పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియ మళ్లీ మొదటికి..
⇒ ఫలితాల జాబితాలో అక్రమాలంటూ విద్యార్థుల ఆందోళన
⇒ దీంతో విచారణకు ఆదేశించిన యూనివర్సిటీ
⇒ దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ
⇒ నివేదిక తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2013–14 సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియ జటిలమవుతోంది. దాదాపు నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న అడ్మిషన్ల అంశంపై కసరత్తు పూర్తిచేసిన విశ్వవిద్యాలయ యాజమాన్యం ఫిబ్రవరి 27న ఫలితాలు ప్రకటించింది. ఇన్నాళ్లూ వీసీ లేని కారణంగా జాప్యం జరిగిందని సర్దిచెబుతూ ప్రవేశాల ప్రక్రియను వేగిరం చేసిన అధికారులకు తాజాగా తలనొప్పి వచ్చిపడింది. పీహెచ్‌డీకి ఎంపికైన అభ్యర్థుల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, జాబితాలో అనర్హులకు అవకాశం కల్పించారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏకంగా యూనివర్సిటీ బంద్‌కు సైతం దిగడంతో ప్రవేశాల ప్రక్రియపై వెనక్కు తగ్గింది. మరోవైపు చాలాకాలం తర్వాత పీహెచ్‌డీ ఫలితాలు రావడంతో అందులో సీటు దక్కించుకున్న విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియకు బ్రేక్ పడటం తీవ్ర నిరాశకు గురిచేసింది.
పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి గత వారం రోజులుగా ఓయూలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రవేశాల ప్రక్రియను అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా జరపాలని వీసీపై ఒత్తిడి తీసుకురావడంతో దూరవిద్యా కేంద్రం సంచాలకుల అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు అధికారులను సభ్యులుగా చేర్చుతూ విద్యార్థుల ఆరోపణలపై విచారణ నిర్వహించాలని సూచించారు. ఇదిలావుండగా, గతేడాది తప్పుడు సమాచారాన్ని సమర్పించి దాదాపు 60 మంది విద్యార్థులు రాజీవ్‌గాంధీ జాతీయ ఉపకారవేతనం (ఆర్‌జీఎన్‌ఎఫ్) పొందారు. దీనిపై పూర్తిస్థాయి ఆధారాలను యూనివర్సిటీకి సమర్పించినప్పటికీ అధికారులు మాత్రం మిన్నకుండిపోయారు. తాజాగా పీహెచ్‌డీ ఫలితాల్లో ఈ విద్యార్థులు సైతం ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించి ఆర్‌జీఎన్‌ఎఫ్ ద్వారా లబ్ధి పొందుతున్న తీరుపై విద్యార్థులు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నాలుగేళ్లుగా కొత్త పరిశోధనల్లేవ్..!
విశ్వవిద్యాలయమంటే పరిశోధనలకు మారుపేరుగా నిర్వహిస్తారు. సకల సదుపాయాలు ఉండటంతో విద్యార్థులు సైతం యూనివర్సిటీలవైపు ప్రత్యేక శ్రద్ద చూపుతారు. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత నాలుగేళ్లుగా కొత్త పరిశోధనలకు అవకాశం లేకుండా పోయింది. 2013–14 సంవత్సర పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియకు వరుసగా అవాంతరాలు ఎదురు కావడంతో ఆ తర్వాతి సంవత్సరం నుంచి పీహెచ్‌డీ ప్రవేశాలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కొత్త పరిశోధనలు కొనసాగడం లేదు. నాక్(నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) గుర్తింపులో ఉపాధ్యాయులు, మౌలికవసతులు, పరిశోధనలు కీలకం. కొత్త పరిశోధనలు జరగకపోవడం, సరైన సంఖ్యలో ఉపాధ్యాయులు లేకపోవడంతో నాక్ గుర్తింపు లభించకపోవడంతో వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం పరపతి మసక బారినట్లు అవుతోంది.