ఉస్మానియా ‘న్యాక్’ ఔట్! | central funds to less for kakatiya and OU | Sakshi
Sakshi News home page

ఉస్మానియా ‘న్యాక్’ ఔట్!

Published Wed, Apr 13 2016 2:46 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ఉస్మానియా ‘న్యాక్’ ఔట్! - Sakshi

ఉస్మానియా ‘న్యాక్’ ఔట్!

 ప్రకటించిన రెండు జాబితాల్లోనూ ఓయూకు దక్కని చోటు
 అదే దారిలో కాకతీయ, జేఎన్‌టీయూ, ఇతర వర్సిటీలు
 కేంద్రం ఇచ్చే నిధులకు గండి!
 నిధులు, నియామకాల్లేక అల్లాడుతున్న యూనివర్సిటీలు
 ఓయూలో ఇద్దరు.. కేయూలో ఒక్కరే ప్రొఫెసర్
 డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా పోస్టులన్నీ ఖాళీ!

 
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. అటు నిధుల్లేక, ఇటు నియామకాల్లేక విలవిల్లాడుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ సైతం న్యాక్ గుర్తింపునకు నోచుకోలేని దుస్థితి తలెత్తింది. కాకతీయ, జేఎన్‌టీయూ వంటి ప్రధాన వర్సిటీలూ అదే దారిలో ఉన్నాయి. ఫలితంగా వీటికి కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత జనవరిలో ప్రకటించిన మొదటి జాబితాలో ఒక్క నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీ మినహా రాష్ట్రంలో మరే విశ్వవిద్యాలయానికి కూడా న్యాక్ గుర్తింపు దక్కలేదు. గతనెల 29న ప్రకటించిన న్యాక్ గుర్తింపు రెండో జాబితాలోనూ ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూలకు చోటు లభించలేదు.

ఈ జాబితాలో రాష్ట్రంలోని రెండు ప్రైవేటు కాలేజీలు, నిజామాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి మాత్రమే న్యాక్ గుర్తింపు దక్కింది. ఈ నెల 4న కేంద్రం ప్రకటించిన టాప్-100 ప్రతిష్టాత్మక విద్యాసంస్థల జాబితాలోనూ ఈ వర్సిటీలకు చోటు దక్కలేదు. వీసీలు, తగిన సంఖ్యలో బోధన సిబ్బంది లేకపోవడంతో వర్సిటీల  ఈ దయనీయ పరిస్థితిలో పడ్డాయి.

ముందే చెప్పినా అదే నిర్లక్ష్యం
న్యాక్ అక్రెడిటేషన్ ఉంటేనే నిధులిస్తామని ఏడాది కిందటే రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) స్పష్టంచేసింది. అయినా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మేల్కొనలేదు. ఫలితంగా గతేడాది రూ.20 కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగిన ఉస్మానియాకు ఈసారి పైసా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

కేంద్రం నుంచి ఏయే నిధులు వస్తాయంటే..
యూనివర్సిటీలకు రాష్ట్రం ఇచ్చే నిధులు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పెన్షన్‌లకే సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే నిధులే వర్సిటీల అభివృద్ధికి ప్రధానాధారం. ఒక్కో యూనివర్సిటీకి వివిధ పరిశోధనలు, ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిధులిస్తాయి. ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా వివిధ ప్రాజెక్టుల కింద  నిధులు వస్తాయి. రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉంటేనే పరిశోధనల కింద నిధులు వస్తాయి. యూజీసీ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ స్కీం, సెంట్రల్ అసిస్టెంట్ ప్రోగ్రాంలతోపాటు టెక్విప్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, సీఎస్‌ఐఆర్ పరిధిలోని వివిధ ప్రాజెక్టుల కింద రూ.50 లక్షల నుంచి రూ.15 కోట్ల వరకు నిధులు వస్తాయి. అయితే ఇవన్నీ కనీస బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌లు ఉంటేనే దక్కుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో అధ్యాపకుల్లేక ఇవేవీ రావడం లేదు. ఒక్కో విభాగంలో 6 నుంచి 18 మంది వరకు ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఆ మేరకు ఏ యూనిర్సిటీలో కూడా లేరు. ఇంజనీరింగ్ విభాగంలో అయితే 16 మంది వరకు ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలోనే అంత సంఖ్యలో ఫ్యాకల్టీ లేరు. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన చాలా నిధులకు గండిపడుతోంది.

న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉంటే...
 న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీలకు యూజీసీ.. యూనివర్సిటీ విత్ పొటెన్షల్ ఫర్ ఎక్సలెన్స్ కింద రూ.50 కోట్ల వరకు ఇస్తుంది. ఇలా 2012లో ఉస్మానియాకు రూ.50 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం న్యాక్ అక్రెడిటేషన్ లేనందునా ఆ నిధులకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది న్యాక్ గుర్తింపు ఉంటేనే రూసా రూ.20 కోట్లు ఇచ్చింది. కనీస సదుపాయాలు, సిబ్బంది లేకపోవడం వల్ల ఈసారి అవీ కూడా వచ్చే పరిస్థితి లేదు. 12వ పంచవర్ష ప్రణాళికలో అభివృద్ధి నిధుల కింద గతంలో రూ.12 కోట్లు వచ్చాయి. ఇకపై అవీ వచ్చేలా లేవు.
 

ఖాళీలే.. ఖాళీలు!
ఉస్మానియా వర్సిటీలో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో మంజూరైన ప్రొఫెసర్ పోస్టులు 152. వాటిలో ఇప్పుడున్నది ఇద్దరే! కాకతీయ వర్సిటీలోనూ డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో మంజూరైన ప్రొఫెసర్ పోస్టులు 54 కాగా.. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. మహత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల్లోనూ ఒక్కరు చొప్పునే ప్రొఫెసర్లు ఉన్నారు. మహత్మాగాంధీ, పాలమూరు, బాసర ట్రిపుల్ ఐటీల్లో అయితే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో మంజూరైన పోస్టులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. జేఎన్‌టీయూహెచ్‌లో ప్రొఫెసర్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది.

ప్రస్తుతం వర్సిటీల్లో పదోన్నతులపై వచ్చిన కొద్ది మందీ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. కాకతీయ వర్సిటీలో అయితే సగం సిబ్బంది కూడా లేదు. దీంతో రూ.16 కోట్ల టెక్విప్ నిధులు రాలేని పరిస్థితి నెలకొంది. జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 60 మంది వరకు సిబ్బంది అవసరం ఉన్నా 25 మందే ఉన్నారు. మహత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో మూడు బ్రాంచీలతో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అక్కడ 40 మంది వరకు సిబ్బంది అవసరం ఉన్నా రెగ్యులర్ సిబ్బంది ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
 యూనివర్సిటీల వారీగా డెరైక్టు రిక్రూట్‌మెంట్‌లోని ఖాళీల వివరాలివీ..

 

ఆశలు అడియాశలవుతున్నాయి
- సీఎం కేసీఆర్‌కు ఓయూ అధ్యాపకుల బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉస్మానియా యూనివర్సిటీకి మంచి రోజులొస్తాయనే ఆశలు అడియాశలు అయ్యాయని ఓయూ అధ్యాపకులు, ఉద్యోగులు వాపోయారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా), బోధనేతర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఓయూ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ మనోహార్ మాట్లాడుతూ... గత రెండేళ్లుగా ఓయూకు పూర్తిస్థాయి వీసీ లేనందున పరిస్థితులు దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ లేనందున యూజీసీ నుంచి వచ్చే రూ.3 కోట్ల అభివృద్ధి నిధులు వెనక్కు వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నియామకాలు చేపట్టకుంటే 2018 నాటికి ఓయూలోని అనేక విభాగాలు మూతపడతాయన్నారు. ఓయూకు వీసీని, పాలక మండలి సభ్యులను నియమించాలని, ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పొడిగించాలని, ఖాళీగా ఉన్న  పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement