చక..చకా.. అవుట్‌ఫాల్ డ్రెయిన్ పనులు
► పనులైపై డీసీపీ కాళీదాసు ఆరా..!
► త్వరగా పూర్తి చేసేందుకు వీఎంసీ చర్యలు
చిట్టినగర్ : కేఎల్‌రావునగర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఓ వైపున రైల్వే అధికారులు డ్రెయిన్ వెంబడి తమ హద్దులను నిర్ణయించినప్పటికీ కార్పొరేషన్ వెనుకంజ వేయకుండా పనుల వేగం పెంచింది. పనుల తీరుపై కాంట్రాక్టర్‌తో పాటు కార్పొరేషన్ అధికారులపై మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంగళవారం తెల్లవారే సరికి పనిముట్లు, అదనపు కార్మికులను రంగంలోకి దింపారు. ఈఈ ఓం ప్రకాష్, డీఈ కోటేశ్వరరావు పనులను పర్యవేక్షించడమే కాకుండా ఎప్పటికప్పుడు పనుల పురోగతిని కమిషనర్ మొబైల్‌కు ఫొటోల రూపంలో పంపుతూ కమిషనర్ ఆదేశాలను ఆచరణలో పెడుతున్నారు. మూడు పొక్లెయిన్లతోపాటు నీటిని తోడే మెషిన్లు పెట్టారు. గోతుల్లో బెడ్ ఏర్పాటు చేయడంతోపాటు సైడ్ వాల్స్ కోసం బాక్స్‌లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రైల్వే డీఆర్ఎం డ్రెయిన్ వద్దకు విచ్చేసి పనులను పరిశీలించే అవకాశం ఉందని తెలియడంతో కొత్తపేట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
డ్రెయిన్ వద్దకు డీసీపీ కాళిదాసు
డ్రెయిన్ నిర్మాణం వివాదస్పదంగా మారుతుండటంతో నగర డీసీపీ కాళీదాసు, వెస్ట్ ఏసీపీ జి.రామకృష్ణ అంబేద్కర్‌నగర్‌కు విచ్చేశారు. డ్రెయిన్ నిర్మాణం కోసం తీసిన గోతులు ఎవరి హద్దుల్లో ఉన్నాయనే వివరాలతోపాటు సోమవారం రైల్వే సిబ్బంది పాతిన గడ్డర్లను, సరిహద్దులను పరిశీలించారు. వీఎంసీ డీఈ కోటేశ్వరరావును వివరాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఈఈ ఓం ప్రకాష్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం త్వరగా పనులు పూర్తి చేసేందుకు అవసరమైన సామాగ్రి, కూలీలను ఏర్పాటు చేయాలని సూచించారు.