Nandipet
-
ఫ్రెండ్‌కు లవ్ యూ బంగారం మెసేజ్.. దీంతో..
సాక్షి, నందిపేట్ (నిజామాబాద్): స్నేహితురాలి తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం నయేగావ్ గ్రామానికి చెందిన సాయన్న భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి తొమ్మిదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం డొంకేశ్వర్ గ్రామానికి వలస వచ్చాడు. గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద పాలేరు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని రెండో కూతురు లలిత (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే, శనివారం తన క్లాస్మేట్ అయిన మండలంలోని నికాల్పూర్ గ్రామానికి చెందిన పల్లవికి ఫోన్లో ‘ఐలవ్ యు బంగారం’ అని మెస్సేజ్ పెట్టింది. ఈ విషయాన్ని పల్లవి తన తండ్రి హన్మంత్‌కు చెప్పింది. దీంతో హన్మంత్ మరో ఇద్దరిని తీసుకుని శనివారం డొంకేశ్వర్‌లోని లలిత ఇంటికి వచ్చి నిలదీశాడు. ఈ మెస్సేజ్ ఎందుకు పెట్టావని నిలదీస్తూ, చెప్పకుంటే పోలీసులకు చెబుతామని హెచ్చరించి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంటి నుంచి వెళ్లి పోయింది. తల్లిదండ్రులు చుట్టపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామంలోని మంచినీటి బావిలో శవమై తేలిన లలితను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో చెలరేగిపోయారు. జిల్లాలోని నందిపేట్ మండలం లక్కంపల్లిలో ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రులు హర్ సిమ్రత్‌కౌర్ బాదల్, రామేశ్వర్ తెలి హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు జై కేసీఆర్ అంటూ నినాదాలు ప్రారంభించారు. అంతటితో ఆగకుండా ఎంపీకి వ్యతిరేకంగా పసుపు ఫ్యాక్టరీని వాగ్ధానాన్ని అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అనంతరం టీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రసంగ సమయంలో బీజేపీ కార్యకర్తలు చుక్కులు చూపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... రైతులకు యూరియాని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల పోటా పోటీగా నినాదాలు, గందరగోళం మధ్యనే సభ నిర్వహణ జరిగింది. ఇదంతా కేంద్రమంత్రుల ఎదుటనే జరగటం వారు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్ సిమ్రాత్కౌర్ కలుగచేసుకుని.. వారిని శాంతింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ మెగాఫుడ్ పార్క్‌కి ఎక్కువ నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేశాం. కేంద్రప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తోంది. రైతులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. మెగాఫుడ్ పార్క్ వల్ల రైతుల ఉత్పత్తులు ఉపయోగంలోకి వస్తాయి. మంచి గిట్టుబాటు ధరలు కూడా వస్తాయి. కేంద్రం అన్ని పంటలకు ఈసారి గిట్టుబాటు ధరలు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా ఫుడ్ పార్క్‌ని పూర్తి చేశాం. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం పంపిణీ చేస్తోంది’ అని అన్నారు. -
బాకీ చెల్లించలేదని బాలిక కిడ్నాప్
-
కలకలం : బాకీ చెల్లించలేదని బాలిక కిడ్నాప్..!
సాక్షి, నందిపేట్/నిజామాబాద్: జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల నుంచి మైనర్ బాలిక కిడ్నాప్ కావడం కలకలం రేపుతోంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివరాలు.. గురువారం మనీశ్వరీ అనే బాలికను స్కూల్ నుంచి ఓ మహిళ అపహరించిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించామని అన్నారు. బాలిక తండ్రికి నిందితురాలికి మధ్య డబ్బు విషయంలో తగాదా ఉందని పేర్కొన్నారు. రజితకి బాలిక తండ్రి 3 లక్షల రూపాయలు బాకీ పడ్డాడనీ, ఈ నేపథ్యంలోనే ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం మనీశ్వరీ తండ్రికి ఫోన్ చేసిన రజిత బాకీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేసిందనీ, తర్వాత ఆమె ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉందని పోలీసులు వెల్లడించారు. కూతురు అపహరణకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్‌కు ఆర్నెళ్ల జైలు
నందిపేట్ (ఆర్మూర్): రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఆర్నెళ్ల జైలుశిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ ఆర్మూర్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. నందిసేట్ ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జోర్పూర్ గ్రామానికి చెందిన ఏడ మహేశ్ తన స్నేహితుడైన బచ్చు రాముతో కలిసి 2015 మార్చి 31న పొలానికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఆర్మూర్ డిపో బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా, మహేశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసు గురువారం విచారణకు రాగా ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ మేకల రాజశేఖర్‌కు ఆర్నెళ్ల జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ ఆర్మూర్ మేజిస్ట్రేట్ ఉదయ్‌కుమార్ తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రవీణ్ నాయక్, ఇన్వెస్టిగేషన్ అధికారిగా జాన్‌రెడ్డి వ్యవహరించారు. -
వర్షానికి గోడ కూలి నలుగురు మృతి
మృతుల్లో అక్కాతమ్ముడు మాక్లూర్: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో వర్షానికి పాత భవనం గోడ కూలడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో నందిపేట మండలం జోర్‌పూర్‌కు చెందిన ఏడే రమాదేవి(21), మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కులకు చెందిన నీరడి అఖిల(19) అక్కడికక్కడే మృతిచెందగా.. వెల్మల్ గ్రామానికి చెందిన ఆకుల సుదర్శన్(48), జోర్‌పూర్‌కు చెందిన ఏడే ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రమాదేవి, అఖిల, ప్రవీణ్ కుటుంబ సభ్యులు శనివారం మండల కేంద్ర సమీపంలోని శ్రీకేదారేశ్వర ఆశ్రమం వద్ద సత్యనారాయణ పూజ కోసం వెళ్లారు. పూజా కార్యక్రమాలు ముగించుకుని వీరి కుటుంబ సభ్యులు ట్రాక్టర్లో వెళ్లగా, వీరు మాత్రం బైక్‌పై బయలు దేరారు. సాయంత్రం మండల కేంద్రంలోని నర్సాగౌడ్‌కు చెందిన పాత భవనం వద్దకు రాగానే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వీరు పాత భవనం వద్ద నిలబడ్డారు. ఇదే సమయంలో నందిపేట నుంచి ఇంటికి వెళ్తున్న ఆకుల సుదర్శన్ కూడా వీరి వద్ద వచ్చి నిలబడ్డాడు. ఈ క్రమంలో గోడ కూలడంతో రమాదేవి, అఖిల అక్కడికక్కడే మృతిచెందారు. వీరిని స్థానికులు ట్రాక్టర్లతో మట్టిపెళ్లలను తొలగించి బటయకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ సుదర్శన్, ప్రవీణ్‌ను 108 అంబులెన్స్‌లో జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మృతిచెందారు. మృతుల్లో రమాదేవి, ప్రవీణ్‌లు అక్కా తమ్ముడు. రమాదేవి ఇంటర్ పూర్తి చేయగా, ప్రవీణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నీరడి అఖిలది మాక్లూర్ మండలం గొట్టుముక్కుల. ఈమె బాన్సువాడ మండలం బోర్లం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆకుల సుదర్శన్ చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. -
వివాహితను వేధిస్తున్న పోకిరీలు
నిజామాబాద్ : మూడు రోజులుగా వివాహితను వేధిస్తున్న యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నిజామాబాద్‌లోని నందిపేటలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వివాహిత రోజూ నందిపేట నుంచి నవీపేట మండలంలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో ముగ్గురు యువకులు వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఈ విషయాన్ని ఆమె శుక్రవారం ఇంట్లో వాళ్లకు చెప్పింది. వారు ఆమెకు ధైర్యం చెప్పి... శనివారం ఉదయం ఆమెను అనుసరించారు. ఎప్పటి మాదిరిగా ఆ యువకులు దారిలో ఆమెను వేధించసాగారు. దీంతో ఆమె సంబధీకులు ముగ్గురు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనతో ఇరువైపుల వారి మధ్య వాగ్యుద్ధం మొదలైంది. సుమారు 200 మందికిపైగా అక్కడ పోగయ్యారు. ఎస్ఐ జాన్‌రెడ్డి అక్కడకు చేరుకోగా ఇరు వర్గాల మధ్య తోపులాటలో ఆయన కింద పడిపోయారు. పోలీసులు వేధింపులకు పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. గణేశ్ నిమజ్జనం సమయం కావడం, ఇరు మత వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ ఆకుల రాంరెడ్డి నందిపేటకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువైపుల వారికి సర్దిచెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు. మరోవైపు ఈ ఘటన తర్వాత ఓ వర్గం వారు స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చారు. 100 బైక్‌లపై ర్యాలీ చేస్తూ షాపులను మూసివేయించారు.