సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ అప్రమత్తమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరే పక్షంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశాలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి తదితరాలపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పరిస్థితి, నేతల పనితీరుకు సంబంధించిన ప్రాథమిక నివేదికలు ఇప్పటికే కేసీఆర్‌కు చేరగా, మరింత లోతుగా వివరాల సేకరణకు సర్వే సంస్థలను పురమాయించినట్లు తెలిసింది.
సుదీర్ఘ చర్చ..సూచనలు
పార్టీ మారతానంటూ రాజగోపాల్‌రెడ్డి చాలా కాలంగా సంకేతాలు ఇస్తున్నా ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ దూకుడు పెంచడం, పార్లమెంటు ఆవరణలో కేంద్ర మంత్రి అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం వంటి పరిణామాలతో ఆయన బీజేపీలో చేరవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడు అసెంబ్లీ స్థానంపై ఇప్పటినుంచే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎంతో భేటీ అయ్యారు. మునుగోడు నియోజకవర్గ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడంతో పాటు స్థానికంగా పార్టీ నాయకుల నడుమ సమన్వయ సాధనతో పాటు, నియోజకవర్గంలో పర్యటనలు పెంచాలని ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ కూడా ఉండటం గమనార్హం.
మునుగోడుపై పీకే బృందం నివేదిక!
మునుగోడు నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారిగా టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన కూసుకుంట్లప్రభాకర్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అక్కడ చురుగ్గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబ నేపథ్యం, ఆర్థిక సంపత్తి, వ్యాపార లావాదేవీలు, బలాలు, బలహీనతలు, గెలుపు అవకాశాలు తదితరాలపై గతంలోనే పీకే బృందం నివేదిక అందజేసినట్లు సమాచారం.
ఇక్కడ గెలుపోటములకు సంబంధించి ఇద్దరి పరిస్థితి సమానంగానే ఉన్నట్టుగా నివేదిక వెల్లడించినట్లు తెలిసింది. వీరితో పాటు కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవికుమార్ ఎవరికి వారుగా గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వీరిలో ఎవరికి టికెట్ దక్కినా ఇతరుల విజయావకాశాలను దెబ్బతీస్తారని ఆ నివేదిక పేర్కొన్నట్లు సమాచారం.
ఎవరి ప్రభావం ఎంత?
రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడే పక్షంలో ఆ పార్టీలో పాల్వాయి స్రవంతి, పున్నా కైలాశ్ నేత, పల్లె రవికుమార్, బీజేపీలో రాజగోపాల్‌రెడ్డితో పాటు గొంగిడి మోహన్‌రెడ్డి, డోనూరు వీరారెడ్డి, ఎరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, బీఎస్‌పీలో పెండెం ధనుంజయ వంటి నేతలు ఎన్నికల్లో ఎంతమేర ప్రభావం చూపగలరనే కోణంలోనూ టీఆర్‌ఎస్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కాగా మరింత విస్తృత సర్వేలు, నివేదికల కోసం టీఆర్‌ఎస్ సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment