‘యూనివర్సల్’లో మొబైల్ బీమా
సాక్షి, చెన్నై: మొబైల్ ఫోన్లకు బీమా పథకం వర్తింప చేస్తూ యూనివర్సల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. తమ షోరూంలలోనే కాకుండా, ఇతర దుకాణాల్లో కొనుగోలు చేసినా ఈ బీమా వర్తిస్తుంది. ఈ మేరకు మంగళవారం చెన్నైలో యూనివర్సల్ టెలికమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ నందకుమార్ ప్రకటించారు. ఇటీవల తాము మొబైల్ ఫోన్లపై దేశ వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించామన్నారు. ఇందులో 80 శాతం మంది తమ ఫోన్లు చోరీకి గురవుతున్నట్టు, కన్పించకుండా పోతున్నట్టు తేలిందని చెప్పారు. 20 శాతం మంది మాత్రమే ఫోన్లను అత్యంత జాగ్రత్తగా వాడుకుంటున్నట్లు చెప్పారు. యువకులు, విద్యార్థులైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫోన్లను పోగొట్టుకుంటోన్నారని తెలిపారు.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల విప్లవం వచ్చిందని గుర్తు చేస్తూ, ఖరీదైన ఫోన్లను పోగొట్టుకునే వారు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారన్నారు. ఈ పరిస్థితులను పరిగణ నలోకి తీసుకుని ఓరియంటల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌తో కలసి మొబైల్ ఫోన్లకు ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశ పెడుతున్నామని ప్రకటించారు. తమ షోరూం లలోనే కాకుండా, ఇతర షోరూంలలోను కొనుగోలు చేసే మొబైల్ ఫోన్లకు కూడా ఈ స్కీం వర్తిస్తుందని వివరించారు. రూ.4 వేలకు పైబడి ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులు ఈ బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ బీమా ఆధారంగా ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా, అగ్ని ప్రమాదం లో దగ్ధమైనా, ప్రమాదాలతో కన్పించకుండా పోయి నా, అందుకు తగ్గ ఆధారాల్ని, ధృవీకరణ పత్రాలను సమర్పిస్తే, మొబైల్ ఫోన్ ధరలో 80 శాతం క్లయిమ్ చేయనున్నట్లు తెలిపారు.
పన్నెండు నెలల కాల పరిమితితో ఈ బీమాను అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో బెంగళూరులో ఏర్పాటు చేసినట్టుగానే, చెన్నైలో అతి పెద్ద యూనివర్సల్ సింక్ షోరూం ప్రారంభించనున్నామని చెప్పారు. ఇందులో అదనపు సౌకర్యాలతో పాటుగా ప్రత్యేక ఆప్షన్లు ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ డిప్యూటీ జీఎం డాక్టర్ కోహ్లీ, యూనివర్సల్ ఉపాధ్యక్షురాలు సౌమ్య, ఆల్జీన్ ఎండీ రవీంద్రన్ పాల్గొన్నారు.