Munugode MLA
-
మరో మంత్రి పదవి!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పదవి దక్కనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. పలు సందర్భాల్లో తన మనసులోని మాటను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. ఎంపీ ఎన్నికల్లో అన్ని బాధ్యతలు తానే తీసుకొని చామల కిరణ్కుమారెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేసిన రాజగోపాల్‌రెడ్డి.. రెండు రోజుల క్రితం డీసీసీబీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి సీఎం రేవంత్‌రెడ్డి అభిమానాన్ని చూరగొన్నారు.లైన్ క్లియర్ అయినట్లేనా..ఎంపీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేలా గతంలోనే అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని చెప్పినా అందుకు ఆయన అంగీకరించలేదన్న చర్చ అప్పట్లో జరిగింది. పార్టీ సర్వేల ప్రకారం ఆమె పోటీలో ఉంటే భారీ మెజారిటీతో గెలుస్తారన్న చర్చ సాగడంతో అధిష్టానం లక్ష్మిని పోటీ చేయించాలని రాజగోపాల్‌రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. అయితే, అటు లక్ష్మిని ఎంపీగా పోటీలో నిలిపి, ఇటు మంత్రి పదవి అడిగితే పార్టీ పరంగా విమర్శలు వస్తాయనే భావనతో లక్ష్మిని పోటీచేయించేందుకు ఆయన ఒప్పుకోలేదు. అంతేకాదు తాము ఎంపీ టికెట్ అడుగడంలేదని, తమ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీలో ఉండరని పలు సందర్భాల్లో ఆయన ప్రకటించారు. పార్టీ ఎవరిని బరిలో నిలిపినా భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదన మేరకు అధిష్టానం చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించించింది. ఆ ఎన్నికల్లో అన్నీ తానై భారీ మెజారిటీతో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కేబినెట్ విస్తరణలో ఆయన పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.అమాత్య పదవి వస్తుందని ధీమాలో..అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత రాజకీయ సమీకరణల్లో భాగంగా రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. తరువాత తనకు మంత్రి పదవి వస్తుందని అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనూ రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఎన్నికల తరువాత విస్తరణ ఉంటుందని పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈసారి తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.మంత్రి పదవిపై ముగ్గురి ఆశలు?ఉమ్మడి జిల్లా నుంచి రాజగోపాల్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. లంబాడా కోటాలో తనకు మంత్రి పదవి కావాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా తన సతీమణి పద్మావతి రెడ్డికి మంత్రి పదవి అడుగుతున్నట్లు తెలిసింది. అయితే, అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేబినెట్లో బెర్త్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి మూడో మంత్రి పదవిని కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.ముచ్చటగా మూడు..!కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అవుతారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అవకాశం కల్పించారు. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తే ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కినట్లు అవుతుంది. -
మునుగోడులో నేతల సిత్రాలు..
-
స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి
-
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
కోమటిరెడ్డి బీజేపీలో చేరిక?!.. టీఆర్ఎస్ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరే పక్షంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశాలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి తదితరాలపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పరిస్థితి, నేతల పనితీరుకు సంబంధించిన ప్రాథమిక నివేదికలు ఇప్పటికే కేసీఆర్‌కు చేరగా, మరింత లోతుగా వివరాల సేకరణకు సర్వే సంస్థలను పురమాయించినట్లు తెలిసింది. సుదీర్ఘ చర్చ..సూచనలు పార్టీ మారతానంటూ రాజగోపాల్‌రెడ్డి చాలా కాలంగా సంకేతాలు ఇస్తున్నా ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ దూకుడు పెంచడం, పార్లమెంటు ఆవరణలో కేంద్ర మంత్రి అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం వంటి పరిణామాలతో ఆయన బీజేపీలో చేరవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడు అసెంబ్లీ స్థానంపై ఇప్పటినుంచే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎంతో భేటీ అయ్యారు. మునుగోడు నియోజకవర్గ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడంతో పాటు స్థానికంగా పార్టీ నాయకుల నడుమ సమన్వయ సాధనతో పాటు, నియోజకవర్గంలో పర్యటనలు పెంచాలని ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ కూడా ఉండటం గమనార్హం. మునుగోడుపై పీకే బృందం నివేదిక! మునుగోడు నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారిగా టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కూసుకుంట్లప్రభాకర్రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అక్కడ చురుగ్గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబ నేపథ్యం, ఆర్థిక సంపత్తి, వ్యాపార లావాదేవీలు, బలాలు, బలహీనతలు, గెలుపు అవకాశాలు తదితరాలపై గతంలోనే పీకే బృందం నివేదిక అందజేసినట్లు సమాచారం. ఇక్కడ గెలుపోటములకు సంబంధించి ఇద్దరి పరిస్థితి సమానంగానే ఉన్నట్టుగా నివేదిక వెల్లడించినట్లు తెలిసింది. వీరితో పాటు కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవికుమార్ ఎవరికి వారుగా గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వీరిలో ఎవరికి టికెట్ దక్కినా ఇతరుల విజయావకాశాలను దెబ్బతీస్తారని ఆ నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. ఎవరి ప్రభావం ఎంత? రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడే పక్షంలో ఆ పార్టీలో పాల్వాయి స్రవంతి, పున్నా కైలాశ్ నేత, పల్లె రవికుమార్, బీజేపీలో రాజగోపాల్‌రెడ్డితో పాటు గొంగిడి మోహన్‌రెడ్డి, డోనూరు వీరారెడ్డి, ఎరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, బీఎస్పీలో పెండెం ధనుంజయ వంటి నేతలు ఎన్నికల్లో ఎంతమేర ప్రభావం చూపగలరనే కోణంలోనూ టీఆర్ఎస్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కాగా మరింత విస్తృత సర్వేలు, నివేదికల కోసం టీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. -
కమలమ్మకు శ్రద్ధాంజలి
సంస్థాన్ నారాయణపురం : మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తల్లి కమలమ్మ దశదినకర్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. దశదినకర్మ సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో ఆదివారం జరిగిం ది. కమలమ్మ ఈ నెల 5వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కేసీఆర్.. మంత్రులు ఈటెల రాజేందర్, గుంటకండ్ల జగదీష్‌రెడ్డిలతో కలిసి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన లింగవారిగూడానికి వచ్చారు. కమలమ్మ సమాధి వద్ద చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతకుముందు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిశోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కలెక్టర్ టి.చిరంజీవులు, ఐజీలు శశిధర్‌రెడ్డి, గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు, జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా,ఆర్డీఓ వెంకటాచారి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మేరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, దుబ్బాక నర్సింహారెడ్డి, మన్నె గోవర్దన్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు హాజరై నివాళులర్పించారు. 35నిమిషాల పాటు ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన 1.40గంటలకు లింగవారిగూడానికి వచ్చారు. దాదాపు 35నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేశారు. మధ్యాహ్నం 2.15గంటలకు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. గుడిమల్కాపురం గ్రామంలో స్థానికులను చూసి ఆగారు. దాదాపు 20నిమిషాల పాటు గ్రామస్తులతో మాట్లాడి వెళ్లారు. -
'తెలంగాణకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు'
టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం నల్గొండలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకునేలా చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో గండిపేటలో నిన్న మొన్న జరిగిన మహానాడులో రెండు ప్రాంతాలు తనకు సమానమని అన్నారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని ప్రభాకర్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపుతూ రాష్ట్రపతి బుధవారం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్‌ను తెలంగాణలో అధికారాన్ని చేపట్టనున్న టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో గురువారం తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.