Mullakatta Bridge
-
‘ముల్లకట్ట’ నేడు జాతికి అంకితం
♦ వరంగల్-ఖమ్మం సరిహద్దులో వంతెన ♦ రూ. 335 కోట్లతో 2.80 కిలోమీటర్లు ♦ తగ్గిన హైదరాబాద్- కోల్‌కతా దూరం ♦ సీఎం కేసీఆర్,కేంద్రమంత్రి గడ్కారీహాజరు సాక్షిప్రతినిధి, వరంగల్: తూర్పు భారతదేశానికి హైదరాబాద్‌తో అనుసంధానించే కీలకమైన ముల్లకట్ట బ్రిడ్జి సోమవారం జాతికి అంకితం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌గడ్కారీ ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం సమీపంలోని ముల్లకట్ట, ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరును మధ్య గోదావరి నదిపై 2.8 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ.335 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిపై ఆరు నెలలుగా రాకపోకలు సాగుతున్నాయి. అయితే, అధికారికంగా జనవరి 4న దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. దరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను అనుసంధానం చేసేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణంతో హైదరాబాద్-కోల్‌కతా మధ్య 190 కిలో మీటర్లు తగ్గింది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న రెండు మార్గాలు 1,678 కిలోమీటర్లు, 1,504 కిలో మీటర్లు ఉన్నాయి. ముల్లకట్ట బ్రిడ్జితో ఈ దూరం 1,488 కిలోమీటర్లకు తగ్గింది. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ బ్రిడ్జితో దగ్గరి మార్గాలు ఏర్పడ్డాయి. జాతీయ రహదారి విస్తరణ... తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లను కలుపుతూ హైదరాబాద్-భూపాలపట్నం రోడ్డును జాతీయరహదారిగా అభివృద్ధి చేయాలని 1998లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. గతంలో 202 జాతీయ రహదారిగా ఉన్న దీన్ని 163గా మార్చారు. జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్-ఆలేరు మధ్య నాలుగు వరుసలుగా అభివృద్ధి చేశారు. తాజాగా ఆలేరు-వరంగల్ మధ్య 99.10 కిలో మీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నిర్ణయించారు. సీఎం కేసీఆర్, కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్‌గడ్కారీ కలిసి సోమవారం జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండ వద్ద రహదారి విస్తరణ, ముల్లకట్ట బ్రిడ్జి ప్రారంభోత్సవ పనుల కార్యక్రమం జరగనుంది. ఎల్అండ్టీ సంస్థ జాతీయ రహదారి విస్తరణ పనులను దక్కించుకుంది. రూ. 1905 కోట్లతో ఈ పనులను చేయనున్నారు. రోడ్డు విస్తరణ కోసం 432.8 హెక్టార్ల భూములను సేకరించారు. గతంలో ఎన్నికల నియమావళి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. -
అడ్డుకట్టపై భక్తుల ఆగ్రహం
ముల్లకట్ట బ్రిడ్జిపై రాకపోకలు బంద్ సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై రాకపోకలను నియంత్రిం చేందుకు ఏర్పాటుచేసిన ఔట్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు గురువారం భక్తుల నిరసనను ఎదుర్కొవాల్సి వచ్చింది. మావోయిస్టులు లేనేలేరని చెప్పే పోలీ సులు.. పుష్కరస్నానం కోసం వచ్చే భక్తులకు ఇలా ఇబ్బంది కలిగించడం ఏమిటని ప్రశ్నించారు. బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు తమను అనుమతించాలంటూ ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు నడకదారిలో వచ్చేందుకు కొంతసేపు భక్తులను అనుమతించారు. మావోయిస్టులు వస్తారనే కారణం చూపుతూ ముల్లకట్ట బ్రిడ్జిపై భక్తుల రాకపోకలపై పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి నిషేధం విధిం చారు. మావోయిస్టుల అంశంతోపాటు పుష్కర పనులు చేసిన కాంట్రాక్టర్లను సంతృప్తి కలిగిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పుష్కర స్నానానికి అనుకూలంగాలేని ముల్లకట్టలో ఘాట్‌ను నిర్మించడంపైనే విమర్శలు తలెత్తుతున్నాయి. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని వరంగల్ జిల్లాలో గోదావరి తీరం వెంట మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్టలో పుష్కరస్నానాలకు అనుగుణంగా ఘాట్లను నిర్మిం చారు. ముల్లకట్ట వద్ద అవసరం లేకున్నా, సౌకర్యంగా ఉం డకున్నా రూ.4 కోట్లతో ఇక్కడ ఘాట్ నిర్మించి, నీటి పంపులు ఏర్పాటు చేశారు. పుష్కరాలు మొదలైనా ముల్లకట్ట వద్ద ఘాట్‌కు సమీపంలో గోదావరి ప్రవాహం లేదు. దీంతో భక్తులకు ఘాట్‌లో పుష్కరస్నానం చేసే సౌకర్యం లేకుండాపోయింది. ముల్లకట్టలో పుష్కరఘాట్ ఏర్పాటు ప్రతిపాదన తప్పనే విషయం బయటపడకుండా ఉండేం దుకు.. అధికారులు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల నిషేద నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. -
అన్నలొస్తారని...!
* ముల్లకట్ట బ్రిడ్జిపై రాకపోకలు నిషేధం * పుష్కరాల్లో ఖాకీల అప్రమత్తత సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణకు ఛత్తీస్‌గఢ్‌ను కలుపుతూ వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిపై మంగళవారం సాయంత్రం నుంచి రాకపోకలను నిషేధించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వారం క్రితం ప్రకటించారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అధికారికంగా ప్రారంభం కాకపోయినా... ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరు మీదుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లేవారు ఈ బ్రిడ్జి పైనుంచే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వెంకటాపురం మీదుగా ఆ జిల్లా నుంచి, సమీపంలోని ఛత్తీస్‌గఢ్ ప్రాంతం నుంచి భక్తుల రాకపోకలు మొదలయ్యాయి. పుష్కరాల రెండోరోజు బుధవారం ఈ రాకపోకలు కాస్త పెరిగాయి. గోదావరి తీరం అవతలివైపు(పూసూరు) ఉన్నవారు బ్రిడ్జిమీదుగా ముల్లకట్ట వైపునకు వచ్చి గోదావరిలో పుష్కరస్నానం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు అకస్మాత్తుగా గోదావరి బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించారు. గోదావరి అవతలి వైపు నుంచి వచ్చే వారిని పరిశీలించేందుకు ప్రత్యేకంగా పోలీసు ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. కాగా, నెలలుగా నిర్మాణాలు చేపట్టిన ఘాట్ వద్ద పుష్కర స్నానాలు చేయకుండా నియంత్రించడానికి పెద్ద కారణాలే ఉంటాయని జిల్లా అధికారుల్లో చర్చ జరుగుతోంది. అయితే, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న కాలంలో ఏటూరునాగారం అటవీప్రాంతం వారికి పెట్టనికోటగా ఉండేది. ప్రస్తుతం విప్లవ పార్టీల ప్రాభల్యం తగ్గింది. పోలీసులదే పైచేయి కావడంతో ఈ ప్రాంతంలోని మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాలను షెల్టర్‌జోన్‌గా ఎంచుకొని అక్కడ నుంచి కార్యకలపాలు సాగిస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో... గోదావరి అవతలివైపు నుంచి వచ్చే భక్తులతో కలిసి బ్రిడ్జి మీదుగా మావోయిస్టులు వరంగల్ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు వసమాచారం. పుష్కర స్నానం కోసం వచ్చే వారితో మావోయిస్టులు జిల్లాలోకి వచ్చి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సులువుగా వెళ్లే అవకాశం ఉంటుందని... భక్తుల రూపంలో వారు వస్తే ఎలాంటి తనిఖీలు చేపట్టేందుకు వీలుం డదని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గోదావరిపై బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలిసింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ రహదారిలో అక్కడక్కడ కంకర పోసి వదిలివేయడం పోలీసుల వ్యూహమేననే వాదనలు వినిపిస్తున్నాయి. రోడ్డు ఇలా ఉంటే ప్రయాణానికి అనుకూలంగా లేదని చెప్పి రాకపోకలను అడ్డుకోవచ్చని పోలీసులు యోచించినట్లు తెలుస్తోంది. పుష్కరాల సమయంలో బందోబస్తు కోసం వేలాది మంది పోలీసులు విధి నిర్వహణల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ సమయంలో బ్రిడ్జిపై స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తే... భక్తుల రూపంలో మావోయిస్టులు దాడులకు దిగే అవకాశాలు ఉందని పోలీసులకు సమాచారం వచ్చినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకే బ్రిడ్జిని మూసివేసినట్లు కనిపిస్తోంది. వర్షాలు పడి ముల్లకట్ట వద్ద గోదావరిలో నీరు బాగా చేరి పుష్కరస్నానాలు జరిగినా బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించాలనే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆమోదం పొందినట్లు తెలిసింది. పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు... ముల్లకట్ట బ్రిడ్జి వద్ద రెండు రోజుల క్రితం అవుట్‌పోస్టును ఏర్పాటు చేశారు. సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) పోలీసులు 24 గంటలు ఈ బ్రిడ్జి వద్ద కాపలా కాస్తున్నారు. వీరికి అదనంగా పుష్కరఘాట్ సమీపంలో మరో క్యాంపును ఏర్పాటు చేశారు. పుష్కరాలు ముగిసే వరకు ఎలాంటి రాకపోకలను అనుమతించబోమని ఔట్‌పోస్టులో ఉన్న పోలీసులు చెబుతున్నారు. దీంతో పుష్కరాల కోసం వచ్చే ఖమ్మం జిల్లా వాసులు నిరాశతో వెనుదిరిగిపోతున్నారు.