మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చోటు దక్కే అవకాశం
గతంలోనే హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర
ఉమ్మడి జిల్లా నుంచి మూడో మంత్రి పదవి ఖాయమంటున్న రాజకీయవర్గాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పదవి దక్కనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. పలు సందర్భాల్లో తన మనసులోని మాటను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. ఎంపీ ఎన్నికల్లో అన్ని బాధ్యతలు తానే తీసుకొని చామల కిరణ్‌కుమారెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేసిన రాజగోపాల్‌రెడ్డి.. రెండు రోజుల క్రితం డీసీసీబీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి సీఎం రేవంత్‌రెడ్డి అభిమానాన్ని చూరగొన్నారు.
లైన్ క్లియర్ అయినట్లేనా..
ఎంపీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేలా గతంలోనే అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని చెప్పినా అందుకు ఆయన అంగీకరించలేదన్న చర్చ అప్పట్లో జరిగింది. పార్టీ సర్వేల ప్రకారం ఆమె పోటీలో ఉంటే భారీ మెజారిటీతో గెలుస్తారన్న చర్చ సాగడంతో అధిష్టానం లక్ష్మిని పోటీ చేయించాలని రాజగోపాల్‌రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది.
అయితే, అటు లక్ష్మిని ఎంపీగా పోటీలో నిలిపి, ఇటు మంత్రి పదవి అడిగితే పార్టీ పరంగా విమర్శలు వస్తాయనే భావనతో లక్ష్మిని పోటీచేయించేందుకు ఆయన ఒప్పుకోలేదు. అంతేకాదు తాము ఎంపీ టికెట్ అడుగడంలేదని, తమ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీలో ఉండరని పలు సందర్భాల్లో ఆయన ప్రకటించారు. పార్టీ ఎవరిని బరిలో నిలిపినా భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదన మేరకు అధిష్టానం చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించించింది. ఆ ఎన్నికల్లో అన్నీ తానై భారీ మెజారిటీతో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కేబినెట్ విస్తరణలో ఆయన పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.
అమాత్య పదవి వస్తుందని ధీమాలో..
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత రాజకీయ సమీకరణల్లో భాగంగా రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. తరువాత తనకు మంత్రి పదవి వస్తుందని అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనూ రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఎన్నికల తరువాత విస్తరణ ఉంటుందని పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈసారి తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.
మంత్రి పదవిపై ముగ్గురి ఆశలు?
ఉమ్మడి జిల్లా నుంచి రాజగోపాల్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. లంబాడా కోటాలో తనకు మంత్రి పదవి కావాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా తన సతీమణి పద్మావతి రెడ్డికి మంత్రి పదవి అడుగుతున్నట్లు తెలిసింది. అయితే, అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేబినెట్‌లో బెర్త్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి మూడో మంత్రి పదవిని కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ముచ్చటగా మూడు..!
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అవుతారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అవకాశం కల్పించారు. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తే ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కినట్లు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment