nagaya Lanka
-
తండ్రిని చంపిన తనయుడు
నాగాయలంక (అవనిగడ్డ): చెడు వ్యసనాలకు బానిసైన ఓ కొడుకు అప్పులు తీర్చేందుకు ఇంటి స్థలం విక్రయించ లేదని తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బండే హరిమోహనరావు(48) భార్య 20 ఏళ్ల కిందటే చనిపోయింది. కుమార్తెకు వివాహం చేశారు. 25 సంవత్సరాల కుమారుడు పవన్ కల్యాణ్ ఇదే గ్రామంలోని అమ్మమ్మగారి ఇంటివద్ద ఉంటున్నాడు. దీంతో చిన్న పూరిపాకలో హరిమోహనరావు ఒక్కడే నివసిస్తున్నాడు. కొడుకు పవన్ కల్యాణ్ చెడు వ్యసనాలకు బానిసగా మారి తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికి హరిమోహనరావు ఉంటున్న ఇంటి స్థలాన్ని విక్రయించాల్సింగా తరచూ గొడవపడుతున్నాడు. దీనికి తండ్రి అంగీకరించడంలేదు. దీనిని మనసులో పెట్టుకున్న పవన్‌కల్యాణ్ శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తండ్రి ఉంటున్న ఇంటికి వచ్చి గొడవపడి బలమైన ఆయుధంతో అతని తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ఆపై డీజిల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయాడు. హరిమోహనరావు మృతదేహం ఇంట్లోనే మంచంపై పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
నాగాయలంకలో భారీ పోలీసు బందోబస్తు
కృష్ణా జిల్లా నాగాయలంక, ఎదురుమొండి పట్టణాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మండలంలోని ఎదురుమొండిలో 2007లో అప్పటి ఎంపీపీ కన్నా జనార్దనరావు హత్యకు గురయ్యారు. ఆకేసు విచారణ పూర్తయిన తర్వాత నేటి సాయంత్రం దీనిపై బందరులోని జిల్లా కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సందర్భంగా జనార్దన్ స్వగ్రామం ఎదురుమొండి, మండల కేంద్రం నాగాయలంకలో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. అల్లర్లు జరగొచ్చనే అనుమానంతోనే ముందు జాగ్రత్తగాఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.