అలరించిన నృత్యోత్సవం
నంద్యాల: నంది నృత్యోత్సవంలో భాగంగా చిన్నారులు రెండోరోజు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు. జాతీయ స్థాయిలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. స్థానిక మున్సిపల్ టౌన్హాల్లో సాయి నృత్య అకాడమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నంది నృత్యోత్సవం రెండో రోజైన ఆదివారం ప్రదర్శనలు అదరగొట్టాయి.
కవితాకర్(కోల్‌కత), మాలవిక(చెన్నై) భరతనాట్యం, తరుణి(భద్రం), దీపారెడ్డి(అనంతపురం), కూచిపూడి, సౌందర్య(శ్రీకాకుళం), లక్ష్మిప్రసూన శిష్యబృందం (హైదరాబాద్), ముసుమారి ఆర్ట్స్ అకాడమి(హైదరాబాద్) విద్యార్థులు తరంగ నృత్యం, మాలవిక(చెన్నై), రాజరాజేశ్వరి అష్టకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. వందమంది కళాకారులకు ప్రశంసా పత్రాలు, పతకాలు, శాలువాలు, నంది విగ్రహంతో పాటు బిరుదుతో సాయి నాట్యాకాడమి అధ్యక్షుడు సురేష్ సన్మానించారు. కార్యక్రమంలో మునుకూట్ల సాంబశివ, రాదిక, అనిల్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.