తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)కు ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగంలో ఏర్పడుతున్న లోటును పూడ్చేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టేందుకు కేబినెట్ సమ్మతించింది. నిజానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉన్నా 4 టీఎంసీలకు మించి వాడటం లేదు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30వేల ఎకరాలకు కూడా అందడం లేదు. ఈ దృష్ట్యానే తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టాలని నిర్ణయించారు. మొత్తంగా 90 రోజుల్లో 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేసి, ఈ ప్రణాళికకు మొత్తంగా రూ.780 కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టగా దీనికి ఆమోదం లభించింది.
పాలమూరు రెండు ప్యాకేజీల్లో మార్పులు..
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులోని ప్యాకేజీ–1, ప్యాకేజీ–16లో మార్పులకు కేబినెట్ ఓకే చేసింది. ప్యాకేజీ–1, 16లో గతంలో చేసిన డిజైన్ కాకుండా ప్రస్తుత డిజైన్లు, ప్రాధమ్యాలకు తగినట్లుగా మార్పులు చేసేందుకు ఓకే చెప్పింది. ముఖ్యంగా ప్యాకేజీ–1లో భూ ఉపరితల పంప్‌హౌజ్‌ను కాకుండా, భూగర్భ పంప్‌హౌజ్ నిర్మాణానికి ఆమోదం చెప్పింది.
ఈ మార్పుల కారణంగా ప్రాజెక్టుపై రూ.13కోట్ల భారం తగ్గుతోంది. ఇక ప్యాకేజీ–16లో భాగంగా ఉద్ధండాపూర్ రిజర్వాయర్ వద్ద స్టేజ్ పంప్‌హౌజ్ వద్ద ఓపెన్ చానల్, టన్నెల్లను ప్రతిపాదిస్తూ కాల్వల నిర్మాణం డిజైన్ చేయగా, ఇక్కడ ఆర్అండ్ఆర్, రైల్వే క్రాసింగ్ సమస్యలు వచ్చాయి. దీంతో ఓపెన్ చానల్ కాకుండా మొత్తంగా టన్నెల్ నిర్మాణం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీని వల్ల రైల్వే క్రాసింగ్‌తో పాటు, ఒక గ్రామాన్ని పూర్తిగా తప్పించవచ్చు. ఈ ప్యాకేజీలో జరుగుతున్న మార్పులతో ప్రభుత్వంపై రూ.16కోట్ల భారం తగ్గుతోంది.
మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల పనులు వేగిరం
ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. మల్లన్నసాగర్ సహా మరో నాలుగు రిజర్వాయర్ల పనులకు టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపట్టేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. మొత్తంగా రూ.10,876 కోట్లతో ఈ ఐదు రిజర్వాయర్లు చేపట్టాలని నిర్ణయిం చింది. 50 టీఎంసీలతో చేపట్టే మల్లన్నసాగర్ కు రూ.7,249.52కోట్ల అంచనా వేశారు.
రంగనాయకసాగర్ రూ.496.50కోట్లు, కొండ పోచమ్మకు రూ.519.70కోట్లు, గంధమల రూ.860.25కోట్లు, బస్వాపూర్‌కు రూ.1,751 కోట్లతో టెండర్లు పిలవాలని ఆదేశించింది. మిడ్‌మానేరు టెండర్లు రద్దుచేసి కొత్తగా టెండ ర్లు పిలిచి పనులు చేపట్టాగా, దీనిని కేబినెట్ ఓకే చేసింది. ఇక తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేయాలన్న సిఫార్సులకు ఆమోదం తెలిపింది.