‘ముల్లకట్ట’ నేడు జాతికి అంకితం
♦ వరంగల్-ఖమ్మం సరిహద్దులో వంతెన
♦ రూ. 335 కోట్లతో 2.80 కిలోమీటర్లు
♦ తగ్గిన హైదరాబాద్- కోల్‌కతా దూరం
♦ సీఎం కేసీఆర్,కేంద్రమంత్రి గడ్కారీహాజరు
సాక్షిప్రతినిధి, వరంగల్: తూర్పు భారతదేశానికి హైదరాబాద్‌తో అనుసంధానించే కీలకమైన ముల్లకట్ట బ్రిడ్జి సోమవారం జాతికి అంకితం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌గడ్కారీ ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం సమీపంలోని ముల్లకట్ట, ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరును మధ్య గోదావరి నదిపై 2.8 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ.335 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిపై ఆరు నెలలుగా రాకపోకలు సాగుతున్నాయి. అయితే, అధికారికంగా జనవరి 4న దీన్ని జాతికి అంకితం చేయనున్నారు.
దరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను అనుసంధానం చేసేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణంతో హైదరాబాద్-కోల్‌కతా మధ్య 190 కిలో మీటర్లు తగ్గింది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న రెండు మార్గాలు 1,678 కిలోమీటర్లు, 1,504 కిలో మీటర్లు ఉన్నాయి. ముల్లకట్ట బ్రిడ్జితో ఈ దూరం 1,488 కిలోమీటర్లకు తగ్గింది. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ బ్రిడ్జితో దగ్గరి మార్గాలు ఏర్పడ్డాయి.
జాతీయ రహదారి విస్తరణ...
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లను కలుపుతూ హైదరాబాద్-భూపాలపట్నం రోడ్డును జాతీయరహదారిగా అభివృద్ధి చేయాలని 1998లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. గతంలో 202 జాతీయ రహదారిగా ఉన్న దీన్ని 163గా మార్చారు. జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్-ఆలేరు మధ్య నాలుగు వరుసలుగా అభివృద్ధి చేశారు. తాజాగా ఆలేరు-వరంగల్ మధ్య 99.10 కిలో మీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నిర్ణయించారు.
సీఎం కేసీఆర్, కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్‌గడ్కారీ కలిసి సోమవారం జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండ వద్ద రహదారి విస్తరణ, ముల్లకట్ట బ్రిడ్జి ప్రారంభోత్సవ పనుల కార్యక్రమం జరగనుంది. ఎల్‌అండ్‌టీ సంస్థ జాతీయ రహదారి విస్తరణ పనులను దక్కించుకుంది. రూ. 1905 కోట్లతో ఈ పనులను చేయనున్నారు. రోడ్డు విస్తరణ కోసం 432.8 హెక్టార్ల భూములను సేకరించారు. గతంలో ఎన్నికల నియమావళి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.