మృతుల్లో అక్కాతమ్ముడు
మాక్లూర్: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో వర్షానికి పాత భవనం గోడ కూలడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో నందిపేట మండలం జోర్‌పూర్‌కు చెందిన ఏడే రమాదేవి(21), మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కులకు చెందిన నీరడి అఖిల(19) అక్కడికక్కడే మృతిచెందగా.. వెల్మల్ గ్రామానికి చెందిన ఆకుల సుదర్శన్(48), జోర్‌పూర్‌కు చెందిన ఏడే ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రమాదేవి, అఖిల, ప్రవీణ్ కుటుంబ సభ్యులు శనివారం మండల కేంద్ర సమీపంలోని శ్రీకేదారేశ్వర ఆశ్రమం వద్ద సత్యనారాయణ పూజ కోసం వెళ్లారు.
పూజా కార్యక్రమాలు ముగించుకుని వీరి కుటుంబ సభ్యులు ట్రాక్టర్‌లో వెళ్లగా, వీరు మాత్రం బైక్‌పై బయలు దేరారు. సాయంత్రం మండల కేంద్రంలోని నర్సాగౌడ్‌కు చెందిన పాత భవనం వద్దకు రాగానే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వీరు పాత భవనం వద్ద నిలబడ్డారు. ఇదే సమయంలో నందిపేట నుంచి ఇంటికి వెళ్తున్న ఆకుల సుదర్శన్ కూడా వీరి వద్ద వచ్చి నిలబడ్డాడు. ఈ క్రమంలో గోడ కూలడంతో రమాదేవి, అఖిల అక్కడికక్కడే మృతిచెందారు. వీరిని స్థానికులు ట్రాక్టర్లతో మట్టిపెళ్లలను తొలగించి బటయకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ సుదర్శన్, ప్రవీణ్‌ను 108 అంబులెన్స్‌లో జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు.
వీరు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మృతిచెందారు. మృతుల్లో రమాదేవి, ప్రవీణ్‌లు అక్కా తమ్ముడు. రమాదేవి ఇంటర్ పూర్తి చేయగా, ప్రవీణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నీరడి అఖిలది మాక్లూర్ మండలం గొట్టుముక్కుల. ఈమె బాన్సువాడ మండలం బోర్లం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆకుల సుదర్శన్ చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు.
వర్షానికి గోడ కూలి నలుగురు మృతి
Published Sun, Jun 12 2016 12:24 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
Advertisement
Advertisement