రేపటి నుంచి ఓయూలో ‘న్యాక్‌’ పర్యటన | NAK tour from tomorrow in OU | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఓయూలో ‘న్యాక్‌’ పర్యటన

Published Wed, Aug 16 2017 1:02 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

రేపటి నుంచి ఓయూలో ‘న్యాక్‌’ పర్యటన

రేపటి నుంచి ఓయూలో ‘న్యాక్‌’ పర్యటన

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ అసెస్‌మెంట్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపు కోసం ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 2013లో ముగిసిన గుర్తింపును ఇప్పుడు మళ్లీ తెచ్చుకునేందుకు గత 10 నెలలుగా కృషి చేస్తున్నారు. న్యాక్‌ అధికారుల బృందం ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమై యూని వర్సిటీని ముస్తాబు చేశారు. యూనివర్సిటీలో ఎక్కడా వాల్‌ పోస్టర్లు  అతికించొద్దని విద్యార్థి సంఘాలకు కూడా ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం, ఇంటర్నల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ సెల్‌ (ఐక్యూఏసీ) డైరెక్టర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ విజ్ఞప్తులు చేశారు. న్యాక్‌ బృందం పర్యటనను పరిగణనలోకి తీసుకుని మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
 
సరిపడా మౌలిక సదుపాయాలు..
ఓయూలో విద్యార్థులకు తగిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వీటిపై అప్పటినుంచే ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓయూలో మౌలిక సదుపాయాలు న్యాక్‌ గుర్తింపు వచ్చేందుకు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. విశాలమైన ప్రాంగణం, క్రీడా మైదానాలు, స్విమ్మింగ్‌పూల్, ఇండోర్‌ స్టేడియం, కళాశాలలకు, హాస్టల్స్‌కు పక్కా భవనాలు, పరిశోధన కేంద్రాలు, ప్రత్యేక లైబ్రరీ, లక్షలాది పుస్తకాలు, రోడ్లు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, రంగాపూర్‌లో పరిశోధన కేంద్రం, క్యాంపస్‌లో సీపీఎంబీ, బేగంపేటలో జెనటిక్స్‌ పరిశోధన కేంద్రాలు ఉన్నాయి.
 
వీలైనంత మేరకు సదుపాయాల కల్పన..
న్యాక్‌ గుర్తింపునకు కావాల్సిన అన్ని వివరాలను ఓయూ అధికారులు సేకరించారు. ఒక్క రెగ్యులర్‌ అధ్యాపకుల నియామకం మినహా మిగతా సదుపాయాలను దాదాపు కల్పించినట్లు చెబుతున్నారు. వర్సిటీకి గుర్తింపు తెచ్చే పరిశోధనలు, ప్రాజెక్టులు కావలసినన్ని ఉన్నాయని ఐక్యూఏసీ డైరెక్టర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ తెలిపారు. వందల సంఖ్యలో అనుబంధ కళాశాలలతో 3.2 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని తెలిపారు.

ఓయూలో 5,225 పరిశోధన పత్రాలు, 11 పేటెంట్‌ రీసెర్చ్‌లు ఉండగా మరో 9 పరిశోధనలు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని, రూ.129 కోట్లతో 232 ప్రాజెక్టులు ఉండగా రూ.29 కోట్లతో 165 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వివరించారు. జాతీయ, అంతర్జాతీయంగా 59 ఒప్పందాలు, అధ్యాపకులకు 225 అవార్డులు, బిరుదులు, 118 మంది పీడీఎఫ్‌ (పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో) పరిశోధన విద్యార్థులు, 3,127 పీహెచ్‌డీ విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. క్యాంపస్‌లోని 24 హాస్టళ్లలో 9 వేల మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
న్యాక్‌తో విద్యార్థులకు మేలు..
న్యాక్‌ గుర్తింపుతో యూనివర్సిటీ ప్రతిష్ట పెరగడంతో పాటు విద్యార్థులకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. న్యాక్‌ గుర్తింపు వస్తే భారీ మొత్తంలో యూజీసీ నుంచి నిధులు రాబట్టుకోవచ్చు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశముంది. పరిశోధన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఫెలోషిప్‌లు పెరుగుతాయి. డిగ్రీ పట్టాలపై న్యాక్‌ గుర్తింపు ఉన్నట్లు ఐదేళ్ల పాటు ముద్రిస్తారు. దీంతో ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఓయూ సర్టిఫికెట్లకు ప్రత్యేక విలువ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement