మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా?
ఐదో దశ లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పోలింగ్ జరిగే 51 నియోజకవర్గాల్లో బీజేపీ 2014 ఎన్నికల్లో 39 స్థానాలను కైవసం చేసుకుంది. అత్యధిక సీట్లలో కాషాయపక్షం మళ్లీ విజయం సాధిస్తేనే కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్ బలం లోక్‌సభలో వంద దాటాలంటే ఐదో దశలోని మెజారిటీ సీట్లను గెలుచుకోక తప్పదు. రెండు ప్రధాన జాతీయ పక్షాలకూ ఈ దశ కీలకంగా మారింది.
పదిహేడో లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరుగుతుంది. ఏడు రాష్ట్రాల్లోని 51 సీట్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం 543 సీట్లలో 373 స్థానాలకు మొదటి నాలుగు దశల్లో పోలింగ్ జరిగింది. పార్లమెంటు సీట్ల సంఖ్య రీత్యా దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్(14), రాజస్తాన్(12), పశ్చిమ బెంగాల్(7), మధ్యప్రదేశ్(7), బిహార్(5), జార్ఖండ్(4), జమ్మూకశ్మీర్(2)లోని 51 లోక్‌సభ నియోజకవర్గాలకు ఐదో దశలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి నాలుగు దశల్లో హింసాత్మక ఘటనలు జరిగిన పశ్చిమ బెంగాల్లో ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నూరు శాతం కేంద్ర పారామిలిటరీ దళాలనే వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ 11, 18, 23, 29న జరిగిన మొదటి నాలుగు దశల ఎన్నికల్లో 69 శాతం సీట్లకు 67 శాతం పోలింగ్ జరిగింది. ఈ నెల 6, 12, 19న జరిగే చివరి దశల్లో మిగిలిన 170 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మండు వేసవి మే నెలలో జరిగే చివరి మూడు దశల పోలింగ్ తర్వాత 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
బిహార్‌లో నువ్వా నేనా...
బిహార్‌లోని మొత్తం 40 స్థానాల్లో ఐదో దశలో ఐదు నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ‘సొంత’ నియోజకవర్గం సారణ్‌లో ఆయన వియ్యంకుడు, మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ కుమారుడు చంద్రికారాయ్ ఆర్జేడీ టికెట్‌పై తొలిసారి లోక్‌సభకు పోటీచేస్తున్నారు. ఆయనపై బీజేపీ తరఫున మాజీ కేంద్ర మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ మరోసారి రంగంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో లాలూ భార్య, మాజీ సీఎం రాబ్రీదేవిని రూడీ 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈ ఎన్నికల్లో బిహార్ పాలక సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న జేడీయూ కూడా ఎన్డీఏ భాగస్వామి కావడంతో రూడీ గెలుపు ఖాయమని బీజేపీ భావిస్తోంది. లాలూ పెద్ద కొడుకు మామ పోటీలో ఉండడంతో ఆర్జేడీ ఈ స్థానంలో గెలుపునకు గట్టి ప్రయత్నం చేస్తోంది.
సీతామఢీలో రాష్ట్ర మంత్రి, బీజేపీ మాజీ నేత సునీల్‌కుమార్ పింటూ(జేడీయూ) ఎన్డీఏ కూటమి తరఫున పోటీలో ఉన్నారు. ఆయనపై ఆర్జేడీ కూటమి తరఫున అర్జున్‌రాయ్ పోటీచేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో అప్పటి ఎన్డీఏ భాగస్వామి పార్టీ ఆరెలెస్పీ నేత రాంకుమార్ శర్మ కుష్వాహా తన సమీప ఆర్జేడీ ప్రత్యర్థి సీతారాంయాదవ్పై లక్షా 47 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మధుబనిలో కిందటిసారి గెలిచిన హుకుందేవ్ నారాయణ్ యాదవ్(బీజేపీ) కొడుకు అశోక్‌కుమార్ యాదవ్ ఈసారి బీజేపీ కూటమి తరఫున పోటీలో ఉన్నారు. ఆర్జేడీ కూటమిలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అభ్యర్థి బద్రీకుమార్ పూర్బే బరిలోకి దిగారు. 2014లో ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థిని బీజేపీ టికెట్‌పై పోటీచేసిన హుకుందేవ్ 20 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు.
ఈసారి బీజేపీ అభ్యర్థి అశోక్ యాదవ్ తొలిసారి మధుబని నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నా తండ్రికి ఉన్న పలుకుబడి, ఎన్డీఏ బలంపై ఆధారపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ షకీల్ అహ్మద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయన యూపీఏ ఓట్లను చీల్చుకుంటే వీఐపీ అభ్యర్థి గెలుపు కష్టమే. మరో కీలక స్థానమైన ముజఫర్‌పూర్‌లో బీజేపీ తరఫున సిట్టింగ్ సభ్యుడు అజయ్ నిషాద్ మరోసారి పోటీకి దిగారు. ఆయన కిందటి ఎన్నికల్లో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి అఖిలేశ్ ప్రసాద్సింగ్ను రెండు లక్షల 22 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. అజయ్ నిషాద్ తండ్రి ఇక్కడ నుంచి గతంలో అనేకసార్లు గెలిచిన కేంద్ర మాజీ మంత్రి జైనారాయణ్ ప్రసాద్ నిషాద్. ఆర్జేడీ నాయకత్వంలోని మహాగuŠ‡బంధన్ తరఫున వీఐపీ పార్టీకి చెందిన రాజ్‌భూషణ్ చౌధరీ పోటీచేస్తున్నారు. ముజఫ్ఫర్‌పూర్ నుంచి అజయ్ నిషాద్ తండ్రి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. హాజీపూర్‌లో ఎల్జేపీ నేత పాస్వాన్ తమ్ముడు పశుపతి కుమార్ పారస్(ఎల్జేపీ) పోటీచేస్తుండగా, ఆయనపై ఆర్జేడీ అభ్యర్థి శివచరణ్ రామ్ పోటీకి దిగారు.
ఝార్ఖండ్ కమలానికి కీలకం
ఝార్ఖండ్‌లోని 14 సీట్లలో నాలుగు సీట్లకు ఐదో దశలో పోలింగ్ జరుగుతుంది. కోడర్మా, రాంచీ, హజారీబాగ్, ఖూంటీ(ఎస్టీ) స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్–జేఎంఎం కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. రాజధాని రాంచీ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుబోధ్‌కాంత్ సహాయ్(కాంగ్రెస్) మరోసారి బరిలోకి దిగారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు రామ్‌తహల్ చౌధరీకి ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్వతంత్ర అభ్యర్తిగా పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున కొత్త అభ్యర్థి సంజయ్ సేuŠ‡ రంగంలోకి దిగారు. బీజేపీ ఓట్ల చీలికతో తనకు విజయావకాశాలున్నాయని కాంగ్రెస్ నేత సహాయ్ భావిస్తున్నారు. మరో ముఖ్య స్థానం హజారీబాగ్‌లో కేంద్ర మంత్రి జయంత్ సిన్హా రెండోసారి బీజేపీ తరఫున పోటీకి దిగారు.
జయంత్ సిన్హా
ఆయన 2014లో తొలిసారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించారు. కాంగ్రెస్ తరఫున కొత్త అభ్యర్థి గోపాల్ సాహూ పోటీకి దిగారు. 2009లో జయంత్ తండ్రి యశ్వంత్ సిన్హా(బీజేపీ) ఇక్కడ నుంచి గెలిచారు. మరో జనరల్ స్థానం కోడర్మాలో బీజేపీ కొత్త అభ్యర్థి అన్నపూర్ణాదేవి యాదవ్‌ను పోటీకి నిలిపింది. 2014లో ఇక్కడ నుంచి బీజేపీ టికెట్‌పై రవీంద్రకుమార్ రాయ్ సమీప సీపీఐ(ఎంఎల్) అభ్యర్థి రాజ్‌కుమార్ యాదవ్‌ను 95కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. మళ్లీ రాజ్‌కుమార్ పోటీకి దిగారు. కాంగ్రెస్ కూటమి తరఫున మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ(జేవీఎం–పీ) పోటీచేస్తున్నారు. ఝార్ఖండ్ తొలి ముఖ్యమంత్రిగా బీజేపీ తరఫున పనిచేసిన మరాండీకి ఈసారి గెలుపు కీలకంగా మారింది.
పశ్చిమ బెంగాల్
పశ్చిమబెంగాల్లో దీదీ వర్సెస్ మోదీగా సాగుతున్న ఎన్నికల్లో అయిదో దశలో ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. హుగ్లీ నది చుట్టూ కొన్ని నియోజకవర్గాలు, బెంగాల్ సరిహద్దుల్లో మరికొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ ఈ సారి రెండు స్థానాలు బీజేపీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మూడింట్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో హుగ్లీ పరిధిలో సింగూరు ఉండడంతో పోటీపై ఆసక్తి నెలకొంది. టాటా నానో కార్లకు సంబంధించిన భూ కేటాయింపులపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత దీదీ చేసిన పోరాటం జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపింది. ఆ ఆందోళనలే ఆమెను తర్వాత కాలంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాయి. హుగ్లీ ఇప్పటికీ సీపీఎంకు పట్టున్న ప్రాంతం. సీపీఎం అభ్యర్థి రత్నదే నాగ్ హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి ప్రదీప్ సాహాను ఆమె ఓడించారు. ఈ సారి కూడా సీపీఎం ప్రదీప్‌నే బరిలో దింపింది.
లాకెట్ ఛటర్జీ
ఇక బీజేపీ తరపున మాజీ నటి లాకెట్ ఛటర్జీ గట్టి పోటీయే ఇస్తున్నారు. హౌరాలో పోటీ కూడా ఈసారి ఉత్కంఠనే రేపుతోంది. ఒకప్పుడు పరిశ్రమలకు పెట్టింది పేరు. ఇప్పుడు అవేవీ కనిపించడం లేదు. యూపీ బిహార్ నుంచి వలస వచ్చిన ప్రజలకే ఎక్కువ. బీజేపీ నుంచి జర్నలిస్టు రంతిదేవ్ సేన్ గుప్తా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ, ఫుట్‌బాల్ ప్లేయర్ ప్రసూన్ సేన్ గుప్తా పోటీపడుతున్నారు. 90 శాతం పట్టణ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం 1998లో తొలిసారిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి పట్టు బిగిస్తోంది. హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువ మంది ఉండడంతో బీజేపీ గట్టి సవాల్నే విసురుతోంది. ఇక బన్గావ్, బ్యారక్‌పూర్ నియోజకవర్గాల్లో సమీకరణలు ఈసారి బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి.
రాజస్థాన్‌లో మారిన బీజేపీ పరిస్థితి
రాజస్థాన్‌లో జరిగే మొత్తం 12 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. పింక్ సిటీ జైపూర్‌లో అర్ధశతాబ్దం తర్వాత ఒక మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వడం, బికనీర్, జైపూర్ (రూరల్)లో కేంద్ర మంత్రులు పోటీకి దిగడం, మూకదాడులతో వార్తల్లోకెక్కిన అల్వార్ ఈ దశలో ఉండడంతో ఎడారి రాజ్యంలో పోరు ఉత్కంఠను రేపుతోంది. జైపూర్ రూరల్ నుంచి కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌పై కాంగ్రెస్ మరో ఒలింపియన్ కృష్ణ పూనియాను రంగంలోకి దించడంతో హోరాహోరీ పోరు నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ అన్ని సీట్లలో విజయకేతనం ఎగురవేసినా ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. సికార్‌లో సిట్టింగ్ ఎంపీ, ఆధ్యాత్మిక గురువు స్వామి సుమేధానంద్ సరస్వతికి బీజేపీ మళ్లీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీని సుభాష్ మహారియాను బరిలోకి దింపింది. ఈ సారి సీపీఎం కూడా మాజీ ఎమ్మెల్యే ఆమ్రారామ్ను పోటీకి దింపడంతో కాంగ్రెస్ కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది.
చురు బీజేపీకి గట్టి పట్టున్న నియోజకవర్గమే. జాట్ సామాజిక వర్గానికి చెందిన మాజీ నేత రామ్‌సింగ్ కాశ్వాన్ కుమారుడు రాహుల్ కాశ్వాన్ బీఎస్పీ అభ్యర్థి అభినేష్ మహర్షిని ఓడించారు. బీజేపీ ఈసారి కూడా రాహుల్‌నే బరిలోకి దింపుతోంది. ఇక కాంగ్రెస్ తరఫున ఆర్. మండేలియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నియోజకవర్గంలో 3.50 లక్షలకు పైగా జాట్లు ఉన్నారు. 1984లో తప్ప ప్రతీసారి ఈ నియోజకవర్గం నుంచి జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గెలుస్తున్నారు. ఝున్ఝునూ కాంగ్రెస్ దివంగత నాయకుడు సిస్ రామ్ ఓలాకు బాగా పట్టున్న ప్రాంతం. 1999 నుంచి 2013 వరకు ఆయనే ఎంపీగా ఉన్నారు. 2013లో ఆయన మృతితో ఝున్ఝునూ ఖాళీ అయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాజ్ బాల ఓలాను బీజేపీ నాయకురాలు సంతోష్ అహ్లావత్ ఓడించారు. కానీ బీజేపీ ఈ సారి రాజస్తాన్‌లో ఏకైక మహిళా ఎంపీకి టికెట్ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాంద్వా నరేంద్ర కుమార్ ఖించాల్ను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రవణ్‌కుమార్ పోటీ పడుతున్నారు.
జమ్మూకశ్మీర్
అనంత్‌నాగ్‌లో 3 దశల పోలింగ్ పూర్తవుతుంది!
జమ్మూకశ్మీర్‌లో లోయలోని కీలక నియోజకవర్గమైన అనంత్‌నాగ్‌లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మూడు దశల పోలింగ్ చివరి దశ సోమవారం పూర్తవుతుంది. ఈ స్థానంలో సిట్టింగ్ సభ్యురాలైన పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మళ్లీ పోటీచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తన సమీప నేషనల్ కాన్ఫరెన్స్ ప్రత్యర్థి మీర్జా మెహబూబ్ బేగ్‌పై ఆమె 65 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
మెహబూబా ముఫ్తీ , గులాం అహ్మద్ మీర్
ఈసారి ఆమెపై నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి హస్నైన్ మసూదీ పోటీచేస్తున్నారు. ఇంకా ఈ స్థానంలో గులాం అహ్మద్ మీర్(కాంగ్రెస్), సోఫీ యూసుఫ్ (బీజేపీ) పోటీలో ఉన్నారు. ఈసారి పోలింగ్ జరిగే రెండో స్థానమైన లద్దాఖ్‌ను నిలబెట్టుకోవడానికి బీజేపీ కొత్త అభ్యర్థి త్సేరింగ్ నంగ్యాల్‌ను రంగంలోకి దింపింది. ఈసారి ఇద్దరు బలమైన స్వతంత్ర అభ్యర్థులు అస్గర్ అలీ కర్బలాయ్, సజ్జద్ హుస్సేన్ పోటీలో ఉన్నారు.
యూపీలో హోరాహోరీ
ఉత్తరప్రదేశ్‌లోని 14 సీట్లు–ధౌరహ్రా, సీతాపూర్, మోహన్‌లాల్‌గంజ్, లక్నో, రాయ్‌బరేలి, అమేథీ, బందా, ఫతేపూర్, కౌశంబి, బారాబంకీ, ఫైజాబాద్, బహ్రాయిచ్, కైసర్‌గంజ్, గోండా నియోజకవర్గాలకు ఐదో దశలో పోలింగ్ జరుగుతుంది. 2014లో ఈ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పదిచోట్ల ప్రస్తుత మహాగuŠ‡బంధన్ భాగస్వామ్య పక్షాలైన ఎస్పీ, బీఎస్పీ రెండో స్థానంలో నిలిచాయి. ఈ పద్నాలుగు స్థానాల్లో ఏడు సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ రాయ్‌బరేలి, అమేథీలు మినహా మిగిలిన చోట్ల ఓడిపోయింది.
అమేథీలోపై ఉత్కంఠ!
గాంధీ–నెహ్రూ కుటుంబ నియోజకవర్గమైన అమేథీ నుంచి రాహుల్‌గాంధీ వరుసగా నాలుగోసారి పోటీచేస్తున్నారు. 2014లో బీజేపీ తరఫున తొలిసారి పోటీచేసి ఓడిపోయిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ(బీజేపీ) మళ్లీ పోటీకి దిగారు. కిందటిసారి రాహుల్ మెజారిటీ బాగా తగ్గడంతో ఆయన కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీచేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో రాహుల్ తరఫున ఆయన చెల్లెలు ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. స్మృతి గెలపు కోసం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్‌షా, ఎల్జేపీ నేత రామ్‌విలాస్ పాస్వాన్ కూడా అనేక ఎన్నికల సభల్లో ప్రసంగించారు. అమేథీపై గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తి నెలకొంది. రాయ్‌బరేలీలో రాహుల్ తల్లి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా నాలుగోసారి పోటీచేస్తున్నారు. ఇక్కడ బీజేపీ తరఫున దినేష్ ప్రతాప్‌సింగ్ బరిలోకి దిగారు. ఆయన గతంలో సోనియా పోటీచేసినప్పుడు ఆమె తరఫున పనిచేశారు. గత ఏడాది కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దినేష్‌కు బీజేపీ టికెటివ్వడం విశేషం.
లక్నోలో రాజ్‌నాథ్‌కు నామమాత్ర పోటీయేనా?
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పోటీచేస్తున్న లక్నోలో మహా కూటమి తరఫున సినీనటుడు, కేంద్ర మంత్రి మాజీ శత్రుఘ్న సిన్హా భార్య, బాలీవుడ్ మాజీ నటి పూనమ్ సిన్హా, కాంగ్రెస్ అభ్యర్థి సంభల్ కల్కీ పీఠం అధిపతి ప్రమోద్ కృష్ణం పోటీకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రత్యర్థులిద్దరూ ఇతర ప్రాంతాలవారు కావడంతో రాజ్‌నాథ్ గెలుపు సునాయాసమేనని అంటున్నారు. అవధ్ ప్రాంతంలోని మరో కీలక స్థానం ఫైజాబాద్‌లో కిందటిసారి గెలిచిన లల్లూసింగ్ (బీజేపీ) మరోసారి రంగంలోకి దిగారు. వివాదాస్పద ఆయోధ్య–రామజన్మభూమి ఉన్న ఫైజాబాద్ పోటీపై ఎప్పటిలాగానే ఆసక్తి నెలకొంది. 2014లో ఎస్పీ తరఫున పోటీచేసి ఓడిన మాజీ ఎంపీ మిత్రసేన్ యాదవ్ కొడుకు ఆనంద్‌సేన్ ఈసారి మహాకూటమి అభ్యర్థిగా ఎస్పీ టికెట్‌పై బరిలోకి దిగారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైజాబాద్ మాజీ ఎంపీ నిర్మల్ ఖత్రీ కాంగ్రెస్ టికెట్‌పై మరోసారి పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ జరుగుతోంది. ధౌరహ్రాలో కాంగ్రెస్ దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర ప్రసాద్ కొడుకు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ మళ్లీ పోటీకి దిగారు. ఆయనపై బీజేపీ సిట్టింగ్ సభ్యురాలు రేఖా వర్మ మరోసారి పోటీలో ఉన్నారు. ఆమె కిందటిసారి తన సమీప బీఎస్పీ ప్రత్యర్థి దావూద్ అహ్మ ద్‌ను ఓడించారు. బీఎస్పీ–ఎస్పీ కూటమి తరఫున అర్షద్ ఇల్యాస్ అహ్మద్(బీఎస్పీ) పోటీచేస్తున్నారు. పోటీ ఇక్కడ ప్రధానంగా బీజేపీ, బీఎస్పీ మధ్యనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలకు రిజర్వ్‌చేసిన బహరాయిచ్‌లో వివాదాస్పద మాజీ బీజేపీ ఎంపీ సావిత్రీబాయి ఫూలే కాంగ్రెస్ తరఫున ఈసారి ఎన్నికల బరిలోకి దిగారు. 2014లో ఆమె బీజేపీ టికెట్‌పై పోటీచేసి సమీప ఎస్పీ అభ్యర్థి షబ్బీర్ అహ్మద్ వాల్మికీని ఓడించారు. వాల్మికీ మళ్లీ ఎస్పీ తరఫున పోటీచేస్తున్నారు. సావిత్రీబాయి కాంగ్రెస్‌లో చేరడంతో బీజేపీ తరఫున కొత్త అభ్యర్థి అక్షర్‌వర్ లాల్ బరిలోకి దిగారు. బహరాయిచ్‌లో పోటీ బీజేపీ, మహా కూటమి తరఫున ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన సీట్లలో కూడా పోటీ ప్రధానంగా బీజేపీ, బీఎస్పీ–ఎస్పీ కూటమి మధ్యనే ఉంది.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కఠిన పరీక్షే!
ఇక్కడి 7 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్‌ల మధ్యే ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. 2014లో మధ్య ప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాలకు గాను 27 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగురవేసిన బీజేపీకిగానీ, 2018 ఎన్నికల్లో అలుపెరుగకుండా పోరాడి తృటిలో బయటపడిన కాంగ్రెస్కిగానీ ఈ ఎన్నికల్లో విజయం అంత సులువుకాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఖజురహోలో ఈసారి బీజేపీ నుంచి వీ.డీ శర్మ తన విజయావకాశాలను పరీక్షించుకుంటున్నారు. స్థానిక రాజకుటుంబీకురాలు కవితాసింగ్‌ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. జనాభా రీత్యా ఓబీసీ, ఎస్సీ సామాజిక వర్గాలే అధికంగా ఉన్నా, సాంప్రదాయకంగా రాజ్‌పుత్‌ల ఆధిపత్యం ఇక్కడ కొనసాగుతోంది.
ప్రహ్లద్ పటేల్
ఇక్కడ కుర్మీ, లోధి సామాజిక వర్గానిదే అధిక జనాభా. మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి అర్జున్‌సింగ్‌కి పట్టున్న సత్నా లోక్‌సభ స్థానంలో ఓబీసీ సామాజిక వర్గాలతో పాటు ఆదివాసీల సంఖ్య సైతం చెప్పుకోదగిన స్థాయిలోనే 20 శాతంగా ఉంది. 1998 1999 ఎన్నికల్లో బీజేపీ నుంచి రామానంద్ సింగ్ సత్నా సీటుని గెలుచుకున్నారు. 2004 నుంచి ఈ సీటుని బీజేపీ గణేశ్ సింగ్‌కి దక్కింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజారాం త్రిపాఠీని బరిలోకి దింపితే ఈసారి కూడా బీజేపీ మాత్రం గణేష్ సింగ్‌ని తిరిగి నిలబెట్టింది. రేవాలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ జనార్ధన్ మిశ్రా కాంగ్రెస్ అభ్యర్థి సుందర్ లాల్ తివారీని ఓడించారు. ఈసారి కాంగ్రెస్ తరఫున రామూ టీకామ్ బీజేపీ అభ్యర్థి దుర్గాదాస్‌ను ఢీకొంటున్నారు.
బేతుల్ నియోజకవర్గంలో అత్యధికంగా 40 శాతం మంది ఆదివాసీలే. బేతుల్ నియోజకవర్గంలో 1996 నుంచి, 2009 వరకు సుదీర్ఘకాలం బీజేపీ విజయప్రస్థానం కొనసాగింది. ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా దుర్గాదాస్ పోటీ చేస్తోంటే, కాంగ్రెస్ రామూ టీకంని బరిలోకి దింపింది. హోసంగాబాద్ 1989 నుంచి బీజేపీకి మంచి పట్టున్న లోక్‌సభ స్థానం. 1989 నుంచి 2009 వరకు సర్తాజ్ సింగ్ ఐదు సార్లు ఈ లోక్‌సభ స్థానంలో విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వా కూడా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ బీజేపీ అభ్యర్థి ఉదయప్రతాప్ సింగ్. ఇక్కడ కూడా ఆదివాసీలు 16 శాతం ఉన్నారు.
దామోహ్ లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రహ్లద్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థి చౌధురీ మహేంద్ర ప్రతాప్ సింగ్‌పై 2 లక్షల ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో దామోహ్‌లో బీజేపీ నుంచి తిరిగి ప్రహ్లద్ పటేల్ పోటీ చేస్తోంటే, కాంగ్రెస్ నుంచి ప్రతాప్ సింగ్, ప్రహ్లద్ సింగ్ బరిలోకి దిగారు. యావత్ దేశంలోనే ఆర్థికంగా అత్యంత వెనుకబడిన లోక్‌సభ నియోజకవర్గం టీకంగఢ్‌లో దాదాపు 77 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చిన వారే. ఈ నియోజకవర్గంలో నాలుగోవంతు మంది షెడ్యూల్డ్ కులాల ప్రజలే. గతంలో రెండుసార్లు విజయం సాధించిన వీరేంద్ర కుమార్‌నే తిరిగి బీజేపీ టీకంగఢ్‌లో పోటీకి దింపింది. బీజేపీ అభ్యర్థి వీరేంద్ర కుమార్‌తో కాంగ్రెస్ నేత కిరణ్ అహిర్వార్ తలపడుతున్నారు.
ఐదు స్థానాల్లో స్వల్ప మెజారిటీ
2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఐదు వేర్వేరు రాష్ట్రాల్లోని ఐదు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో సీట్లు కైవసం చేసుకుంది. ఈ స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగుతోంది. లద్దాఖ్(జమ్మూ కశ్మీర్)లో ఇండిపెండెంట్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి కేవలం 36 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌సింగ్‌పై బీజేపీ టికెట్‌పై పోటీచేసిన గణేశ్‌సింగ్ కేవలం 8,688 ఓట్ల తేడాతో గెలిచారు.
బిహార్‌లోని మధుబని స్థానంలో ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి హుకుందేవ్ నారాయణ్ యాదవ్ 20,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజస్థాన్‌లోని కరౌలీ ధోల్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లఖీరామ్పై బీజేపీ నేత మనోజ్ రాజోరియా 27,216 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబీ(ఎస్పీ రిజర్వ్డ్) స్థానంలో ఎస్పీ అభ్యర్థి శైలేంద్రకుమార్‌ను బీజేపీ టికెట్‌పై పోటీచేసిన వినోద్‌కుమార్ సోంకర్ 42,900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇంత తక్కువ మెజారిటీతో కైవసం చేసుకున్న ఈ ఐదు నియోజకవర్గాలను 2019 ఎన్నికల్లో నిలబెట్టుకోవడం బీజేపీకి కీలకంగా మారింది.
51 సీట్లలో కాంగ్రెస్‌కు రెండే
ఐదో దశలో భాగంగా సోమవారం ఏడు రాష్ట్రాల్లోని 51 సీట్లలో పోలింగు జరుగుతోంది. వీటిలో ఏ సీటులో ఎవరు గెలుస్తారనేది 23వ తేదీన తెలుస్తుంది. అయితే, 2014 ఎన్నికల్లో ఈ 51 సీట్లలో 39 సీట్లు కమలనాధులే దక్కించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు స్థానాలు(రాయ్‌బరేలి,అమేథీ) మాత్రమే వచ్చాయి. ఇక బెంగాల్లో తృణమూల్ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రాల వారీగా చూస్తే...బిహార్‌లోని ఐదు సీట్లలో మూడు బీజేపీ గెలుచుకోగా ఒక దాంట్లో ఆర్ఎస్ఎల్పీ, ఇంకోచోట ఎల్జేపీలు గెలిచాయి. కశ్మీర్లో ఒకటి బీజేపీ, మరొకటి పీడీపీ కైవసం చేసుకున్నాయి. జార్ఖండ్‌లో నాలుగు స్థానాలూ బీజేపీ కైవసం చేసుకుంది. మధ్య ప్రదేశ్‌లో ఏడు,రాజస్థాన్‌లోని 12 స్థానాల్లోనూ కాషాయ జెండాయే ఎగిరింది. ఉత్తర ప్రదేశ్‌లో రాయ్‌బరేలి,అమేథీ తప్ప మిగతా 12 సీట్లలో బీజేపీ అభ్యర్ధులు గెలిచారు.ఇక బెంగాల్ విషయానికి వస్తే..ఏడు నియోజకవర్గాల్లోనూ తృణమూల్ జయకేతనం ఎగురవేసింది.