బిగుస్తున్న ఉచ్చు | ED Enter In Musaddilal Case | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు

Published Mon, Oct 8 2018 8:45 AM | Last Updated on Mon, Oct 22 2018 1:43 PM

ED Enter In Musaddilal Case - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: డీమానిటైజేషన్‌ తర్వాత దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో అతిపెద్ద ఆర్థిక నేరమైన ‘ముసద్దిలాల్‌’ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చర్యలు ప్రారంభించింది. ఈ కేసులో సీసీఎస్‌ పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రాల ఆధారంగా ఎటాచ్‌మెంట్‌ ప్రక్రియ మొదలెట్టింది. ఇప్పటికే రూ.2 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి కోర్టుకు నివేదించడం కోసం ఈ కేసులో ఈడీ చర్యలను సీసీఎస్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. నోట్ల మార్పిడితో ముడిపడిన ఈ స్కామ్‌ రూ.97.85 కోట్లుగా నిర్దారించిన సీసీఎస్‌ గతేడాది చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం విదితమే. పది మంది నిందితులతో పాటు మూడు కంపెనీలపై అభియోగాలు మోపారు. 2016 నవంబర్‌ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడటంతో కంగుతిన్న ముసద్దిలాల్‌ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దీని అనుబంధ సంస్థలు ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల కేంద్రంగా ‘విక్రయాల’ స్కెచ్‌ రెడీ చేసింది.

ఆ రోజు రాత్రి 9 నుంచి అర్థరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5200 మంది వినియోగదారులు రూ.97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్‌ అడ్వాన్స్‌ పేమెంట్‌ రసీదులు సృష్టించింది. ఆ మొత్తాన్ని పంజగుట్టలోని ఎస్బీఐ, బంజారాహిల్స్‌లోని యాక్సస్‌ బ్యాంక్‌ల్లో డిపాజిట్‌ చేసింది. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపుపన్ను శాఖ అధికారుల  సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సదరు బోగస్‌ బిల్లుల ప్రకారం ప్రతి ఒక్క వినియోగదారుడు రూ.1.89 లక్షల బంగారం ఖరీదు చేసినట్లు ఉంది. ఈ రసీదులతో పాటు కస్టమర్లకు సంబంధించినవిగా పేర్కొంటూ యాజమాన్యం ఆధార్‌ కార్డు తదితర ధ్రువీకరణలను జత చేసింది. ఆయా గుర్తింపుపత్రాల ఆధారంగా సీసీఎస్‌ పోలీసులు సంబంధీకులను పిలిపించి విచారించగా, అవన్నీ నకిలీలని వెలుగులోకి వచ్చింది. ఈ ‘నల్లధనాన్ని’ వ్యాపారం రూట్‌లో డిపాజిట్‌ చేయడానికే ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు సైతం తెరిచినట్లు దర్యాప్తు అధికారులు నిర్థారించారు. మరోపక్క సీసీఎస్‌ అధికారులు ముసద్దిలాల్‌ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో అయిన డిపాజిట్లు, మళ్లింపులపై దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలోనే నగరంలోని కొందరు బంగారం వ్యాపారులకు ఈ ‘మార్పిడి’లో పాత్ర ఉన్నట్లు తేల్చారు. నగదును ఆయా బంగారం వ్యాపారులు ఖాతాల్లోకి మళ్లించిన ముసద్దిలాల్‌ యాజమాన్యం వారు తమ వద్ద పసిడి ఖరీదు చేసినట్లు రికార్డులు సృష్టించి, ఆ మొత్తాన్ని తిరిగి తమ ఖాతాల్లోకి తెప్పించుకున్నారని దర్యాప్తులో తేలింది. ఇందుకు సహకరించినందుకు ఆయా వ్యాపారులకు 10 నుంచి 30 శాతం వరకు కమీషన్లు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ క్రయ విక్రయాలకు సంబంధించి ఎలాంటి డెలివరీ, రిసీవ్డ్‌ రసీదులు లేవనీ నిర్థారించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన కైలాష్‌ చంద్‌ గుప్త, ఆయన కుమారులు నితిన్‌ గుప్త, నిఖిల్‌ గుప్తలతో పాటు మరో నలుగురు, అరెస్టు కాని ముగ్గురు నిందితులతో కలిపి మొత్తం 10 మంది నిందితులు, ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దీని అనుబంధ సంస్థలపై అభియోగాలు మోపారు. ఈ మేరకు గతేడాది డిసెంబర్‌లో నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

ఈ వ్యవహారం మనీ లాండరింగ్‌కు సంబంధించినది కావడంతో సీసీఎస్‌ పోలీసులు తొలుతే ఈడీకి సమాచారం అందించారు. కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ కాపీని సైతం అందజేశారు. వీటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ‘ముసద్దిలాల్‌’ యాజమాన్యంపై ఉచ్చు బిగిస్తోంది. ప్రాథమికంగా ఎటాచ్‌మెంట్స్‌ ప్రక్రియ మెదలెట్టిన ఈడీ ఇప్పటి వరకు రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఈడీ చర్యలన్నీ సీసీఎస్‌ పోలీసుల రికార్డుల ఆధారంగానే జరిగుతున్నాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తీసుకుంటున్న చర్యల్ని న్యాయాస్థానికి వివరించాలని సీసీఎస్‌ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ముసద్దిలాల్‌ సంస్థల యాజమాన్యంతో పాటు ఇతర నిందితులపై ఈడీ తీసుకుంటున్న చర్యలను ఆరా తీస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement