ఏ మందు వేయాలబ్బా..?
ఈసారి జిల్లాలో పత్తి విస్తారంగా సాగయింది. ఈ పంట 40 నుంచి 80 రోజుల దశల్లో ఉంది. వర్షాలు పడినందున పైరు బాగా పెరిగి పూత, కాయ బాగా వచ్చేందుకు ఎకరాకు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్(ఎంఈపీ) వేసుకోవాలి. మొక్క మొక్కకు ఎడం ఉంటే పైపాటుగా కాకుండా పాదుకు జానెడు దూరంలో గుంత తీసి మందు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
వేరుశనగ 40 నుంచి 60 రోజుల దశలో ఉంది. ఈ సమయంలో ఎటువంటి ఎరువులు అవసరం లేదు. అయితే గింజ నాణ్యత బాగా పెరగడానికి (అవుటం) నూనె శాతం పెరగడానికి జిప్సమ్ అవసరం ఉంది. ఎకరాకు 200 కిలోల వేసుకుంటే దిగుబడులు పెరుగుతాయి.
ఇప్పటి వరకు వర్షాభావంతో కంది ఎదుగుదల లోపించింది. బాగా పెరగడానికి ఎకరాకు 15 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ పైపాటుగా బూస్టర్ డోస్ ఇవ్వాలి.
ఆముదం పంట 60 రోజుల దశలో ఉంది. ఎకరాకు 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ పైపాటుగా వేయాలి. దీంతో కొత్త కొమ్మలు వస్తాయి. అదనపు గెలలు వస్తాయి.
మిరప పంట వివిధ దశలో ఉంది. ఈ పంటకు ఇప్పుడు 50 కిలోల యూరియా, 25 కిలోల ఎంఓపీ వేయాలి. చెట్టు పెరిగి పూత, పిందె ఎక్కువగా వస్తుంది.
ఉల్లిలో 30 నుంచి 50 రోజుల దశలో ఉన్న పైరుకు ఎకరాకు 50 కిలోల యూరియా వేయాలి.