మమ్మీలను వదలని ఐసిస్ ముష్కరులు
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మమ్మీలను (భద్రపరిచిన మృతదేహాలు) వదలడం లేదు. ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోలో అరుదైన శిల్ప సంపదను, మమ్మీలను నాశనం చేసినట్టు చూపించారు. సిరియాలోని పల్మిరా నగరంలోని శిల్పాలు, మమ్మీలను లారీలతో గుద్ది ధ్వంసం చేశారు. యూనెస్కో జాబితాలో ఉన్న నిర్మాణాలను కూడా ఐసిస్ ముష్కరులు నాశనం చేశారని డైలీ మెయిల్ వెల్లడించింది. పేలుడు పదార్థాలతో 2015, మే నెలలో ఈ దురాగతాలకు పాల్పడ్డారని తెలిపింది.
ఐసిస్ ఉగ్రవాదులు కూల్చివేసిన వాటిలో 2 వేల సంవత్సరాల నాటి రొమన్ ఆంఫిధియేటర్ కూడా ఉంది. పూర్వకాలంలో ఇక్కడ బహిరంగంగా మరణ శిక్షలు అమలు చేసేవారు. పల్మిరా నగరంలోని ప్రఖ్యాత మ్యూజియంలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి వాటిని నాశనం చేసినట్టు ఐసిస్ వీడియోలో ఉంది.
గతేడాది ఆగస్టులో పల్మిరా నగరానికి చెందిన ముఖ్య ఆర్కియాలజిస్ట్ ఖలిద్ అసాద్ ను ఐసిస్ ఉగ్రవాదులు తల నరికి చంపారు. ఆలయాలు, సమాధులను కూడా ముష్కరులు ధ్వంసం చేశారు. ఈ ఏడాది మార్చిలో రష్యా దళాల సహాయంతో సిరియా ప్రభుత్వ బలగాలు ఈ నగరం నుంచి ఐసిస్ ఉగ్రవాదులను తరిమి కొట్టాయి.