సాక్షి, హైదరాబాద్: ముస్లింల గొంతుకగా చెప్పుకునే ఎంఐఎం హిందుత్వ ఎజెండా అమలుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి పరోక్ష మద్దతు ఇస్తోందని ఏఐసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ నదీమ్ జావిద్ ఆరోపించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి ముస్లింల ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మేలు చేసిందని విమర్శించారు. మజ్లిస్ పోటీ చేసిన స్థానాల్లో రెండు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఓట్లను మాత్రమే సాధించినప్పటికీ గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపించిందన్నారు.
రాష్ట్ర మైనారిటీ సెల్ చైర్మన్ అబ్దుల్ సోహెల్, మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్ అబీద్ రసూల్‌ఖాన్, మైనారిటీ నేత సిరాజ్ ఖాన్‌తో కలసి గాంధీభవన్‌లో జావిద్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మజ్లిస్ పార్టీ బీజేపీతో అంతర్గతంగా కలిసి ఉందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి అన్ని విధాలుగా సహకరిస్తోందనీ, అందులో భాగంగానే మజ్లిస్ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తోందని దుయ్యబట్టారు.
బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎంల మధ్య రహస్య ఒప్పందం ఉందని విమర్శించారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ పేరుతో టీఆర్‌ఎస్ మభ్య పెట్టి మోసం చేసిందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, ఐదు రాష్ట్రాల్లో అనుకూల పవనాలు ఉన్నట్లు వివిధ సంస్థల సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపిస్తామన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ ఇక్బాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి ఆయనను జావిద్ పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment