Mumbai doctor
-
కోర్టులో ఏడ్చేసిన మహిళా డాక్టర్లు
ముంబై: కులం పేరుతో దూషించడంతో ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలి కేసులో ముగ్గురు మహిళా డాక్టర్లకు ముంబై ప్రత్యేక కోర్టు జూన్ 10 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. స్థానిక బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్ తాడ్వీ సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరేలను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితురాళ్లకు విధించిన పోలీస్ కస్టడీని పొడిగించాలని వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాల్చింది. కోర్టు నిర్ణయంతో నిందితురాళ్లు కన్నీరు పెట్టుకున్నారు. బెయిల్ కోసం సోమవారం కోర్టులో వీరు పిటిషన్ వేయనున్నారు. కాగా, డాక్టర్ పాయల్ తాడ్వీ ఆత్మహత్య కేసులో నిందితురాళ్లపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని భక్తి మహెరే తల్లి అన్నారు. పాయల్ తాడ్వీపై ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు మహిళా డాక్టర్లు నిరపరాధులని, వీరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?) -
‘పాయల్ గొంతు, శరీరంపై గాయాలున్నాయి’
ముంబై : కులం పేరుతో సీనియర్ల చేతిలో వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ కేసు కీలక మలుపు తిరిగింది. పాయల్‌ది ఆత్మహత్య కాదు హత్య అనే అనుమానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. పోస్ట్ మార్టమ్ రిపోర్టు సంచలన విషయాలు బయటపెట్టింది. పాయల్ గొంతు దగ్గర, శరీరం మీద గాయలున్నట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టు వెల్లడించింది. దాంతో పాయల్‌ది హత్య అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ సందర్భంగా పాయల్ కుటుంబం తరఫు న్యాయవాది.. పాయల్ మృతిని హత్యగా గుర్తించాలని కోర్టును కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాయల్ మరణించిన తీరు.. ఆమె శరీరం మీద ఉన్న గాయాలను బట్టి చూస్తే.. తనది ఆత్మహత్య కాదు.. హత్య అని తెలుస్తుంది. పోస్టు మార్టమ్ రిపోర్టు కూడా ఇదే తెలియజేస్తుంది. ప్రస్తుతం హత్య కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు గాను 14 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అన్నారు. స్థానిక బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్ తాడ్వీని సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో పాయల్ ఈనెల 22న హస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే అనే ముగ్గురు మహిళా డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి : డాక్టర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు) -
డాక్టర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు
సాక్షి, ముంబై : డా.పాయల్ తాడ్వీ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. సీనియర్ల వేధింపులను తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని కాలేజీ యాజమాన్యం నిర్ధారించింది. పాయల్ కుటుంబం, సహ విద్యార్థులు, సిబ్బంది సహా 30 మందికి పైగా వ్యక్తులను విచారించిన అనంతరం కమిటీ రిపోర్టు ఆధారంగా ఈ విషయాన్ని తేల్చింది. ముఖ్యంగా వేధింపులపై తొమ్మిది రోజుల క్రితం కాలేజీ యాజమాన్యానికి పాయల్ భర్త, మరో ఆసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నసల్మాన్ ( మెడికల్ కాలేజీలోని గైనకాలజీ విభాగం అధిపతికి ఫిర్యాదు చేశారు. విషయం తెలిసి మరింత కక్షగట్టిన నిందితులు తమ వేధింపుల స్వరాన్ని మరింత పెంచారు. దీంతో సీనియర్ల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అంచనా వేశారు. మే13న ఫిర్యాదు చేసిన తర్వాత మూడు రోజులు పాయల్‌తో నిందితులు మాట్లాడలేదు. తరువాత ఫైళ్లకు విసిరి కొట్టి అవమానించారు. అక్కడితో వారికి ప్రకోపం చల్లారలేదు. పనిచేయడం రాదంటూ అందరిముందూ దూషించారు. అంతేకాదు ఎట్టిపరిస్థితుల్లోనూ మూడవ సంవత్సరం కోర్సు పూర్తి కానివ్వమని బెదిరించారు. ముఖ్యంగా ఆమె హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయిన రోజు కూడా ఆసుపత్రి థియేటర్ వద్ద తీవ్రమైన వేధింపులకు పాల్పడ్డారని తేలింది. ఇతర సిబ్బంది, రోగుల ముందే ఆమెను దూషించారు. దీంతో పాయల్ ఏడ్చుకుంటూ వెళ్లిపోవడం తాము చూశామని కూడా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే.. వారి కెరియర్ పాడవుతుందని భావించిన పాయల్‌కు..అసలు జీవితమే లేకుండా చేశారని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష, వేధింపులతో ఆమెకు ఏడ్వని రోజు లేదని సల్మాన్ వాపోయారు. గైనకాలజీ హెడ్ నిందితులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాగా కులం పేరుతో దూషించడంతో బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న డా. పాయల్ తాడ్వి (26) ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు మహిళా డాక్టర్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. స్థానిక తాడ్వీ సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం, ఐటీ యాక్ట్, సెక్షన్ 360 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద నిందితులు అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే అనే ముగ్గురు మహిళా డాక్టర్లు అరెస్ట్ చేసి, మే 31వరకు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు పాయల్ ఆత్మహత్యపై ఉద్యమం రగులుకుంది. చదవండి : పాయల్ తాడ్వీ ఆత్మహత్య; ముగ్గురు అరెస్ట్ -
పాయల్ తాడ్వీ ఆత్మహత్య; ముగ్గురు అరెస్ట్
ముంబై: కులం పేరుతో దూషించడంతో ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలి కేసులో ముగ్గురు మహిళా డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్ తాడ్వీ సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే అనే ముగ్గురు మహిళా డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం, ఐటీ యాక్ట్, సెక్షన్ 360 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసులు పెట్టారు. దర్యాప్తులో భాగంగా బుధవారం తెల్లవారుజామున అంకితా ఖండేల్వాల్ను అగ్రిపడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి హేమ అహుజాను, అదేరోజు సాయంత్రం భక్తి మహెరేను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుస్తు బెయిల్ కోసం వీరు ముగ్గురు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది. పాయల్ తల్లిదండ్రులు మంగళవారం ఆమె పని చేస్తున్న ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. వీరికి దళిత, గిరిజన సంస్థలకు చెందిన కార్యకర్తలు మద్దతు పలికారు. పాయల్ ఆత్మహత్యకు కారణమైన ఆ ముగ్గురు డాక్టర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోగుల ముందే వారు తన ముఖం మీద ఫైళ్లను విసిరి కొట్టేవారని కూతురు తమకు చెప్పేదని ఆమె తల్లి వెల్లడించింది. దీంతో పలుమార్లు వారిపై ఫిర్యాదు చేయమని మేం చెప్పగా, అలా చేస్తే వారి కెరియర్ దెబ్బతింటుందంటూ ఊరుకునేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?) -
ఈ పాపం ఎవరిది?
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న కుల వివక్ష, వేధింపుల పర్యవసానంగా దళిత యువ మేధావి రోహిత్ వేముల ఆత్మార్పణ చేసుకుని మూడేళ్లయింది. ఆ కేసు అతీ గతీ ఈనాటికీ తేలలేదు. ఆ విషాద ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా ముంబైలోని ఒక వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న విద్యార్థిని డాక్టర్ పాయల్ తాడ్వీ గత బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. విజ్ఞాన కేంద్రా లుగా విలసిల్లుతూ ఉన్నతస్థాయి నిపుణులను అందించాల్సిన మన విద్యా సంస్థలు కుల, మతాల జాడ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయని తరచుగా మేధావులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ విషయంలో తగినంత ప్రక్షాళన జరుగుతున్న జాడలు లేవు. ఇప్పుడు పాయల్ ఉదంతం దాన్నే ధ్రువపరుస్తోంది. అన్ని వృత్తులలోనూ వైద్య వృత్తి అత్యున్నతమైనదని చెబుతారు. సమాజంలో వైద్యులను అందరూ దైవ స్వరూపంగా భావిస్తారు. అలాంటి రంగంలో... అందునా విద్యార్థినుల్లో కుల, మత దురహంకారాలు ఇంతగా ఉంటాయని, అవి ఎదుటివారి ప్రాణాలు తీసేంత వికృత స్థాయికి చేరతాయని ఊహించడం కూడా సాధ్యం కాదు. డాక్టర్ పాయల్ నేపథ్యం గురించి విన్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. పుట్టుకను బట్టి ఆమె భిల్లు తెగకు చెందిన ఆదివాసీ యువతి. ఆ రంగంలో అక్షరాస్యత శాతమే తక్కువ. పైగా ఉన్నత విద్య వరకూ వచ్చేవారి శాతం అత్యల్పం. ఆ తెగలో వైద్యరంగంలో పీజీ కోర్సుకు చేరుకున్న తొలి యువతి ఆమేనని సన్నిహితులు చెబుతున్నారు. చదువులో ఎంతో రాణిస్తూ, ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందుతూ, తన రంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని తపనపడిన ఒక ఆదివాసీ యువతి కలలు చివరికిలా ఛిద్రంకావడం విషాదకరం. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు జరిగిన ఎన్డీఏ పక్షాల పార్లమెంటరీ బోర్డు సమా వేశంలో మాట్లాడుతూ ‘సబ్ కా సాత్, సబ్కా విశ్వాస్(అందరితో కలిసి, అందరి అభివృద్ధి కోసం) అని పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు సమాజంలో కొరవడుతున్నది అదే. బడుగు కులాలవారు మంచి బట్టలు కట్టుకున్నా, వారు సౌకర్యవంతంగా జీవిస్తున్నా తట్టుకోలేని స్థితి ఇంకా కొనసాగు తోంది. పల్లెల్లో ఈ జాడ్యం బాహాటంగా కనిపిస్తుంటే నగరాల్లో ఇది ప్రచ్ఛన్నంగా చలామణిలో ఉంది. పాయల్‌తోపాటు రూంలో ఉంటున్న మరో ముగ్గురు యువతులు ఆధిపత్య కులాలకు చెందినవారని, వారు నిత్యం ఆమెను వేధించేవారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విష యమై కళాశాల నిర్వాహకులకు నిరుడు డిసెంబర్‌లోనూ, ఈ నెల మొదట్లోనూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని పాయల్ తల్లి చెబుతున్నారు. ఆదివాసీల్లో ఇతర తెగలతో పోలిస్తే భిల్లుల్లో ఇస్లాం మత విశ్వాసాలు అనుసరించేవారు అధికం. పాయల్ ఆదివాసీ కావడం, అందునా ముస్లిం కావడం ఆమె ఉసురు తీశాయని తల్లి చెబుతున్న మాట. ఎనిమిదేళ్లక్రితం ఢిల్లీలోని ఉన్నతశ్రేణి వైద్య సంస్థ ఎయిమ్స్‌లో అమలవుతున్న కుల వివక్షను యూజీసీ మాజీ చైర్మన్, విద్యావేత్త సుఖదేవ్ తొరాట్ నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు చేసి అక్కడ దళిత, ఆదివాసీ విద్యార్థులకు ఇతర వర్గాల విద్యా ర్థులతో పోలిస్తే అధ్యాపకుల నుంచి పెద్దగా సహకారం అందదని నిర్ధారించారు. కులం తెలియ నంతవరకూ ఆత్మీయంగా ఉన్నవారే, తెలిసిన మరుక్షణం నుంచి వివక్ష ప్రదర్శిస్తారని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 84 శాతంమంది ఆ కమిటీకి చెప్పారు. పరీక్ష పత్రాలు దిద్దే అధ్యాపకులు ప్రత్య క్షంగానో, పరోక్షంగానో విద్యార్థుల కుల నేపథ్యాన్ని తెలుసుకుని ఉద్దేశపూర్వకంగా మార్కులు తగ్గి స్తారని కమిటీ తేల్చింది. భోజనం చేసేచోట, ఆటలాడుకునేచోట తమను అత్యంత హీనంగా చూస్తా రని ఆ వర్గాల విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దళిత, ఆదివాసీ వర్గాల విద్యార్థులకు దినదిన గండంగా మారిన ఈ ధోరణులను అరికట్ట డానికి యూజీసీ ఎన్నో చర్యలు సూచించింది. ఈ విషయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు విద్యా సంస్థలు తమ వెబ్సైట్లలో ప్రత్యేక ఏర్పాటు చేయడం దగ్గర నుంచి రిజిస్ట్రార్ లేదా ప్రిన్సిపాల్ కార్యాలయాల్లో ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఫిర్యాదులు వచ్చినప్పుడు రెండు నెలల వ్యవధిలో వాటిపై తగిన చర్యలు తీసుకోవాలన్న నిబంధన పెట్టింది. అయితే విచారకరమైన విషయమేమంటే...దేశంలోని అత్యధిక విశ్వవిద్యాలయాలు యూజీసీ ఇచ్చిన ఈ మార్గదర్శకాలను సరిగా పట్టించుకోవడం లేదు. ఆ సంగతిని యూజీసీయే అంగీకరించింది. తాము మార్గదర్శకాలు పంపుతూ 800 విశ్వవిద్యాలయాలకు లేఖలు రాస్తే కేవలం 155 సంస్థలు మాత్రమే ప్రతిస్పందిం చాయని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో పాయల్ వంటివారు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కార మనుకోవడంలో వింతేముంది? తమకు నిత్యమూ వేధింపులు తప్పనప్పుడు, ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోనప్పుడు వారికి అంతకన్నా గత్యంతరం లేదు. ఆత్మహత్యలన్నీ వాస్తవానికి హత్యలేనంటారు. విద్యాసంస్థల వరకూ ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. సమాజం ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడాల్సిన ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు కుల, మతాల రొంపిలో కూరుకుపోతుండటం... బాధితుల గోడు అరణ్యరోదన కావడం ఆందోళన కలిగించే అంశం. ‘నా పుట్టుకే ఒక ప్రాణాంతక దుర్ఘటన’ అని ఎంతో ఆర్తితో, ఆవేదనతో రోహిత్ వేముల తన చిట్ట చివరి లేఖలో రాశాడు. పాయల్ సైతం అలా అనుకోకతప్పని దుస్థితి ఉన్నత విద్యాసంస్థల్లో ఇంకా రాజ్యమేలుతున్నదని తాజా ఉదంతం చెబుతోంది. ఆమె ఆత్మహత్య చేసు కున్న వారం రోజులకు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగలిగారు. అది కూడా దళిత సంఘాల ఆందోళన తర్వాత. ఈలోగా ఇద్దరు నిందితులు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్’ నెరవేరాలంటే, పాయల్ మాదిరి మరెవరూ బలికాకూడదనుకుంటే నిందితులకు వత్తాసుపలికే ధోరణిని ప్రభుత్వాలు విడనాడాలి. చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి. సకల జాడ్యాల నుంచీ విద్యాసంస్థల్ని కాపాడుకోవాలి. -
సీనియర్ల వేధింపులు : మెడికో ఆత్మహత్య
సాక్షి,ముంబై : సీనియర్ల వేధింపులకు తాళలేక గైనకాలజీ పోస్ట్-గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు సీనియర్ వైద్యుల చేతిలో కులపరమైన వేధింపులకు ఎదుర్కొన్న మెడికో పాయల్ సల్మాన్ తద్వీ(26) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నారు. ముంబై సెంట్రల్ బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలోబుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జల్గావ్కు చెందిన డా. పాయల్ ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలో ఎండీ (గైనకాలజీ) చేస్తున్నారు. అయితే ఎస్సీ కులానికి చెందిన పాయల్‌పై ముగ్గురు మహిళా డాక్టర్లు గత కొంతకాలంగా కులపరమైన వివక్ష చూపుతూ వేధింపులకు దిగారు. రిజర్వ్డ్ కేటగిరీ అంటూ పలుసార్లు ఎద్దేవా చేసేవారు. అంతేకాదు వాట్సాప్ గ్రూపులో ఆమెను తీవ్రంగా అవమానించేవారు. అయితే ఈ వేధింపులపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లభించలేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో డిప్రెషన్‌కు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సీనియర్ వైద్యుల వేధింపులు, యాజమాన్య నిర్లక్ష వైఖరి కారణంగా తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని పాయల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే వేధింపులకు సంబంధించి తమకు రాతపూర్వక ఫిర్యాదు ఏదీ అందలేదని ఆసుపత్రి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. కులం పేరుతో వేధించేవారనీ,లంచ్ విరామంలో భోజనం చేయడానికి అనుమతినిచ్చేవారు కాదని పాయల్ సోదరుడు నీలేష్ ఆరోపించారు. అంతేకాదు ఎండీ కోర్స్ ఎలా పూర్తి చేస్తావో చూస్తామంటూ బెదరించేవారని తెలిపారు. కనీసం భర్తను కలవడానికి కూడా పాయల్‌కు అనుమతినిచ్చేవారు కాదని ఆయన ఆరోపించారు. ఇదే హాస్పిటల్‌కు తాను ట్రీట్మెంట్కు వచ్చినపుడు పలుసార్లు వేధింపులకు పాల్పడ్డారని పాయల్ తల్లి, కాన్సర్‌తో బాధపడుతున్న అబీదా సలీం(53) కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే విషయంలో బుధవారం సాయంత్రం తనతో చెప్పుకుని బాధపడిందనీ, తాము వచ్చేలోపే అంతా జరిగిపోయిందని వాపోయారు. మరోవైపు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా హేమా ఆహుజా, భక్తి మెహరే, అంకిత ఖండేల్వాల్ అనే ముగ్గురు సీనియర్ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
డాక్టర్.. పాప నీవల్లే చనిపోయింది.. రూ.19లక్షలివ్వు
ముంబై: అప్పటివరకు అమ్మకడుపులో ఉండి మరికాసేపట్లో లోకాన్ని చూడాల్సిన ముక్కుపచ్చలారనిబిడ్డ మృతికి కారణమయ్యాడని ఓ వైద్యుడికి ముంబైలోని వినియోగదారుల ఫోరం భారీ ఫైన్ విధించింది. బిడ్డను కోల్పోయిన ఆ మాతృమూర్తికి రూ.19 లక్షల నష్టపరిహార చెల్లించాలని ఆదేశించింది. 2003లో ముంబైలో సోనూ కరీర్ అనే గర్భవతి మాతృశయా అనే ఆస్పత్రికి తరచూ పరీక్షల కోసం వెళ్లేది. కానీ, అదే అక్టోబర్ 18న తీవ్ర నొప్పులతో అదే ఆస్పత్రికి వెళ్లినప్పుడు మాత్రం సదరు వైద్యుడు వెంటనే వెళ్లి మరో ఆస్పత్రిలో చేరాలని చెప్పాడు. అంతేకాకుండా ఏ క్షణంలోనైనా బిడ్డ జన్మించవచ్చని తెలిపాడు. దీంతో, అక్కడి నుంచి కాందివ్లిలోని మరో ఆస్పత్రికి వెళ్లారు. అయితే, అక్కడి వైద్యుడు నాలుగు గంటలు ఆలస్యంగా రావడమే కాకుండా పరీక్షలు నిర్వహించి మరో పదిహేను నిమిషాల్లో ఆమె డెలివరీ అవుతుందనగా ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో ఆమె డెలివరీ బాధ్యతలు నర్సే చూసింది. అనంతరం వచ్చిన వైద్యుడు పాపను పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పగా.. మార్గ మధ్యలోనే పాప చనిపోయింది. దీంతో బాధితులు వినియోగదారుల ఫోరంను సంప్రదించారు. ఫలితంగా కాందివ్లి వైద్యుడు రూ.19 లక్షలు చెల్లించాల్సిందేనని ఆ ఫోరం ఆదేశించింది. ఆ బిడ్డ చనిపోవడానికి ఆ డాక్టర్ ఆలస్యం, నిర్లక్ష్యం కారణమని స్పష్టం చేసింది.