mummies
-
ఈ టూ డెడ్లీ మమ్మీల మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా! ఇదొక..?
ఇది మమ్మీల మ్యూజియం. మెక్సికోలోని గ్వానాజ్వాటో పట్టణంలో ఉంది. పలు దేశాల్లో 1870 నుంచి 1958 కాలంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ మమ్మీలను సేకరించి, జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో భద్రపరచారు. ప్రపంచంలోని భీతిగొలిపే మ్యూజియంలలో ఒకటిగా ఈ మమ్మీల మ్యూజియం పేరుమోసింది. ‘ఎల మ్యూజో డి లాస్ మోమియాస్’ పేరుతో ఈ మమ్మీల మ్యూజియంను 1969లో ఇక్కడ నెలకొల్పారు.ఈ మ్యూజియం సేకరణలో మొత్తం 111 మమ్మీలు ఉన్నాయి. వాటిలో కొన్ని మరీ శిథిలంగా మారడంతో, ప్రస్తుతం వాటిలోని 59 మమ్మీలను మాత్రమే సందర్శకులకు ప్రదర్శిస్తున్నారు. గ్వానాజాటో మునిసిపాలిటీకి, మెక్సికో జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థకు మధ్య మమ్మీల నిర్వహణపై వివాదం నడుస్తుండటంతో ఇవి కొంత నిర్లక్ష్యానికి లోనయ్యాయి. స్థానిక సంస్థ నిర్లక్ష్యం వల్లనే మమ్మీలపై ఫంగస్ పెరిగి, అవి పాడైపోతున్నాయనేది జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థ ఆరోపణ. -
Peru: ఏలియన్ మమ్మీల గుట్టు రట్టు.. అసలు కథేంటంటే..
లిమా: పెరూ రాజధాని లిమా ఎయిర్‌పోర్టులో గత ఏడాది దొరికిన ఏలియన్ మమ్మీల మిస్టరీ వీడింది. ఇవి ఏలియన్ మమ్మీలనేది పెద్ద జోక్ అని ఆర్కియాలజిస్టులు తేల్చారు. లిమా ఎయిర్‌పోర్టులో దొరికిన రెండు బొమ్మలు మనుషులు లేదా జంతువుల ఎముకల నుంచి తయారు చేసినవి అయి ఉండొచ్చని సైంటిస్టులు వెల్లడించారు. ‘అవి ఏలియన్ మమ్మీలు కానే కావు. జంతువుల ఎముకలను మోడ్రన్ గ్లూతో అతికించి తయారు చేసిన బొమ్మలు’అని పెరూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెడిసిన్‌లో పనిచేసే ఆర్కియాలజిస్ట్ ఒకరు తెలిపారు. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో లిమా ఎయిర్‌పోర్టులోని డీహెచ్ఎల్ కొరియర్ సంస్థకు చెందిన కార్డ్‌బోర్డు బాక్సులో ఏలియన్ మమ్మీలుగా తొలుత అందరూ భావించిన రెండు బొమ్మలు దొరికాయి. అప్పటి నుంచి ఏలియన్లు ఉన్నారని, అవి భూమి మీదకు వచ్చాయన్న పుకార్లు ఊపందుకున్నాయి. తాజాగా సైంటిస్టులు పరిశోధన చేసి క్లారిటీ ఇవ్వడంతో ఏలియన్ మమ్మీల గుట్టురట్టయింది. ఇదీచదవండి.. ఉక్రెయిన్‌పై యూఎన్ కీలక ప్రకటన -
వాహ్ ఏం టెక్నాలజీ గురూ.. ఈజిప్ట్ మమ్మీలకు ప్రాణం పోస్తే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో ఏళ్ల తరబడి చేసే పనులు కూడా ప్రస్తుతం నెలల్లో, రోజుల్లో ముగించేస్తున్నాం. ఎన్నో అసాధ్యం అనుకున్న వాటిని కూడా సుసాధ్యం చేస్తున్నాం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంపాజిబుల్ అనేది లేదని మానవుడు అంటున్నాడు. ఈ మాటలనే నిజం అనిపించేలా ఓ వీడియో నెట్టింట హల్ చేస్తోంది. అందులో వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి రూపం వస్తే ఎలా ఉంటుందో చూపించింది. ఇంతకీ అది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే! ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)అనేది ఎక్కువగా వినపడుతున్న పేరు. మానవుని మేధస్సుకి మిషీన్ వేగం తోడైతే ఊహించని ఫలితాలు వస్తాయినడంలో సందేహం లేదు. సరిగ్గా ఏఐ వాడుకుని కూడా అలాంటి ఫలితాలే వస్తాయి. అందుకు ఉదాహరణగా ఈ వీడియో చెప్పవచ్చు. అందులో ఏముందంటే.. హాలీవుడ్ మూవీ ‘మమ్మీ’ చూడని వాళ్లు లేదా ఈజిఫ్ట్ మమ్మీల గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈజిఫ్ట్ మనకు ఎప్పటికీ మిస్టరీయే. వేల సంవత్సరాల రాజుల శవాల్ని భద్రపరిచి పిరమిడ్స్ కట్టిన విధానం ప్రపంచాన్ని ఆశ్చర్చంలో ముంచేత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆ మమ్మీల ముఖ చిత్రాలు ఎలా ఉంటాయనే ఓ వీడియో ట్విటర్లో తిరుగుతోంది. ఈ వీడియోను వాలా అఫ్షర్ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. . This is how AI was used to recreate the faces of Egyptian monarchy pic.twitter.com/wPJaTEknKK — Vala Afshar (@ValaAfshar) October 17, 2022 చదవండి: జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే! -
వామ్మో.. మమ్మీల జులుస్.. ఎంత భయంకరంగా ఉందో!
ఇరవై రెండు మంది రాజులు, రాణులు ఒకే దారిలో ఒకే వరుసలో ఒకరి వెనుక ఒకరు రథంపై ఊరేగింపుగా వెళుతుంటే కేవలం అదొక ఉత్సవంగా మాత్రమే ఉండదు. కన్నుల పండుగైన మహోత్సవంలా ఉంటుంది. ఈజిప్టు రాజధాని కైరోలోని ప్రజలు వీధులలో బారులు తీరి ఈరోజు (శనివారం) అటువంటి మహోత్సవాన్నే (జులుస్)వీక్షించబోతున్నారు. ఆశ్చర్యంగా.. అబ్బురంగా.. భయం భయంగా!! ఆశ్చర్యమూ, అబ్బురమూ ఎందుకో చెప్పనక్కర్లేదు. భయం మాత్రం.. ఆ రాజులు, రాణులు ‘మమ్మీలు’ అయినందుకు! భయం అంటే భయం అని కాదు. థ్రిల్లింగ్‌గా అనుకోండి. నైట్రోజన్ నింపిన పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారు. మమ్మీలను మ్యూజియంలో చూడ్డం ఆసక్తిగానే ఉంటుంది. ఏళ్ల నాటి చక్రవర్తి లేదా మహారాణ .. చనిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఒక అద్దాల పెట్టె లోపలి నుంచి వెల్లకిలా పడుకుని కనిపిస్తున్నప్పుడు కనురెప్ప వేయకుండా నిలబడి తదేకంగా చూస్తూ వేల ఏళ్ల కాలంలోకి ప్రయాణించవచ్చు. అవే మమ్మీలు మనం రోజూ వెళ్లొచ్చే రహదారిలో రథంపైన ఒక బారుగా కదులుతూ కనిపిస్తుంటే వేల ఏళ్ల నాటి ఆ కాలమే ఇప్పుడు మన కళ్ల ముందు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. ఇవాళ కైరోలో స్థానికులకు అలాంటి అపూర్వమైన సందర్భం అనుభవంలోకి రాబోతోంది. పద్దెనిమిది మంది మహారాజులు, నలుగురు మహారాణులు ఒకరి వెంట ఒకరు సెంట్రల్ కైరోలోని ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి బయల్దేరి అక్కడి సమీపంలోనే ఉన్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్’లో ‘కొలువు తీరుతారు’. ఈ నెల 18 నుంచి ఈ మమ్మీలన్నీ ఆ కొత్త ప్రదేశంలో తమ యథా‘పూర్వ’స్థితికి కొనసాగింపు గా సందర్శకుల వీక్షణ కోసం ఎదురు చూస్తుంటాయి. ‘మ్యూజియంలో ఉన్నవాటిని ఎప్పుడైనా వెళ్లి చూడవచ్చు. మ్యూజియంలోంచి రోడ్డు మీదకు వచ్చిన మమ్మీలను చూడ్డానికే త్వరపడాలి. మళ్లీ అవకాశం ఎప్పటికో గానీ రాదు’ అని ఈజిప్టు పురావస్తు శాఖ చాటింపు వేయిస్తోంది. బహుశా ఈ రోజు కనీసం 40 నిముషాల పాటు కైరో ప్రధాన రహదారి స్తంభించిపోవచ్చు. ఇంతవరకు మమ్మీలు ఉన్న ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి ఇప్పుడు తరలబోతున్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్’కి మధ్య దూరం 8 కి.మీ. సాధారణ ప్రయాణ దూరం 13 నిముషాలు. పదమూడు నిముషాల ప్రయాణానికి మమ్మీలకు నలభై నిముషాలు పట్టబోతోందంటే.. మమ్మీలు ఎంత నెమ్మదిగా, ఎంత పదిలంగా, ఎంత కదిలీ కదలనట్లుగా బట్వాడా అవబోతున్నాయో చూడండి. మమ్మీల రథయాత్ర (అవును. అలంకరించిన రథాల మీదనే గాజు పెట్టెలలోని మమ్మీలను అమర్చి, చుట్టూ ‘పొత్తిగిలి’ ఏర్పాటు చేసి ప్రాణం పోకుండా వాటిని తీసుకెళతారు). ఆల్రెడీ ప్రాణం పోయిన వాటికి మళ్లీ ప్రాణం పోవడం ఏమిటి? ఇది పురావస్తు ప్రేమికుల భాష. ప్రాణం పోయాక కూడా మమ్మీలు వేల ఏళ్లపాటు భద్రంగా ఉన్నాయంటే ప్రాణంతో ఉన్నట్లుగా వారు భావిస్తారు. కదలికల వల్ల కాళ్లో, వేళ్లో, కళ్లో కాస్త చెదిరినా వాటి ప్రాణం పోయినట్లే. మళ్లీ వాటిని అతికించడానికి ఓ పెద్ద సర్జరీనే అవసరం అవుతుంది. సర్జరీ చేసినట్లు కనిపిస్తే అప్పుడది అతికించినట్లే అవుతుంది తప్ప అమరిక అవదు. అందుకే అంత జాగ్రత్త. ఈ మహా ఊరేగింపునకు ఈజిప్టు ప్రభుత్వం ‘ఫారోస్ గోల్డెన్ పరేyŠ ’ అనే పేరు పెట్టింది. ప్రాచీన ఈజిప్టు పాలకుల్ని ఫారోలు అంటారు. అందుకే పరేడ్‌కు ఆ పేరు. ఈ పరేడ్ ఒక క్రమబద్ధమైన విధానంలో జరుగుతుంది. ముందు వయసులో పెద్దవారు, తర్వాత వారికన్నా చిన్నవారు. ఇదీ మమ్మీల రాజులు, మమ్మీ రాణుల వరుస. మమ్మీలను ఉంచిన రథాల అలంకరణ పూర్తిగా ఈజిప్టు సంప్రదాయ శైలిలో ఉంటుంది. అలంకరణ రథానికే తప్ప మమ్మీల గాజు పెట్టెలకు కాదు. మమ్మీలు ఇప్పుడున్న మ్యూజియం శతాబ్దం క్రితం నాటిది. తరలబోతున్న మ్యూజియం ఇటీవలి కాలం నాటిది. 2017 లో ప్రారంభం అయింది. మమ్మీలను ఆ కొత్త మ్యూజియంలో దించాక వాటిని కాస్త ఎత్తున, ఆధునీకరించిన కుదుళ్లలో వీక్షలకు మరింత చక్కగా కనిపించేలా అమర్చుతారు. మిగతా పరిరక్షణ విధానమంతా మామూలే. సమతుల ఉష్ణోగ్రతల వద్ద మమ్మీలను ఉంచడం ప్రధానం. అందుకోసం కొత్త మ్యూజియంలో మెరుగైన ఏర్పాట్లు ఉన్నాయి. మ్యూజియంలో అవసరం లేదు కానీ.. రథయాత్రలోనే మమ్మీలకు గట్టి ‘స్థిర’ భద్రతలు ఉండాలి. ప్రయాణ మార్గంలో ఎగుడు దిగుళ్లను ఇప్పటికే చదును చేసి ఉంచారు. ఒక్కో మమ్మీని పెట్టిన పెట్టె పసిడివర్ణంలోని ఒక్కో రథంలో ఉంటుంది. ఆ రథంపై ఆ మమ్మీ పేరు, ఏ రాజ్యానికి పాలకుడు / పాలకురాలు అనే వివరాలు ఉంటాయి. అందరి కన్నా ముందు వరసలో రెండవ సీకెనార్ తావో చక్రవర్తి రథం ఉంటుంది. క్రీ.పూ. 1560–1555 కాలం నాటి పాలకుడు ఆయన. ‘ధైర్యవంతుడు’ అని పేరు. ఆయన వెనుకే తొమ్మిదవ రామ్సీస్ మమ్మీ రథం కదులుతుంది. క్రీ.పూ. 12వ శతాబ్దం చక్రవర్తి రామ్సీస్. ఆ వెనుక రెండవ రామ్సీస్ చక్రవర్తి, ఆ వెనుక మహా రాణి హాట్షిప్సట్. అతి శక్తిమంతురాలిగా ఆమె ప్రసిద్ధి. ఆ వెనుక ఒకరొకరుగా వయసుల వారీగానే కాకుండా చారిత్రక ప్రాధాన్యాన్ని బట్టి కూడా మెల్లిగా ‘కదులుతారు’. వాళ్ల కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ రథయానం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగుతుంది. ఊరేగింపులో చక్కటి వాద్య ధ్వనులు ఉంటాయి. ఈజిప్టు కళాకారుల నృత్యాలు ఉంటాయి. ఈ తతంగం అంతా లైవ్‌లో టీవీలో ప్రసారం అవుతుంది. దొరికిన చోటు కైరోలోని చరిత్రాత్మక ప్రాంతమైన ‘తహ్రీర్ స్క్వేర్’ లో ఉన్న ‘ఈజిప్షియన్ మ్యూజియం’లో గత వందేళ్లుగా ఈ 22 రెండు మమ్మీలు ఉన్నాయి. 1881 నుంచి, ఈజిప్టులో నైలు నదికి తూర్పుఒడ్డున ఉన్న లక్సర్ నగరంలో జరుగుతూ వస్తున్న పురావస్తు అన్వేషణల్లో బయట పడిన ఈ మూడు వేల ఏళ్ల నాటి ఈ మమ్మీలను ఈజిప్షియన్ మ్యూజియంకి చేర్చాక, 1950 లలో ఒక చిన్న అద్దాల గదిలోకి మార్చి, సందర్శకుల వీక్షణ కోసం ఒక దాని పక్కన ఒకటిగా పెట్టి, వాటిపై ఆ మమ్మీలు ఎవరివో వివరాలు రాసి ఉంచారు. డెబ్బై ఏళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారి వీటిని నేషనల్ మ్యూజియంలోకి మార్చడం కోసం నైట్రోజన్ నింపిన పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారు. -
ఈజిప్టులో బయటపడ్డ 50 మమ్మీలు
కైరో : మమ్మీలకు నిలయమైన ఈజిప్టులో తాజా గా మరో 50 మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్టులోని తూర్పు మల్లావిలో టు నా ఎల్ గెబల్ ప్రాంతంలో ఓ భారీ సమాధిని గుర్తించారు. దాదాపు తొమ్మిది మీటర్ల లోతైన గదులున్న ఈ సమాధిలో మొత్తం 50 మమ్మీలను గుర్తించారు. వాటిలో చిన్నపిల్లల శరీరాలను భద్రపర్చిన మమ్మీ లు 12 ఉన్నాయని పురాతత్వశాస్త్రవేత్తలు తెలిపారు. రోమన్ లేదా బైజాన్టియన్ కాలం నాటి మమ్మీలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 50 మమ్మీల్లో 40 పూర్తిగా వెలికితీశామని, వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని ఈజిప్టు పురావస్తు విభాగం సుప్రీం కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ముస్తఫా వజీరీ తెలిపారు. ఈ మమ్మీలను చాలా వరకు కుండల్లో భద్రపర్చారని, కొన్ని మమ్మీలపై నాటి భాషలో రాసిన విశేషాలు ఉన్నాయని, ఈజిప్షియన్ కాలంలో ఈ భాష సాధారణ ప్రజానికంలో వినియోగంలో ఉండేదని చెప్పారు. మిన్యా విశ్వవిద్యాలయం నేతృత్వంలో చేపట్టిన ఈ సంయుక్త కార్యక్రమంలో తొలిసారి ఈ మమ్మీలను కనుగొన్నారు. -
మమ్మీలను వదలని ఐసిస్ ముష్కరులు
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మమ్మీలను (భద్రపరిచిన మృతదేహాలు) వదలడం లేదు. ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోలో అరుదైన శిల్ప సంపదను, మమ్మీలను నాశనం చేసినట్టు చూపించారు. సిరియాలోని పల్మిరా నగరంలోని శిల్పాలు, మమ్మీలను లారీలతో గుద్ది ధ్వంసం చేశారు. యూనెస్కో జాబితాలో ఉన్న నిర్మాణాలను కూడా ఐసిస్ ముష్కరులు నాశనం చేశారని డైలీ మెయిల్ వెల్లడించింది. పేలుడు పదార్థాలతో 2015, మే నెలలో ఈ దురాగతాలకు పాల్పడ్డారని తెలిపింది. ఐసిస్ ఉగ్రవాదులు కూల్చివేసిన వాటిలో 2 వేల సంవత్సరాల నాటి రొమన్ ఆంఫిధియేటర్ కూడా ఉంది. పూర్వకాలంలో ఇక్కడ బహిరంగంగా మరణ శిక్షలు అమలు చేసేవారు. పల్మిరా నగరంలోని ప్రఖ్యాత మ్యూజియంలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి వాటిని నాశనం చేసినట్టు ఐసిస్ వీడియోలో ఉంది. గతేడాది ఆగస్టులో పల్మిరా నగరానికి చెందిన ముఖ్య ఆర్కియాలజిస్ట్ ఖలిద్ అసాద్ ను ఐసిస్ ఉగ్రవాదులు తల నరికి చంపారు. ఆలయాలు, సమాధులను కూడా ముష్కరులు ధ్వంసం చేశారు. ఈ ఏడాది మార్చిలో రష్యా దళాల సహాయంతో సిరియా ప్రభుత్వ బలగాలు ఈ నగరం నుంచి ఐసిస్ ఉగ్రవాదులను తరిమి కొట్టాయి.