సాక్షి, ముంబై : డా.పాయల్ తాడ్వీ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. సీనియర్ల వేధింపులను తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని కాలేజీ యాజమాన్యం నిర్ధారించింది. పాయల్ కుటుంబం, సహ విద్యార్థులు, సిబ్బంది సహా 30 మందికి పైగా వ్యక్తులను విచారించిన అనంతరం కమిటీ రిపోర్టు ఆధారంగా ఈ విషయాన్ని తేల్చింది.
ముఖ్యంగా వేధింపులపై తొమ్మిది రోజుల క్రితం కాలేజీ యాజమాన్యానికి పాయల్ భర్త, మరో ఆసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నసల్మాన్ ( మెడికల్ కాలేజీలోని గైనకాలజీ విభాగం అధిపతికి ఫిర్యాదు చేశారు. విషయం తెలిసి మరింత కక్షగట్టిన నిందితులు తమ వేధింపుల స్వరాన్ని మరింత పెంచారు. దీంతో సీనియర్ల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అంచనా వేశారు.
మే13న ఫిర్యాదు చేసిన తర్వాత మూడు రోజులు పాయల్‌తో నిందితులు మాట్లాడలేదు. తరువాత ఫైళ్లకు విసిరి కొట్టి అవమానించారు. అక్కడితో వారికి ప్రకోపం చల్లారలేదు. పనిచేయడం రాదంటూ అందరిముందూ దూషించారు. అంతేకాదు ఎట్టిపరిస్థితుల్లోనూ మూడవ సంవత్సరం కోర్సు పూర్తి కానివ్వమని బెదిరించారు. ముఖ్యంగా ఆమె హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయిన రోజు కూడా ఆసుపత్రి థియేటర్ వద్ద తీవ్రమైన వేధింపులకు పాల్పడ్డారని తేలింది. ఇతర సిబ్బంది, రోగుల ముందే ఆమెను దూషించారు. దీంతో పాయల్ ఏడ్చుకుంటూ వెళ్లిపోవడం తాము చూశామని కూడా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే.. వారి కెరియర్ పాడవుతుందని భావించిన పాయల్‌కు..అసలు జీవితమే లేకుండా చేశారని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష, వేధింపులతో ఆమెకు ఏడ్వని రోజు లేదని సల్మాన్ వాపోయారు. గైనకాలజీ హెడ్ నిందితులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
కాగా కులం పేరుతో దూషించడంతో బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న డా. పాయల్ తాడ్వి (26) ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు మహిళా డాక్టర్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. స్థానిక తాడ్వీ సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం, ఐటీ యాక్ట్, సెక్షన్ 360 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద నిందితులు అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే అనే ముగ్గురు మహిళా డాక్టర్లు అరెస్ట్ చేసి, మే 31వరకు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు పాయల్ ఆత్మహత్యపై ఉద్యమం రగులుకుంది.
Comments
Please login to add a commentAdd a comment