Musaddilal case
-
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. సుకేశ్ గుప్తాపై ఎస్ఆర్ఈఐ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బషీర్‌బాగ్ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్‌గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేశ్‌కుమార్, రవిచంద్రన్‌లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేడాది అక్టోబర్ నుంచి ప్రతి 3 నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో రుణం వడ్డీ సహా తీర్చాలన్నది ఒప్పందం. ఈ రుణానికి సంబంధించి షూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు, కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్ ప్యాలెస్‌ను చూపిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించడంలో విఫలం కావడంతో గతేడాది డిసెంబర్లో హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్ఆర్ఈఐ సంస్థ 102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీబాగ్ ప్యాలెస్ వేలం వేయాలని ప్రయత్నించగా, నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిస్ హాస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు గుర్తిం చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుకేశ్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేశ్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి, వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా రవిప్రకాశ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని సుకేశ్‌గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
‘ముసద్దిలాల్’కు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : మనీలాండరింగ్‌కు పాల్పడ్డ ముసద్దిలాల్ జ్యువెల్లరి నిర్వాహకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ జ్యువెల్లరి నిర్వాహకులు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్ విక్రయాలకు పాల్పడిన కేసులో ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఈడీ కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు మొత్తం రూ. 110.85 కోట్ల గోల్‌మాల్‌కు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేయగా.. ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ముసద్దీలాల్‌తో పాటు దాని అనుబంధ సంస్థలు, కుంభకోణంతో ప్రమేయమున్న సంస్థలు, కైలాష్ గుప్తా, నిఖిల్ గుప్తా సహా కొందరు యజమానుల ఇళ్లపై వరుస దాడులు చేసింది. ఈ సోదాల్లో లభించిన రూ. 82.11 కోట్ల విలువైన 145.89 కేజీల బంగారాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు తమకు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ ముసద్దిలాల్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆరోజు బంగారం కొనలేదని చెప్పడంతో బయటపడ్డ స్కాం.. 2016 నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడగా ముసద్దిలాల్ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్‌ల కేంద్రంగా ‘విక్రయాల’స్కెచ్ రెడీ చేసింది. ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5,200 మంది వినియోగదారులు రూ. 97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్ అడ్వాన్స్ పేమెంట్ రసీదులు సృష్టించింది. బోగస్ రసీదులతోపాటు కస్టమర్ల వివరాలంటూ కొందరి ఆధార్ కార్డుల నకళ్లను జత చేసింది. వినియోగదారుల పాన్ నంబర్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ప్రతి లావాదేవీని రూ. 2 లక్షలలోపు చూపింది. ఆ మొత్తాన్ని హైదరాబాద్ పంజాగుట్టలోని ఎస్బీఐ, బంజారాహిల్స్‌లోని యాక్సెస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపుపన్నుశాఖ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. యాజమాన్యం సమర్పించిన గుర్తింపు పత్రాలకు చెందిన వ్యక్తులను పోలీసులు విచారించగా ఆ రోజు తాము బంగారమేదీ కొనలేదని వారు చెప్పారు. ముసద్దిలాల్ సంస్థల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా నోట్ల రద్దు రోజున కేవలం 67 మంది వినియోగదారులే వచ్చినట్లు వెల్లడైంది. అలాగే బిల్లులన్నీ నోట్ల రద్దు తేదీ తర్వాతే నమోదయ్యాయని పోలీసులు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. దీంతో సంస్థ మోసం బయటపడింది. -
‘ముసద్దిలాల్’పై మనీలాండరింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్ విక్రయాలకు పాల్పడిన కేసులో ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీ సులు మొత్తం రూ. 110.85 కోట్ల గోల్‌మాల్‌కు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేయగా తాజా గా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ముసద్దీలాల్‌తోపాటు దాని అనుబంధ సంస్థలు, కుంభకోణంతో ప్రమేయమున్న సంస్థలు, కైలాష్ గుప్తా సహా కొందరు యజమానుల ఇళ్లపై బుధ, గురువారాల్లో వరుస దాడులు చేసింది. ఈ సోదాల్లో లభించిన రూ. 82.11 కోట్ల విలువైన 145.89 కేజీల బంగారాన్ని సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు గురువారం వెల్లడించారు. ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఐటీశాఖ ఫిర్యాదుతో బయటపడ్డ స్కాం 2016 నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడగా ముసద్దిలాల్ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్‌ల కేంద్రంగా ‘విక్రయాల’స్కెచ్ రెడీ చేసింది. ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5,200 మంది వినియోగదారులు రూ. 97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్ అడ్వాన్స్ పేమెంట్ రసీదులు సృష్టించింది. బోగస్ రసీదులతోపాటు కస్టమర్ల వివరాలంటూ కొందరి ఆధార్ కార్డుల నకళ్లను జత చేసింది. వినియోగదారుల పాన్ నంబర్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ప్రతి లావాదేవీని రూ. 2 లక్షలలోపు చూపింది. ఆ మొత్తాన్ని హైదరాబాద్ పంజాగుట్టలోని ఎస్బీఐ, బంజారాహిల్స్‌లోని యాక్సెస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపుపన్నుశాఖ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. యాజమాన్యం సమర్పించిన గుర్తింపుపత్రాలకు చెందిన వ్యక్తులను పోలీసులు విచారించగా ఆ రోజు తాము బంగారమేదీ కొనలేదని వారు చెప్పారు. ముసద్దిలాల్ సంస్థల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా నోట్ల రద్దు రోజున కేవలం 67 మంది వినియోగదారులే వచ్చినట్లు వెల్లడైంది. అలాగే బిల్లులన్నీ నోట్ల రద్దు తేదీ తర్వాతే నమోదయ్యాయని పోలీసులు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. దీంతో సంస్థ మోసం బయటపడింది. అరెస్టును తప్పించుకునేందుకూ ప్రయత్నాలు సీసీఎస్ పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముసద్దిలాల్ యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేసింది. ఏకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) రికార్డుల్నీ తారుమారు చేసింది. ముసద్దిలాల్ సంస్థలకు డైరెక్టర్లుగా కైలాష్ చంద్ గుప్తా, ఆయన కుమారులు నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తా, కోడలు నేహాగుప్తా ఉండగా వారి పేర్లు మారుస్తూ రికార్డులు సృష్టించింది. మరోవైపు నల్లధనాన్ని వ్యాపారం రూట్లో డిపాజిట్ చేయడానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు సైతం తెరిచింది. ముసద్దిలాల్ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో అయిన డిపాజిట్లు, మళ్లింపులపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టగా రూ. 80 కోట్ల మేర అష్టలక్ష్మీ గోల్డ్, శ్రీ బాలాజీ గోల్డ్ సంస్థల ఖాతాల్లోకి మళ్లినట్లు తేల్చారు. ఆ డబ్బుతో ఆయా సంస్థల నుంచి హోల్‌సేల్‌గా బంగారం కొన్నట్లు కాగితాల్లో చూపారని నిర్ధారించారు. ఇందుకు సహకరించినందుకు ఆయా వ్యాపారులకు 10 నుంచి 30 శాతం వరకు కమీషన్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన కైలాష్‌చంద్ గుప్తా, ఆయన కుమారులు సహా మొత్తం 10 మంది నిందితులు, ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, అనుబంధ సంస్థలపై చార్జిషీట్ దాఖలు చేశారు. దీని ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ... ఈ స్కాంలో లబ్ధి పొందిన డబ్బుతో ముసద్దిలాల్ యాజమాన్యం 270 కేజీల బంగారం ఖరీదు చేసి వ్యాపారం చేసినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలోనే బుధ, గురువారాల్లో హైదరాబాద్, విజయవాడల్లో యజమానుల ఇళ్లలో సోదాలు జరిపి భారీగా బంగారం సీజ్ చేసింది. -
బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, సిటీబ్యూరో: డీమానిటైజేషన్ తర్వాత దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో అతిపెద్ద ఆర్థిక నేరమైన ‘ముసద్దిలాల్’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు ప్రారంభించింది. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రాల ఆధారంగా ఎటాచ్మెంట్ ప్రక్రియ మొదలెట్టింది. ఇప్పటికే రూ.2 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి కోర్టుకు నివేదించడం కోసం ఈ కేసులో ఈడీ చర్యలను సీసీఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. నోట్ల మార్పిడితో ముడిపడిన ఈ స్కామ్ రూ.97.85 కోట్లుగా నిర్దారించిన సీసీఎస్ గతేడాది చార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం విదితమే. పది మంది నిందితులతో పాటు మూడు కంపెనీలపై అభియోగాలు మోపారు. 2016 నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడటంతో కంగుతిన్న ముసద్దిలాల్ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలు ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్‌ల కేంద్రంగా ‘విక్రయాల’ స్కెచ్ రెడీ చేసింది. ఆ రోజు రాత్రి 9 నుంచి అర్థరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5200 మంది వినియోగదారులు రూ.97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్ అడ్వాన్స్ పేమెంట్ రసీదులు సృష్టించింది. ఆ మొత్తాన్ని పంజగుట్టలోని ఎస్బీఐ, బంజారాహిల్స్‌లోని యాక్సస్ బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసింది. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపుపన్ను శాఖ అధికారుల సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సదరు బోగస్ బిల్లుల ప్రకారం ప్రతి ఒక్క వినియోగదారుడు రూ.1.89 లక్షల బంగారం ఖరీదు చేసినట్లు ఉంది. ఈ రసీదులతో పాటు కస్టమర్లకు సంబంధించినవిగా పేర్కొంటూ యాజమాన్యం ఆధార్ కార్డు తదితర ధ్రువీకరణలను జత చేసింది. ఆయా గుర్తింపుపత్రాల ఆధారంగా సీసీఎస్ పోలీసులు సంబంధీకులను పిలిపించి విచారించగా, అవన్నీ నకిలీలని వెలుగులోకి వచ్చింది. ఈ ‘నల్లధనాన్ని’ వ్యాపారం రూట్లో డిపాజిట్ చేయడానికే ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు సైతం తెరిచినట్లు దర్యాప్తు అధికారులు నిర్థారించారు. మరోపక్క సీసీఎస్ అధికారులు ముసద్దిలాల్ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో అయిన డిపాజిట్లు, మళ్లింపులపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని కొందరు బంగారం వ్యాపారులకు ఈ ‘మార్పిడి’లో పాత్ర ఉన్నట్లు తేల్చారు. నగదును ఆయా బంగారం వ్యాపారులు ఖాతాల్లోకి మళ్లించిన ముసద్దిలాల్ యాజమాన్యం వారు తమ వద్ద పసిడి ఖరీదు చేసినట్లు రికార్డులు సృష్టించి, ఆ మొత్తాన్ని తిరిగి తమ ఖాతాల్లోకి తెప్పించుకున్నారని దర్యాప్తులో తేలింది. ఇందుకు సహకరించినందుకు ఆయా వ్యాపారులకు 10 నుంచి 30 శాతం వరకు కమీషన్లు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ క్రయ విక్రయాలకు సంబంధించి ఎలాంటి డెలివరీ, రిసీవ్డ్ రసీదులు లేవనీ నిర్థారించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన కైలాష్ చంద్ గుప్త, ఆయన కుమారులు నితిన్ గుప్త, నిఖిల్ గుప్తలతో పాటు మరో నలుగురు, అరెస్టు కాని ముగ్గురు నిందితులతో కలిపి మొత్తం 10 మంది నిందితులు, ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలపై అభియోగాలు మోపారు. ఈ మేరకు గతేడాది డిసెంబర్లో నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం మనీ లాండరింగ్‌కు సంబంధించినది కావడంతో సీసీఎస్ పోలీసులు తొలుతే ఈడీకి సమాచారం అందించారు. కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్ కాపీని సైతం అందజేశారు. వీటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ‘ముసద్దిలాల్’ యాజమాన్యంపై ఉచ్చు బిగిస్తోంది. ప్రాథమికంగా ఎటాచ్మెంట్స్ ప్రక్రియ మెదలెట్టిన ఈడీ ఇప్పటి వరకు రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఈడీ చర్యలన్నీ సీసీఎస్ పోలీసుల రికార్డుల ఆధారంగానే జరిగుతున్నాయి. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకుంటున్న చర్యల్ని న్యాయాస్థానికి వివరించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ముసద్దిలాల్ సంస్థల యాజమాన్యంతో పాటు ఇతర నిందితులపై ఈడీ తీసుకుంటున్న చర్యలను ఆరా తీస్తున్నారు. -
‘అదృశ్య వినియోగదారులు’ ఎవరు?
‘ముసద్దీలాల్’కేసులో సీసీఎస్ దర్యాప్తు ముమ్మరం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన గత నెల 8 రాత్రి రూ.100 కోట్లకు పైగా వ్యాపారం చేసిన ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్.. దాని అనుబంధ సంస్థ వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాన్ని నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. నిందితుల అరెస్టుపై హైకోర్టు స్టే విధించడంతో విచారణకు సహకరించాల్సిందిగా కోరుతూ ప్రశ్నావళి జారీ చేశారు. దీన్ని నిందితులకు పంపిన అధికారులు వారి నుంచి వచ్చే జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 14 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆదాయపుపన్ను శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన ఈ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు సంస్థలూ బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో ‘అనుమానాస్పదంగా’ భారీ వ్యాపారం జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించి ఫిర్యాదు చేశారు. రెండు సంస్థలకు చెందిన డైరెక్టర్లు నితిన్ గుప్తా, సీరా మల్లేశ్, నరేంద్ర జిగెల్లబోయిన, వినూత బొల్ల నిందితులుగా ఉన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన నవంబర్ 8 అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 3 గంటల వ్యవధిలో ఈ సంస్థలు రూ.100 కోట్ల వ్యాపారం చేసినట్లు రికార్డులు రూపొందించాయి. ఈ వ్యవధిలో ఐదు వేల మందికిపైగా వినియోగదారులు ఒక్కొక్కరూ రూ.1.89 లక్షల విలువైన బంగారం కొన్నట్లు బిల్లుల్లో చూపించింది. ఈ సమయంలో అంతమంది వినియోగదారులు రావడమనేది ఒక ఎత్తయితే.. అందరూ ఒకే మొత్తంలో పసిడి ఖరీదు చేయడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారు లు ఈ దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఆ రోజు, ఆ సమయంలో ఈ షాపులకు ఎవరూ వచ్చినట్లు వాటిలో కనిపించలేదు. దీంతో ఆ ‘అదృశ్య వినియోగదారులు’ఎవరనే అంశానికి దర్యాప్తు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ రికార్డులన్నీ సేకరించాలని సీసీఎస్ అధికారులు నిర్ణయించారు. భారీ మొత్తంతో ముడిపడిన కేసు కావడంతో దీనిపై ఆదాయపన్ను శాఖ, ఈడీ సైతం సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నాయి.