రోదిస్తున్న మృతుల బంధువులు
వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు. కాయకష్టం చేశారు.పొద్దుపోయాక ఇంటికి చేరుకున్నారు. భోజనాలు చేసి ఒక్కొక్కరూ నిద్రకు ఉపక్రమించారు. గాఢనిద్రలోకి జారుకున్నారు. సరిగ్గా తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ప్రహరీ గోడ కూలింది. తేరుకునేలోపే రెండు కుటుంబాలనుమింగేసింది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా మృత్యువు మొత్తం 17 మందినిపొట్టనపెట్టుకుంది.శిథిలాల కింద
మరికొందరు ఉండవచ్చని అధికారులుఅనుమానిస్తున్నారు. ఈ విషాదకర ఘటనమేట్టుపాళయంలోతీవ్ర విషాదాన్ని నింపింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: మేట్టుపాళయం సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలి 17 మంది మృత్యువాత పడ్డారు. కుటుంబాలకు, కుటుంబాలే శిథిలాల కింద నలిగిపోయాయి. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వివరాలు.. కోయంబత్తూరు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేట్టుపాళయం, కట్రుపుర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఎడతెరిపిలేకుండా కురిసిన వాన ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మేట్టుపాళయం సమీపం నడూరు కన్నప్పన్ లే–అవుట్‌లో పేరొందిన వస్త్రదుకాణం యజమాని ఇల్లు ఉంది. దీనికి సమీపంలో 50 మందికిపైగా పేద రైతులు, కార్మికులు గుడిసెలు, పెంకుటిళ్లు వేసుకుని నివసిస్తున్నారు. శివగామీ, అరుక్కానీ అనే మహిళలు మట్టితో పెంకుటిళ్లు నిర్మించుకుని కుటుంబసభ్యులతో నివాసముంటున్నారు. వస్త్రవ్యాపారి తన ఇంటికి 30 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తులో బండ రాళ్లతో నిర్మించిన ప్రహరీ గోడ ఈ ఇళ్లకు అనుకునే ఉంది. ఇటీవల వర్షాలకు నేల మెత్తబడి, ప్రహరీ గోడ తడిసి కూలేస్థితికి చేరింది. ప్రహరీ పక్కన ఇళ్లలో నివసించే పేదలు ఆదివారం రాత్రి యథావిధిగా నిద్రించారు.
శిథిలాలను తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
సోమవారం తెల్లవారు జాము 4 గంటల సమయంలో ఆ ప్రహరీ గోడ పెద్ద శబ్దంతో శివగామి, అరుక్కానీ పెంకుటిళ్లపై కూలింది. ఈ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారు. మేట్టుపాళయం పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ ప్రొక్లయిన్లను రప్పించి శిథిలాలను తొలగించగా మొత్తం 17 మంది నిద్రిస్తున్న దశలోనే ప్రాణాలువిడిచినట్టు కనిపించాయి. అరుక్కానీ, శివగామీ కుటుంబాల్లో అందరూ శిథిలాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. మృతుల్లో గురుస్వామి (45), రామనాథన్ (20), ఆనందకుమార్ (40), శివకామీ (45), ఓవియమ్మాళ్ (50), నిత్య (30), వైదేహీ (20), తిలకవతి (50), అరుక్కాని (55), రుక్మిణి (40), నివేదా (18), చిన్నమ్మాళ్ (70), మంగలమ్మాళ్(60), హరిసుధ (16), అక్షయ (7), లోగురాం (7), మహాలక్ష్మి (10) ఉన్నారు. శిథిలాలు పూర్తిగా తొలగిస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. శిథిలాల తొలగింపునకు కోయంబత్తూరు నుంచి ప్రకృతి వైపరీత్యాల రక్షణ దళాలను రప్పించారు. కోయంబత్తూరు కలెక్టర్ రాజామణి బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరఫున తలా రూ.4 లక్షల ఆర్థికసహాయాన్ని ప్రకటించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన వంద మందితో కూడిన బృందాన్ని రప్పించినట్లు పోలీస్‌శాఖ పశ్చిమ మండల డీజీపీ పెరియయ్యా తెలిపారు.
మేట్టుపాళయంలో లాఠీచార్జీ
రెండు కుటుంబాలను సమూలంగా తుడిచిపెట్టేసిన ఈ ఘోర ప్రమాదం రాష్ట్ర ప్రజలను గగుర్పాటుకు గురిచేసింది. మేట్టుపాళయం ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. పక్కా ప్రణాళిక లేకుండా బలహీనమైన ప్రహరీ గోడ నిర్మించుకుని 17 మందిని పొట్టనపెట్టుకున్న వస్త్రవ్యాపారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించిన మేట్టుపాళయం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి బైఠాయించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా కదలక పోవడంతో లాఠీచార్జీ చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నేడు మేట్టుపాళయంకు సీఎం
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం మెట్టుపాళయంకు చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment