విదేశీయులకూ గమ్యస్థానం!
చింతకింది గణేశ్
వందేళ్లు.. కోటి మందికిపైగా విద్యార్థులు.. అందులో ఎందరో ప్రముఖులు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఉస్మానియాలో చదువుకుంటున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చి విద్యను అభ్యసిస్తున్న వారిలో ఉస్మానియాలో చేరుతున్నవారే ఎక్కువ. దాదాపు 87 దేశాలకు చెందిన వారు ఉస్మానియాలో చదువుతున్నారు. ప్రస్తుతం 3,897 మంది విదేశీ విద్యార్థులున్నారు. ఇటీవల దేశంలో అత్యధికంగా విదేశీ విద్యార్థులు పుణె విశ్వవిద్యాలయంలో చదువుకుంటుండగా.. రెండో స్థానంలో ఉస్మానియా నిలిచింది.
అంచలంచెలుగా విశ్వవ్యాప్తం
ఉస్మానియాకు విశ్వవ్యాప్త గుర్తింపు రావడానికి అప్పట్లో పనిచేసిన వైస్ చాన్సలర్ల కృషి ఎంతో ఉంది. 2000వ సంవత్సరానికి ముందు ఇక్కడ చదివే విదేశీ విద్యార్థుల సంఖ్య పదుల్లోనే ఉండేది. దీనిని గ్రహించిన అప్పటి వీసీ డీసీ రెడ్డి.. యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్ ఆఫీస్ (యూఎఫ్‌ఆర్‌వో)ను ప్రారంభించారు. ఓయూలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు సింగిల్ విండో విధానంలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. దీంతో క్రమంగా విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగి.. 2016–17కు వచ్చే సరికి 3,897కి చేరింది.
ఓయూ ప్రత్యేకతలివీ..
► దేశంలో ఏడో పురాతన విశ్వవిద్యాలయంగా, దక్షిణ భారతదేశంలో మూడోదిగా ఉస్మానియా చరిత్రలో నిలిచింది.
► 1917లో ఆవిర్భవించిన ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటివరకు 24 మంది వైస్ చాన్సలర్లు బాధ్యతలు నిర్వర్తించారు.
► ఉస్మానియా యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లో ఏటా 3.17 లక్షల మంది ఉన్నత విద్య చదువుతున్నారు. కొన్నేళ్ల కింద ఈ సంఖ్య 5 లక్షలుగా ఉండేది. వివిధ కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేయడంతో అనుబంధ కళాశాలలు, విద్యార్థుల సంఖ్య తగ్గింది.
► గ్రామీణ, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ధ్యేయంతో ఉస్మానియానే మొదటిసారిగా వరంగల్‌లో తర్వాత కొన్నేళ్లకు మహబూబ్‌నగర్, నల్లగొండల్లో ప్రాం తీయ కేంద్రాలను ప్రారంభించింది. తర్వాత వాటినే విశ్వ విద్యాలయాలుగా మార్చారు.