NAK
-
ఐఐటీ, ఐఐఎంలతో త్వరగా అక్రిడేషన్
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల సాయంతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల అక్రిడేషన్ ప్రక్రియను త్వరగా చేపడతామని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అక్రిడేషన్ కోసం ఏర్పాటు చేసే కొత్త కమిటీలో చేరేందుకు ముందుకురావాలని ఐఐటీ, ఐఐఎంలను కోరామన్నారు. ఇంతకాలం 15 శాతం ఉన్నత విద్యాసంస్థల్లోనే అక్రిడేషన్‌ను చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్), జాతీయ గుర్తింపు మండలి(ఎన్బీఏ)లను విస్తరిస్తామన్నారు. పాఠశాల విద్యార్థులు నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా కొత్త పథకాన్ని తెస్తామని జవదేకర్ చెప్పారు. -
ఉపాధికి ఊతం న్యాక్..
సిరిసిల్ల/కోరుట్ల:నిరుద్యోగులకు ఉపాధి శిక్షణతోపాటు, నైపుణ్య శిక్షణ ఇస్తూ వేలాదిమందికి ఉపాధి బాట చూపుతోంది న్యాక్ కేంద్రాలు. రాష్ట్రవ్యాప్తంగా 38 న్యాక్ కేంద్రాలు ఉన్నాయి. వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో పేద యువతకు శిక్షణ ఇస్తూ భవిష్యత్‌పై బరోసా కల్పిస్తున్నాయి. న్యాక్ ఆఫర్ చేస్తున్న కోర్సులు.. వెల్డింగ్, ప్లంబింగ్, పేయింటింగ్ అండ్ డెకరేషన్ కోర్సులకు ఏడో తరగతి చదివిన అభ్యర్థులు అర్హులు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, స్టిచింగ్ అండ్ కర్టెన్ మేకింగ్ కోసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్ సూపర్వైజర్ కోసం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. మూడు నెలలపాటు శిక్షణ అందిస్తారు. ఉచిత వసతి గృహం, భోజన వసతి కల్పిస్తారు. వీరు అర్హులు.. ఈ కోర్సులకు 18– 35 వయసు గల అభ్యర్థులు రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, క్వాలిఫైంగ్ సర్టిఫికెట్, కుల «ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌పుస్తకం దరఖాస్తుతో జతచేసి న్యాక్కేంద్రంలో సమర్పించాలి. నైపుణ్య శిక్షణ.. శిక్షణ పొందే అభ్యర్థులు కార్మికశాఖలో పేరు నమోదు చేసుకోవాలి. లేబర్ కార్డు ఉండాలి. తాపీమేస్త్రీ, ప్లంబింగ్, వెల్డింగ్ కోర్సులకు నైపుణ్య శిక్షణ కోసం 15 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు భోజన వసతి కల్పిస్తారు. నిత్యం రూ. 300 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. నూరుశాతం ప్లేస్మెంట్.. ఉచిత భోజన వసతి హాస్టల్ సదుపాయంతోపాటు, భోజనం, యూనిఫాం, కోర్సు మెటీరియల్స్ అందజేస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇస్తారు. నూరుశాతం ప్లేస్మెంట్ కల్పిస్తారు. ఉద్యోగంలో చేరిన మూడు నెలల అనంతరం ప్రభుత్వం వారిబ్యాంకు ఖాతాలో రూ. 3,000 జమ చేస్తుంది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రావడంలేదనుకునేవారు కొందరు.. చదువు లేక కూలీనాలి చేసేవారు మరికొందరు.. చదువు.. ఆలోచనా శక్తి.. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకునే నేర్పు ఉన్నవారు మరికొందరు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమ కాళ్లపై తాము నిలబడి మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఎంతోమంది. స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు నిబంధనలనూ సరళీకృతం చేస్తున్నాయి. ఆర్థికంగా అండగా నిలిచేందుకు రుణసాయం అందిస్తున్నాయి. రాయితీ.. సబ్సిడీ.. వడ్డీ మాఫీతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు యువత వృత్తినైపుణ్యం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్వైపు నడిపిస్తున్నాయి. స్వయం ఉపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు.. నైపుణ్య శిక్షణ పెంపొందిస్తున్న సంస్థలు.. కోర్సులు.. దరఖాస్తు విధానం.. రుణాలు పొందే అవకాశం.. తదితర వివరాలతో ఈవారం వీకెండ్. -
రేపటి నుంచి ఓయూలో ‘న్యాక్’ పర్యటన
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు కోసం ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 2013లో ముగిసిన గుర్తింపును ఇప్పుడు మళ్లీ తెచ్చుకునేందుకు గత 10 నెలలుగా కృషి చేస్తున్నారు. న్యాక్ అధికారుల బృందం ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమై యూని వర్సిటీని ముస్తాబు చేశారు. యూనివర్సిటీలో ఎక్కడా వాల్ పోస్టర్లు అతికించొద్దని విద్యార్థి సంఘాలకు కూడా ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రామచంద్రం, ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ (ఐక్యూఏసీ) డైరెక్టర్ శ్రీరామ్ వెంకటేశ్ విజ్ఞప్తులు చేశారు. న్యాక్ బృందం పర్యటనను పరిగణనలోకి తీసుకుని మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సరిపడా మౌలిక సదుపాయాలు.. ఓయూలో విద్యార్థులకు తగిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వీటిపై అప్పటినుంచే ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓయూలో మౌలిక సదుపాయాలు న్యాక్ గుర్తింపు వచ్చేందుకు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. విశాలమైన ప్రాంగణం, క్రీడా మైదానాలు, స్విమ్మింగ్‌పూల్, ఇండోర్ స్టేడియం, కళాశాలలకు, హాస్టల్స్‌కు పక్కా భవనాలు, పరిశోధన కేంద్రాలు, ప్రత్యేక లైబ్రరీ, లక్షలాది పుస్తకాలు, రోడ్లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, రంగాపూర్‌లో పరిశోధన కేంద్రం, క్యాంపస్‌లో సీపీఎంబీ, బేగంపేటలో జెనటిక్స్ పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. వీలైనంత మేరకు సదుపాయాల కల్పన.. న్యాక్ గుర్తింపునకు కావాల్సిన అన్ని వివరాలను ఓయూ అధికారులు సేకరించారు. ఒక్క రెగ్యులర్ అధ్యాపకుల నియామకం మినహా మిగతా సదుపాయాలను దాదాపు కల్పించినట్లు చెబుతున్నారు. వర్సిటీకి గుర్తింపు తెచ్చే పరిశోధనలు, ప్రాజెక్టులు కావలసినన్ని ఉన్నాయని ఐక్యూఏసీ డైరెక్టర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. వందల సంఖ్యలో అనుబంధ కళాశాలలతో 3.2 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని తెలిపారు. ఓయూలో 5,225 పరిశోధన పత్రాలు, 11 పేటెంట్ రీసెర్చ్‌లు ఉండగా మరో 9 పరిశోధనలు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, రూ.129 కోట్లతో 232 ప్రాజెక్టులు ఉండగా రూ.29 కోట్లతో 165 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వివరించారు. జాతీయ, అంతర్జాతీయంగా 59 ఒప్పందాలు, అధ్యాపకులకు 225 అవార్డులు, బిరుదులు, 118 మంది పీడీఎఫ్ (పోస్ట్ డాక్టోరల్ ఫెలో) పరిశోధన విద్యార్థులు, 3,127 పీహెచ్డీ విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. క్యాంపస్‌లోని 24 హాస్టళ్లలో 9 వేల మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాక్‌తో విద్యార్థులకు మేలు.. న్యాక్ గుర్తింపుతో యూనివర్సిటీ ప్రతిష్ట పెరగడంతో పాటు విద్యార్థులకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. న్యాక్ గుర్తింపు వస్తే భారీ మొత్తంలో యూజీసీ నుంచి నిధులు రాబట్టుకోవచ్చు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశముంది. పరిశోధన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఫెలోషిప్‌లు పెరుగుతాయి. డిగ్రీ పట్టాలపై న్యాక్ గుర్తింపు ఉన్నట్లు ఐదేళ్ల పాటు ముద్రిస్తారు. దీంతో ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఓయూ సర్టిఫికెట్లకు ప్రత్యేక విలువ ఉంటుంది. -
‘స్వచ్ఛ’ సైన్యం!
- మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతానికి సర్కారు నిర్ణయం - పదివేల మంది తాపీ మేస్త్రీలకు న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారతమిషన్లో భాగంగా రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తం గా గుర్తించిన పదివేల మంది తాపీ మేస్త్రీలతో ‘స్వచ్ఛ’సైన్యాన్ని ఏర్పాటు చేస్తోంది. మరుగుదొడ్డి కోసం గది నిర్మాణంతోపాటు కమోడ్, పైప్లైన్ల అనుసం ధానం, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు వరకు అన్నీ ఒక్కరే పూర్తి చేసేలా ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)’ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. కేంద్ర నిధులతో..: బహిరంగ మల విసర్జనను అరికట్టేందుకు, ఇంటింటా మరు గుదొడ్డి ఉండేలా కేంద్రం స్వచ్ఛభారత్ మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర నిధులతో మన రాష్ట్రంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో సుమారు 10 లక్షల మరుగుదొడ్లు నిర్మించి నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మరో 1.58 లక్షల మరుగు దొడ్లు నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మరుగుదొడ్ల నిర్మా ణం ఆశించిన స్థాయిలో లేదు. లక్ష్యంలో కేవలం 40 శాతమే సాధించారు. మరో 9 జిల్లాల్లో 70 శాతం వరకు పూర్తి చేయగా.. మిగతా జిల్లాల్లో 70 శాతానికి పైబడి పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ‘స్వచ్ఛ’సైన్యంతో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం కానుంది. మూడు పనులు ఒక్కరే..: మరుగుదొడ్డి ఏర్పాటుకు కావాల్సిన గది నిర్మాణాన్ని మేస్త్రీ చేపట్టాలి, అందులో కమోడ్, పైపులు తదితర పనులు ప్లంబర్ చేస్తే... విద్యుత్ బల్బు, వైరింగ్ పని ఎలక్ట్రీషియన్ది. ఈ మూడు పనులకు ముగ్గురిని పిలిపించటం సమస్యగా మారింది. ఆర్థిక భారమనో, వేళకు వారు రాకపోవడమో.. ఇలా పలు కార ణాలతో ఆ పనులు సరిగా జరగటం లేదు. దీంతో తాపీ మేస్త్రీ ఒక్కరే ఈ మూడు పను లు చేస్తే సమస్య ఉండదని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ పనుల్లో మేస్త్రీలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం ఈ శిక్షణ బాధ్యతను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)కు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 10 వేల మంది తాపీ మేస్త్రీలకు ఈ శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు. వారం పాటు శిక్షణ: ప్రతి జిల్లా కేంద్రంలో ఆ జిల్లాలోని మేస్త్రీలకు న్యాక్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు శిక్షణ ఉంటుంది. తర్వాత వారికి పనులు పురమాయిస్తారు. మొత్తంగా ఈ పది వేల మంది రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తారు. -
పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ మళ్లీ మొదటికి..
⇒ ఫలితాల జాబితాలో అక్రమాలంటూ విద్యార్థుల ఆందోళన ⇒ దీంతో విచారణకు ఆదేశించిన యూనివర్సిటీ ⇒ దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ⇒ నివేదిక తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2013–14 సంవత్సరానికి సంబంధించి పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ జటిలమవుతోంది. దాదాపు నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న అడ్మిషన్ల అంశంపై కసరత్తు పూర్తిచేసిన విశ్వవిద్యాలయ యాజమాన్యం ఫిబ్రవరి 27న ఫలితాలు ప్రకటించింది. ఇన్నాళ్లూ వీసీ లేని కారణంగా జాప్యం జరిగిందని సర్దిచెబుతూ ప్రవేశాల ప్రక్రియను వేగిరం చేసిన అధికారులకు తాజాగా తలనొప్పి వచ్చిపడింది. పీహెచ్‌డీకి ఎంపికైన అభ్యర్థుల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, జాబితాలో అనర్హులకు అవకాశం కల్పించారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏకంగా యూనివర్సిటీ బంద్‌కు సైతం దిగడంతో ప్రవేశాల ప్రక్రియపై వెనక్కు తగ్గింది. మరోవైపు చాలాకాలం తర్వాత పీహెచ్డీ ఫలితాలు రావడంతో అందులో సీటు దక్కించుకున్న విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియకు బ్రేక్ పడటం తీవ్ర నిరాశకు గురిచేసింది. పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి గత వారం రోజులుగా ఓయూలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రవేశాల ప్రక్రియను అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా జరపాలని వీసీపై ఒత్తిడి తీసుకురావడంతో దూరవిద్యా కేంద్రం సంచాలకుల అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు అధికారులను సభ్యులుగా చేర్చుతూ విద్యార్థుల ఆరోపణలపై విచారణ నిర్వహించాలని సూచించారు. ఇదిలావుండగా, గతేడాది తప్పుడు సమాచారాన్ని సమర్పించి దాదాపు 60 మంది విద్యార్థులు రాజీవ్‌గాంధీ జాతీయ ఉపకారవేతనం (ఆర్‌జీఎన్‌ఎఫ్) పొందారు. దీనిపై పూర్తిస్థాయి ఆధారాలను యూనివర్సిటీకి సమర్పించినప్పటికీ అధికారులు మాత్రం మిన్నకుండిపోయారు. తాజాగా పీహెచ్డీ ఫలితాల్లో ఈ విద్యార్థులు సైతం ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించి ఆర్‌జీఎన్‌ఎఫ్ ద్వారా లబ్ధి పొందుతున్న తీరుపై విద్యార్థులు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నాలుగేళ్లుగా కొత్త పరిశోధనల్లేవ్..! విశ్వవిద్యాలయమంటే పరిశోధనలకు మారుపేరుగా నిర్వహిస్తారు. సకల సదుపాయాలు ఉండటంతో విద్యార్థులు సైతం యూనివర్సిటీలవైపు ప్రత్యేక శ్రద్ద చూపుతారు. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత నాలుగేళ్లుగా కొత్త పరిశోధనలకు అవకాశం లేకుండా పోయింది. 2013–14 సంవత్సర పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియకు వరుసగా అవాంతరాలు ఎదురు కావడంతో ఆ తర్వాతి సంవత్సరం నుంచి పీహెచ్డీ ప్రవేశాలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కొత్త పరిశోధనలు కొనసాగడం లేదు. నాక్(నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) గుర్తింపులో ఉపాధ్యాయులు, మౌలికవసతులు, పరిశోధనలు కీలకం. కొత్త పరిశోధనలు జరగకపోవడం, సరైన సంఖ్యలో ఉపాధ్యాయులు లేకపోవడంతో నాక్ గుర్తింపు లభించకపోవడంతో వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం పరపతి మసక బారినట్లు అవుతోంది. -
ఉస్మానియా ‘న్యాక్’ ఔట్!
ప్రకటించిన రెండు జాబితాల్లోనూ ఓయూకు దక్కని చోటు అదే దారిలో కాకతీయ, జేఎన్టీయూ, ఇతర వర్సిటీలు కేంద్రం ఇచ్చే నిధులకు గండి! నిధులు, నియామకాల్లేక అల్లాడుతున్న యూనివర్సిటీలు ఓయూలో ఇద్దరు.. కేయూలో ఒక్కరే ప్రొఫెసర్ డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులన్నీ ఖాళీ! సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. అటు నిధుల్లేక, ఇటు నియామకాల్లేక విలవిల్లాడుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ సైతం న్యాక్ గుర్తింపునకు నోచుకోలేని దుస్థితి తలెత్తింది. కాకతీయ, జేఎన్టీయూ వంటి ప్రధాన వర్సిటీలూ అదే దారిలో ఉన్నాయి. ఫలితంగా వీటికి కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత జనవరిలో ప్రకటించిన మొదటి జాబితాలో ఒక్క నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీ మినహా రాష్ట్రంలో మరే విశ్వవిద్యాలయానికి కూడా న్యాక్ గుర్తింపు దక్కలేదు. గతనెల 29న ప్రకటించిన న్యాక్ గుర్తింపు రెండో జాబితాలోనూ ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూలకు చోటు లభించలేదు. ఈ జాబితాలో రాష్ట్రంలోని రెండు ప్రైవేటు కాలేజీలు, నిజామాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి మాత్రమే న్యాక్ గుర్తింపు దక్కింది. ఈ నెల 4న కేంద్రం ప్రకటించిన టాప్-100 ప్రతిష్టాత్మక విద్యాసంస్థల జాబితాలోనూ ఈ వర్సిటీలకు చోటు దక్కలేదు. వీసీలు, తగిన సంఖ్యలో బోధన సిబ్బంది లేకపోవడంతో వర్సిటీల ఈ దయనీయ పరిస్థితిలో పడ్డాయి. ముందే చెప్పినా అదే నిర్లక్ష్యం న్యాక్ అక్రెడిటేషన్ ఉంటేనే నిధులిస్తామని ఏడాది కిందటే రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) స్పష్టంచేసింది. అయినా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మేల్కొనలేదు. ఫలితంగా గతేడాది రూ.20 కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగిన ఉస్మానియాకు ఈసారి పైసా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం నుంచి ఏయే నిధులు వస్తాయంటే.. యూనివర్సిటీలకు రాష్ట్రం ఇచ్చే నిధులు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పెన్షన్లకే సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే నిధులే వర్సిటీల అభివృద్ధికి ప్రధానాధారం. ఒక్కో యూనివర్సిటీకి వివిధ పరిశోధనలు, ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిధులిస్తాయి. ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా వివిధ ప్రాజెక్టుల కింద నిధులు వస్తాయి. రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉంటేనే పరిశోధనల కింద నిధులు వస్తాయి. యూజీసీ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కీం, సెంట్రల్ అసిస్టెంట్ ప్రోగ్రాంలతోపాటు టెక్విప్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, సీఎస్ఐఆర్ పరిధిలోని వివిధ ప్రాజెక్టుల కింద రూ.50 లక్షల నుంచి రూ.15 కోట్ల వరకు నిధులు వస్తాయి. అయితే ఇవన్నీ కనీస బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌లు ఉంటేనే దక్కుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో అధ్యాపకుల్లేక ఇవేవీ రావడం లేదు. ఒక్కో విభాగంలో 6 నుంచి 18 మంది వరకు ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఆ మేరకు ఏ యూనిర్సిటీలో కూడా లేరు. ఇంజనీరింగ్ విభాగంలో అయితే 16 మంది వరకు ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలోనే అంత సంఖ్యలో ఫ్యాకల్టీ లేరు. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన చాలా నిధులకు గండిపడుతోంది. న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉంటే... న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీలకు యూజీసీ.. యూనివర్సిటీ విత్ పొటెన్షల్ ఫర్ ఎక్సలెన్స్ కింద రూ.50 కోట్ల వరకు ఇస్తుంది. ఇలా 2012లో ఉస్మానియాకు రూ.50 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం న్యాక్ అక్రెడిటేషన్ లేనందునా ఆ నిధులకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది న్యాక్ గుర్తింపు ఉంటేనే రూసా రూ.20 కోట్లు ఇచ్చింది. కనీస సదుపాయాలు, సిబ్బంది లేకపోవడం వల్ల ఈసారి అవీ కూడా వచ్చే పరిస్థితి లేదు. 12వ పంచవర్ష ప్రణాళికలో అభివృద్ధి నిధుల కింద గతంలో రూ.12 కోట్లు వచ్చాయి. ఇకపై అవీ వచ్చేలా లేవు. ఖాళీలే.. ఖాళీలు! ఉస్మానియా వర్సిటీలో డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో మంజూరైన ప్రొఫెసర్ పోస్టులు 152. వాటిలో ఇప్పుడున్నది ఇద్దరే! కాకతీయ వర్సిటీలోనూ డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో మంజూరైన ప్రొఫెసర్ పోస్టులు 54 కాగా.. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. మహత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల్లోనూ ఒక్కరు చొప్పునే ప్రొఫెసర్లు ఉన్నారు. మహత్మాగాంధీ, పాలమూరు, బాసర ట్రిపుల్ ఐటీల్లో అయితే డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో మంజూరైన పోస్టులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. జేఎన్టీయూహెచ్లో ప్రొఫెసర్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం వర్సిటీల్లో పదోన్నతులపై వచ్చిన కొద్ది మందీ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. కాకతీయ వర్సిటీలో అయితే సగం సిబ్బంది కూడా లేదు. దీంతో రూ.16 కోట్ల టెక్విప్ నిధులు రాలేని పరిస్థితి నెలకొంది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 60 మంది వరకు సిబ్బంది అవసరం ఉన్నా 25 మందే ఉన్నారు. మహత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో మూడు బ్రాంచీలతో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అక్కడ 40 మంది వరకు సిబ్బంది అవసరం ఉన్నా రెగ్యులర్ సిబ్బంది ఒక్కరూ లేకపోవడం గమనార్హం. యూనివర్సిటీల వారీగా డెరైక్టు రిక్రూట్‌మెంట్‌లోని ఖాళీల వివరాలివీ.. ఆశలు అడియాశలవుతున్నాయి - సీఎం కేసీఆర్‌కు ఓయూ అధ్యాపకుల బహిరంగ లేఖ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉస్మానియా యూనివర్సిటీకి మంచి రోజులొస్తాయనే ఆశలు అడియాశలు అయ్యాయని ఓయూ అధ్యాపకులు, ఉద్యోగులు వాపోయారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా), బోధనేతర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఓయూ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ మనోహార్ మాట్లాడుతూ... గత రెండేళ్లుగా ఓయూకు పూర్తిస్థాయి వీసీ లేనందున పరిస్థితులు దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ లేనందున యూజీసీ నుంచి వచ్చే రూ.3 కోట్ల అభివృద్ధి నిధులు వెనక్కు వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నియామకాలు చేపట్టకుంటే 2018 నాటికి ఓయూలోని అనేక విభాగాలు మూతపడతాయన్నారు. ఓయూకు వీసీని, పాలక మండలి సభ్యులను నియమించాలని, ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పొడిగించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.