‘సమర సమ్మేళనానికి కదలాలి’
దురాజ్‌పల్లి (సూర్యాపేట) : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, కార్మికుల కనీస వేతనాల అమలుపై జరుగుతున్న సమర సమ్మేళన సభకు కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.సాయిబాబు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ధర్నా చౌక్‌ను రద్దు చేస్తూ అక్కడి నుంచి ఎత్తివేయడం అప్రజాస్వామికమని, కార్మిక, ప్రజాపోరాటలపై దాడి అని అన్నారు.
అంగన్వాడీలు, వీఆర్వోలు, వీఆర్ఏలు పోరాడితే కొద్దిపాటి జీతాన్ని పెంచి పాలాభిషేకం చేయించుకుంటూ సీఐటీయూపై విషం చిమ్ముతున్న వైనాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయకుండా కొద్ది మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తామని వీఆర్ఏల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఒక్కరిని కూడా చేయలేదన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశలు, అంగన్వాడీ మినీ సెంటర్ వర్కర్లకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, నాయకులు యాకలక్ష్మి, రోశపతి, పెంటయ్య, ముత్యాలు, రంగయ్య, పరమేష్, సుందరయ్య, తిరుపతమ్మ పాల్గొన్నారు.