సాక్షి, హైదరాబాద్: రెండోసారి కష్టమే.. అత్తెసరు సీట్లతో అధికారంలోకి వస్తారని అందరూ భావించగా ఊహించని రీతిలో అప్రతిహత విజయంతో నరేంద్ర మోదీ పాలన పగ్గాలు చేపట్టి దాదాపు 20 నెలలవుతోంది. ఈ సమయంలో దేశంలో అలజడులు, ఉద్యమాలు, ప్రతిపక్షాల పోరు, అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, చైనా దూకుడు.. తదితర అంశాలపై దేశవ్యాప్తంగావిమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ మాత్రం ఎన్నికలపై ప్రభావం చూపవని తేలింది. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలలేదని సర్వేలో తేలింది.
(ఇది చదవండి: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్‌డీఏకు 321 సీట్లు!)
‘ఇండియా టుడే –కార్వీ’ జరిపిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఓటీఎన్)’ చేసిన సర్వే ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్)కు ప్రజల ఆదరణ ఉందని తెలిపింది. 43% ఓట్లతో 321 స్థానాలను ఎన్డీఏ గెలుచుకుంటుందని తేల్చింది. అయితే ఇదే సర్వే గతేడాది ఆగస్ట్‌లో చేయగా ఎన్‌డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. ఈ విధంగా రోజురోజుకు మోదీ చరిష్మా పెరుగుతూనే ఉంది.
ప్రత్యామ్నాయం లేక
బలమైన ప్రతిపక్షాలు.. నాయకుడు లేకపోవడం మోదీకి ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు. కాంగ్రెస్ ఎప్పుడో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఇక ఆ పార్టీ నేత రాహూల్ గాంధీ అపరిపక్వత నాయకుడిగా మిగిలిపోయాడు. మోదీని ఢీకొనేంత శక్తి రాహూల్‌కు లేదని అందరికీ తెలిసినా విషయమే. ఇక మోదీకి ప్రత్యామ్నాయం.. అతడిని ఢీ కొడతామంటూ మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, మాయావతి, స్టాలిన్, కేసీఆర్‌లు ఆర్బాటపు ప్రకటనలు చేస్తారు. వారికి సొంత రాష్ట్రంలోనే పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేదు. ఢిల్లీలో పోరాటం చేయడానికి ముందుకు రాగా ఐక్యతా రాగం లేదు. కార్యాచరణ ఏమున్నా కానీ ముందే తాము ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ హడావుడి చేయడంతో అభాసుపాలవుతున్నారు. మోదీకి వ్యతిరేకంగా ఒక ఉమ్మడి ప్రణాళికతో వెళ్లే ప్రయత్నం చేయడం లేదు.
ఇలాగే ఉంటే మూడోసారి కూడా
బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో పాటు దేశంలో మోదీ అంత చరిష్మా ఉన్న నాయకుడు ఎవరూ లేరు. ఇక పాలనపరమైన విషయంలో కొంత ప్రతికూలత ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అమలు చేస్తున్నారు. పేదలతో పాటు సంపన్నులకు కూడా పథకాలు, కార్యక్రమాలు చేపట్టడంతో అన్ని వర్గాల నుంచి మోదీకి మద్దతు ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో మోదీ ముందంజలో ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల వరకు ఇదే హవా కొనసాగితే ముచ్చటగా మూడోసారి కూడా ప్రధాని పదవిలో నరేంద్ర మోదీ కూర్చోనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఉద్యమం కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment