‘స్వచ్ఛ’ సైన్యం!
Published Tue, Aug 15 2017 2:57 AM | Last Updated on Tue, Sep 12 2017 12:04 AM
- మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతానికి సర్కారు నిర్ణయం
- పదివేల మంది తాపీ మేస్త్రీలకు న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారతమిషన్‌లో భాగంగా రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తం గా గుర్తించిన పదివేల మంది తాపీ మేస్త్రీలతో ‘స్వచ్ఛ’సైన్యాన్ని ఏర్పాటు చేస్తోంది. మరుగుదొడ్డి కోసం గది నిర్మాణంతోపాటు కమోడ్, పైప్‌లైన్ల అనుసం ధానం, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు వరకు అన్నీ ఒక్కరే పూర్తి చేసేలా ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)’ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.
కేంద్ర నిధులతో..: బహిరంగ మల విసర్జనను అరికట్టేందుకు, ఇంటింటా మరు గుదొడ్డి ఉండేలా కేంద్రం స్వచ్ఛభారత్ మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర నిధులతో మన రాష్ట్రంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో సుమారు 10 లక్షల మరుగుదొడ్లు నిర్మించి నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మరో 1.58 లక్షల మరుగు దొడ్లు నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మరుగుదొడ్ల నిర్మా ణం ఆశించిన స్థాయిలో లేదు. లక్ష్యంలో కేవలం 40 శాతమే సాధించారు. మరో 9 జిల్లాల్లో 70 శాతం వరకు పూర్తి చేయగా.. మిగతా జిల్లాల్లో 70 శాతానికి పైబడి పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ‘స్వచ్ఛ’సైన్యంతో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం కానుంది.
మూడు పనులు ఒక్కరే..: మరుగుదొడ్డి ఏర్పాటుకు కావాల్సిన గది నిర్మాణాన్ని మేస్త్రీ చేపట్టాలి, అందులో కమోడ్, పైపులు తదితర పనులు ప్లంబర్ చేస్తే... విద్యుత్ బల్బు, వైరింగ్ పని ఎలక్ట్రీషియన్‌ది. ఈ మూడు పనులకు ముగ్గురిని పిలిపించటం సమస్యగా మారింది. ఆర్థిక భారమనో, వేళకు వారు రాకపోవడమో.. ఇలా పలు కార ణాలతో ఆ పనులు సరిగా జరగటం లేదు. దీంతో తాపీ మేస్త్రీ ఒక్కరే ఈ మూడు పను లు చేస్తే సమస్య ఉండదని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ పనుల్లో మేస్త్రీలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం ఈ శిక్షణ బాధ్యతను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)కు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 10 వేల మంది తాపీ మేస్త్రీలకు ఈ శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
వారం పాటు శిక్షణ: ప్రతి జిల్లా కేంద్రంలో ఆ జిల్లాలోని మేస్త్రీలకు న్యాక్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు శిక్షణ ఉంటుంది. తర్వాత వారికి పనులు పురమాయిస్తారు. మొత్తంగా ఈ పది వేల మంది రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తారు.
Advertisement
Advertisement