nadeem
-
సహచర మంత్రి జహావిపై సునాక్ వేటు
లండన్: పన్నుల వివాదంలో చిక్కుకున్న అధికార కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్, సహచర కేబినెట్ మంత్రి నదీమ్ జహావిని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మంత్రి మండలి నుంచి తొలగించారు. జహావి పన్ను వ్యవహారాల్లో మంత్రులకుండే నియమనిబంధనల్ని ఉల్లంఘించారంటూ విచారణలో తేలడంతో సునాక్ ఆయనపై వేటు వేశారు. ప్రస్తుతం జహావి శాఖ లేని మంత్రిగా కేబినెట్లో ఉన్నారు. ప్రభుత్వం నియమించిన స్వతంత్ర విచారణ నివేదికను కూడా సునాక్ విడుదల చేశారు. ఇరాక్‌లో జన్మించిన జహావి ఆర్థిక మంత్రిగా ఉండగా అంతకు ముందు కట్టని పన్నులకు పెనాల్టీగా 50 లక్షల పౌండ్లు చెల్లించారు. ఈ విషయాన్ని దాయడం మినీస్టిరియల్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని విచారణ నివేదిక తేల్చి చెప్పింది. -
పాక్ కామెంటేటర్ పైత్యం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సెహ్వాగ్! నెహ్రా ఇప్పుడు...
“Ashish Nehra is right now preparing for UK Prime Minister Elections”: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంత చలాకీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విషయం ఏదైనా తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తాడు. తాజాగా మరోసారి వీరూ భాయ్.. పాకిస్తాన్ పొలిటికల్ కామెంటేటర్ జైద్ హమీద్‌ను దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచాడు. క్రీడాకారుల పేర్లు వాడుకుని విద్వేష విషం చిమ్మాలనుకున్న హమీద్‌కు అదిరిపోయే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. కనీస అవగాహన లేని అతడి విషయపరిజ్ఞానాన్ని ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంతకీ విషయమేమింటే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్-2022కు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఈ విభాగంలో పసిడి పతకం సాధించాడు. అంతకు ముందు జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ రతజం సాధించగా.. నదీం నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ గైర్హాజరీలో అతడు ఏకంగా పసిడి పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో జైద్ హమీద్ ట్విటర్ వేదికగా తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ‘‘ఈ విజయం మరింత మధురమైనదిగా ఎందుకు మారిందంటే.. ఈ పాకిస్తానీ అథ్లెట్ ఇండియన్ జావెలిన్ త్రో హీరో ఆశిష్ నెహ్రాను ఓడించాడు. గతంలో ఆశిష్.. అర్షద్ నదీమ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే కదా! మరి ఇప్పుడు అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు’’ అని ట్వీట్ చేశాడు. నీరజ్ చోప్రా బదులు మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా పేరు వాడాడు. అంతేకాదు కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్ పాల్గొనకపోయినా అతడిని పాక్ అథ్లెట్ ఓడించాడంటూ ప్రగల్భాలు పలికాడు. ఈ ట్వీట్ వీరేంద్ర సెహ్వాగ్ కంటపడింది. ‘‘చిచ్చా.. ఆశిష్ నెహ్రా ఇప్పుడు.. ఇంకేముంది! వీరూ భాయ్ తనదైన స్టైల్లో హమీద్‌కు చురకలు అంటించాడు. ‘‘చిచ్చా.. ఆశిష్ నెహ్రా ఇప్పుడు యూకే ప్రధాన మంత్రి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాడు. నువ్వు కాస్త చిల్ అవ్వు’’ అంటూ సెటైర్ వేశాడు. అయితే, చాలా మంది నెటిజన్లు ఇందుకు సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొంత మంది మాత్రం మనకు ఇవన్నీ అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారంటూ సెహ్వాగ్ ఇటీవల హిమదాస్‌కు శుభాకాంక్షలు చెప్పిన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను రీషేర్ చేస్తున్నారు. అదే విధంగా నీరజ్ చోప్రా, నదీమ్ సోదరభావంతో పరస్పరం ఒకరినొకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతున్నారని.. హమీద్ లాంటి వాళ్లు మాత్రం విషం చిమ్మాలని చూస్తున్నారంటూ అతడిని విమర్శిస్తున్నారు. చదవండి: Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ Chicha, Ashish Nehra is right now preparing for UK Prime Minister Elections. So Chill 🤣 pic.twitter.com/yaiUKxlB1Z — Virender Sehwag (@virendersehwag) August 11, 2022 -
నీరజ్ చోప్రా గైర్హాజరీలో చెలరేగిన నదీమ్.. 56 ఏళ్ల పాకిస్తాన్ నిరీక్షణకు తెర
కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అద్భుతం చేశాడు. ఫైనల్లో నదీమ్ జావెలిన్‌ను 90.18 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో జావెలిన్‌ను 90 మీటర్లకు పైగా విసిరిన రెండో ఆసియా అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. 2017లో చైనీస్ తైపీ అథ్లెట్ 91.36 మీటర్ల దూరం విసిరాడు. నదీమ్ ప్రదర్శనతో పాక్ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకం గెలిచింది. ఇదిలా ఉంటే భారత స్టార్, వరల్డ్ నంబర్ వన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయం కారణంగా చివరి నిమిషంలో కామన్వెల్త్ క్రీడల బరిలో నుంచి తప్పుకోవడం నదీమ్‌కు కలిసొచ్చింది. నీరజ్ గైర్హాజరీలో నదీమ్ చెలరేగాడు. కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పాక్ కల సాకారం చేశాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నదీం నాలుగో స్థానంలో నిలువగా.. నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని (రెండో స్థానం) గెల్చుకున్నాడు. నీరజ్ అదే ఊపులో కామన్వెల్త్ బరిలోకి దిగి ఉంటే అలవోకగా 90 మీటర్ల దూరం విసిరేవాడు. ఏదిఏమైనప్పటికీ నీరజ్ కామన్వెల్త్ క్రీడల బరిలో లేకపోవడంతో పాక్ 56 ఏళ్ల కల నెరవేరింది. కాగా, నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కు రజత పతకం అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీజార్జి కాంస్య పతకాన్ని సాధించింది. చదవండి: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్ ప్రోమో -
రెండో టెస్ట్‌కు భారత జట్టులో కీలక మార్పు!
చెన్నై: ఇంగ్లండ్‌తో ఈనెల 13 నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టులో కీలక మార్పు చేయాలని జట్టు మేనేజ్మెంట్ యోచిస్తోంది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్‌లో నదీమ్ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికీ.. దాదాపు నాలుగు రన్‌రేట్‌తో పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 59 ఓవర్లు వేసి 233 పరగులు ఇచ్చాడు. ఇది చాలదన్నట్లు మ్యాచ్‌లో ఏకంగా 9 నోబాల్స్ కూడా వేశాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా అతనిపై వేటు దాదాపు ఖరారైంది. కాగా, మోకాలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన అక్షర్ పటేల్.. రెండో టెస్టులో జట్టులోకి వచ్చేది దాదాపుగా ఖరారైనట్టే. అతను నెట్స్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా సాధన చేస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 39 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల అక్షర్ పటేల్.. భారత్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడాడు. అతను టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేయాల్సివుంది. కాగా, ఇంగ్లండ్‌తో చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 227 పరుగుల తేడాతో పర్యాటక జట్టు చేతిలో ఓటమి చవి చూసింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనకపడివుంది. -
‘ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది’
ముంబై : సినిమాటోగ్రాఫర్ నదీమ్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన భార్య, గాయని పార్వతి తెలిపారు. ప్రస్తుతం నదీమ్ వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె తెలిపారు. నదీమ్ ఖాన్ సోమవారం సాయంత్రం ఇంట్లో మెట్ల మీద నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో తల, భుజం, ఛాతికి దెబ్బలు తగలడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం ఉదయం అతనికి బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. కాగా నదీమ్ ఖాన్ ప్రముఖ హిందీ కథారచయిత రాహి మసూమ్ రాజా కుమారుడు. నదీమ్ ఖాన్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య మాట్లాడుతూ.. ‘ఆయన ఐసీయులో వెంటిలేటర్‌పై ఉన్నారు. అతను స్పృహలో లేరు. ఆయన స్పందించడానికి 48 నుంచి 72 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. అతను ఎప్పుడు స్పందిస్తారని వేచి చూస్తున్నాం. నదీమ్ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు’. అని పార్వతి తెలిపారు. (‘అది తప్పే నిజాయితీగా ఒప్పుకుంటున్నా’) ‘మేము ఆస్పత్రికి వచ్చినప్పుడు నదీమ్‌కు చిన్న చిన్న గాయలు మాత్రమే అయ్యాయి. అయితే ఇప్పుడవి సీరియస్‌గా మారాయి. ఆసుపత్రిలో అతన్ని ఐసీయూలో కోవిడ్-19 బాధితులతో ఉంచారు. రెండు నెలలుగా అతను లాక్‌డౌన్‌లోనే ఉన్నారు. ఎవరినీ కలవలేదు. వైద్యులు నదీమ్‌కు ర్యాపిడ్ పరీక్షలు, అత్యవసర సర్జరీలు చేశారు. అయితే ఈ ప్రక్రియను నిర్వహించడంలో వైద్యులు ఆలస్యం చేశారు. ఆసుపత్రిలో కరోనా ప్రభావం ఉండటం వల్ల ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. కేవలం అతను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’’ అని పార్వతి భావోద్వేగానికి లోనయ్యారు. కాగా నదీమ్ ఖాన్.. డిస్కో డాన్సర్, జమానా, ఆంధీ-తూఫాన్, ఆగ్ హాయ్ ఆగ్, కింగ్ అంకుల్, గునాహ్ వంటి 40 చిత్రాలకు పైగా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే చంకీ పాండే, ఇందర్ కుమార్, మోనికా బేడి నటించిన తిర్చి తోపివాలే (1998) సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. (రియాజ్..ఇక నరకంలో హాయిగా నిద్రపో’ ) -
రాణించిన విహారి
న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో హనుమ విహారి (95 బంతుల్లో 87 నాటౌట్; 9 ఫోర్లు), బౌలింగ్‌లో షాబాజ్ నదీమ్ (3/32), మయాంక్ మార్కండే (4/48) రాణించడంతో భారత్ ‘బి’ జట్టు దేవధర్ ట్రోఫీలో శుభారంభం చేసింది. భారత్ ‘ఎ’తో మంగళవారం జరిగిన పోరులో ‘బి’ జట్టు 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా భారత్ ‘బి’ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. విహారి అజేయ అర్ధశతకం సాధించగా, మనోజ్ తివారి (52; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ‘ఎ’ బౌలర్లలో అశ్విన్ 2, సిరాజ్, కులకర్ణి, సిద్ధార్థ్ కౌల్, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ‘ఎ’... పృథ్వీ షా (7) విఫలమవగా, 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (114 బంతుల్లో 99; 11 ఫోర్లు, 1 సిక్స్), అశ్విన్ (54; 5 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. దీంతో లక్ష్యం దిశగా పయనించింది. 210/5 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అయితే మయాంక్ మార్కండే, నదీమ్‌ల స్పిన్ మ్యాజిక్‌తో అనూహ్యంగా 8 పరుగుల వ్యవధిలో మిగతా 5 వికెట్లు కోల్పోయి 218 స్కోరు వద్ద ఆలౌటైంది. -
బీజేపీకి మజ్లిస్ పరోక్ష మద్దతు
సాక్షి, హైదరాబాద్: ముస్లింల గొంతుకగా చెప్పుకునే ఎంఐఎం హిందుత్వ ఎజెండా అమలుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి పరోక్ష మద్దతు ఇస్తోందని ఏఐసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ నదీమ్ జావిద్ ఆరోపించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి ముస్లింల ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మేలు చేసిందని విమర్శించారు. మజ్లిస్ పోటీ చేసిన స్థానాల్లో రెండు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఓట్లను మాత్రమే సాధించినప్పటికీ గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. రాష్ట్ర మైనారిటీ సెల్ చైర్మన్ అబ్దుల్ సోహెల్, మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్ అబీద్ రసూల్‌ఖాన్, మైనారిటీ నేత సిరాజ్ ఖాన్‌తో కలసి గాంధీభవన్‌లో జావిద్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మజ్లిస్ పార్టీ బీజేపీతో అంతర్గతంగా కలిసి ఉందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అన్ని విధాలుగా సహకరిస్తోందనీ, అందులో భాగంగానే మజ్లిస్ టీఆర్ఎస్కు మద్దతు ఇస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య రహస్య ఒప్పందం ఉందని విమర్శించారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ పేరుతో టీఆర్ఎస్ మభ్య పెట్టి మోసం చేసిందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, ఐదు రాష్ట్రాల్లో అనుకూల పవనాలు ఉన్నట్లు వివిధ సంస్థల సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపిస్తామన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ ఇక్బాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి ఆయనను జావిద్ పార్టీలోకి ఆహ్వానించారు. -
నదీమ్‌కు 5 వికెట్లు
చెన్నై: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీలో జార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ జోరు కొనసాగుతోంది. ఇటీవల రాజస్తాన్‌తో మ్యాచ్‌లో (8/10) ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా గురువారం జమ్ముకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటడంతో జార్ఖండ్ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్... అనుకూల్ రాయ్ (72 బంతుల్లో 96 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. రాయ్ మినహా మిగతావారు ఆకట్టుకోలేకపోవడంతో జార్ఖండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమ్ముకశ్మీర్ జట్టు నదీమ్ (5/17) ధాటికి 42.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. 76 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు చివర్లో ముదస్సిర్ (28 బంతుల్లో 53; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇతర మ్యాచ్‌ల్లో అసోం (204 ఆలౌట్) పై 130 పరుగుల తేడాతో తమిళనాడు (334/4) గెలిచింది. రాజస్తాన్ (157 ఆలౌట్)పై 147 పరుగుల తేడాతో హరియాణా (304 ఆలౌట్) నెగ్గింది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ప్రొఫెషనల్ క్రికెట్లో 1000 వికెట్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ‘ఎ’, టి20 మ్యాచ్‌లలో కలిపి అతను ఈ ఘనత సాధించాడు. -
శభాష్ నదీమ్
చెన్నై: జార్ఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ సంచలన బౌలింగ్ (10–4–10–8) ప్రదర్శనతో సత్తా చాటాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్ (అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు కలిపి)లో అత్యుత్తమ గణాంకాలతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. గురువారం విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నదీమ్ 10 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు (హ్యాట్రిక్ సహా) పడగొట్టాడు. ఈ క్రమంలో ఇరవై ఏళ్ల క్రితం ఢిల్లీ బౌలర్ రాహుల్ సంఘ్వీ (8/15) హిమాచల్ ప్రదేశ్‌పై నెలకొల్పిన రికార్డును అతను బద్దలు కొట్టాడు. నదీమ్ ధాటికి రాజస్తాన్ 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో తొలి 8 వికెట్లూ నదీమ్ ఖాతాలోకే వెళ్లాయి. ఇందులో 5 క్లీన్‌బౌల్డ్‌లు, ఒక ఎల్బీడబ్ల్యూ ఉండటం మరో విశేషం. ఈ క్రమంలో అతను ‘హ్యాట్రిక్’ కూడా నమోదు చేయడం ఇంకో ప్రత్యేకత. తన ఆరో ఓవర్ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన అతను, తర్వాతి ఓవర్ తొలి బంతికే మరో వికెట్ పడగొట్టాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో చివరి 2 వికెట్లు మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అనుకూల్ రాయ్‌కు దక్కాయి. అప్పటి వరకు ఐదు ఓవర్ల పాటు సాధారణంగా బౌలింగ్ చేసిన అనుకూల్‌కు ఈ పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో, ఎలా వేగం పెంచాలో సీనియర్‌గా నదీమ్ తగు సూచనిలిచ్చాడు. ఆ తర్వాతే అతనికి వికెట్లు దక్కాయని తన రికార్డు అనంతరం నదీమ్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డు చమిందా వాస్ (8/19) పేరిట ఉంది. 29 ఏళ్ల నదీమ్ ఫస్ట్ క్లాస్ కెరీర్ వయసు 14 ఏళ్ళు కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో 2004 నుంచి నిలకడగా రాణిస్తూ 99 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 375 వికెట్లు తీసినా దురదృష్టవశాత్తూ భారత జట్టులో ఎంపికకు మాత్రం అతను ఎప్పుడూ చేరువకాలేదు. ఐపీఎల్లో అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున విశే షంగా రాణించిన అతను, ఆసియా కప్‌లో భారత జట్టుకు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేశాడు. ‘ఎ’ జట్టు ప్రదర్శనతో పాటు తాజా రికార్డు వెస్టిండీస్‌తో సిరీస్‌కు అవకాశం కల్పిస్తుందని నదీమ్ ఆశిస్తున్నాడు. పది వికెట్లు పడగొడితే ఇంకా బాగుండేది. కానీ దేనికైనా రాసిపెట్టి ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి చాలా సంతోషం. అనుకూల్ నా రికార్డును దెబ్బ తీశాడని భావించడం లేదు. ఒక సీనియర్‌గా అతడికి మార్గనిర్దేశనం చేయడం నా బాధ్యతగా భావించా. మ్యాచ్ తర్వాత జట్టు సహచరులు అతడిని ఆట పట్టించారు కూడా. అయితే చివరకు జట్టు విజయమే ముఖ్యం. -
అనంతపురం, హిందూపురం..రంగయ్య, నదీమ్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం, హిందూపురం పార్లమెంట్లకు వేర్వేరుగా సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ల సమన్వయకర్తగా ఇప్పటి వరకూ కొనసాగిన తలారి పీడీ రంగయ్యను అనంతపురం పార్లమెంట్మన్వయకర్తగా నియమించారు. అలాగే అనంతపురం అర్బన్ సమన్వయకర్తగా ఉన్న నదీమ్ అహ్మద్‌ను హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రా మిరెడ్డిని అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించారు. సముచిత నిర్ణయమే హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్ అహ్మద్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయమే. వైఎస్సార్ కుటుంబానికి ముందు నుంచి మైనార్టీలు అంటే చాలా ప్రేమ. 2004 ఎన్నికల్లో సైతం హిందూపురం పార్లమెంట్ స్థానానికి కదిరికి చెందిన కర్నల్ నిజాముద్దీన్‌కి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అలాగే 2009 ఎన్నికల్లో సైతం మళ్లీ మైనార్టీ అభ్యర్థి అయిన ఖాసీమ్ఖాన్కు టికెట్ ఇచ్చారు. అయితే ప్రజారాజ్యం పార్టీ తరపున కడపల శ్రీకాంత్‌రెడ్డి బరిలో ఉండడం వల్ల ఖాసీం ఖాన్ ఓటమి పాలయ్యేవాడు. లేకపోతే అప్పుడు కూడా మైనార్టీ అభ్యర్థే గెలుపొందేవారు. ఇప్పుడు మా అధినేత జగన్మోహన్రెడ్డి హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం. మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారు. నదీమ్ నియామకం మైనార్టీలకు ఇచ్చిన గౌరవం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా టీడీపీ మైనార్టీ అభ్యర్థిని నిలపలేదు. ఏపీ కేబినెట్లో కూడా మైనార్టీకి అవకాశం లేదు. మేము కదిరి అసెంబ్లీకు మైనార్టీ అభ్యర్థిగా చాంద్‌బాషాకు అవకాశం ఇచ్చాం. అతను పార్టీని మోసం చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్‌ను నియమించింది. ఈ నియామకం మైనార్టీలకు ఇచ్చిన గౌరవం. నదీమ్ మంచి వ్యక్తి, సౌమ్యుడు ఖచ్చితంగా అతనికి తామంతా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. అతని నియామకాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నదీమ్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తాం. వైఎస్.జగన్మోహన్రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. -
ప్రాణం తీసిన వీకెండ్ రేసింగ్
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసర్లు రెచ్చిపోయారు. డ్రాగ్ రేసు సందర్భంగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ రేసర్ ఢీ కొట్టాడు. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న గోపాల్ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, రేసర్ నదీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రేసర్ నదీమ్ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
కుటుంబ సభ్యుల సహకారంతో రేప్ చేశాడు
ముజఫర్‌నగర్: ఓ కామాంధుడు అమ్మాయిని అత్యాచారం చేయడానికి అతని కుటుంబ సభ్యులు సహకరించారు. నిందితుడి సోదరి బాధితురాలిని ఇంటికి తీసుకురాగా, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే దారుణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని పుర్కాజీ పట్టణంలో ఈ ఘటన జరిగినట్టు బుధవారం పోలీసులు చెప్పారు. బాధితురాలి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు.. ఇటీవల ఆమె (17)ను నదీమ్ (25) అనే యువకుడి సోదరి అఫ్సానా వారి ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో ఆఫ్సానా ఇంట్లో నదీమ్, తల్లిదండ్రులు శార్వరి, ఇక్రామ్, బంధువు కమిల్ ఉన్నారు. వీరందరూ ఉండగానే నదీమ్ బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ముజఫర్‌నగర్ ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడు నదీమ్‌తో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నదీమ్ కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే జరిగిన మరో ఘటనలో జాహిద్ (30) అనే వ్యక్తి.. ఓ మహిళను ఆమె ఇంట్లోనే అత్యాచారం చేశాడు. -
పెళ్లి చేసుకోకపోతే ముక్కు కోసేసిన దుండగులు
పెళ్లి చేసుకోను అన్న పాపానికి పాకిస్తాన్ లో ఒక యువతి ముక్కు కోసేశారు కొందరు మూర్ఖులు. ఆమెను క్రూరంగా హింసించి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పాకిస్తాన్ లోని పంజాబ్ లోని బస్తీ షేర్ వాలీలో జరిగింది. ఇరవై ఏళ్ల ఫరీదా బీబీ తండ్రి బస్తీ షేర్వాలీ భూస్వామి జంషీద్ ఇంట్లో కూలీగా పనిచేస్తూంటాడు. ఆయన కుమారుడు నదీమ్ ఫరీదాపై మనసుపడ్డాడు. అయితే అతడిని వివాహం చేసుకునేందుకు ఫరీదా నిరాకరించింది. దీంతో భగ్గుమన్న నదీమ్ తన మిత్రులతో కలిసి ఆమెను అపహరించుకువెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత ఆమె మరెవరినీ వివాహం చేసుకోకుండా ఉండాలని ముక్కు కోసేశాడు. పంజాబ్ హైకోర్టు ఈ కేసును స్వీకరించిన తరువాత కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు.