
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో చెలరేగిపోయారు. జిల్లాలోని నందిపేట్ మండలం లక్కంపల్లిలో ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రులు హర్ సిమ్రత్‌కౌర్ బాదల్, రామేశ్వర్ తెలి హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు జై కేసీఆర్ అంటూ నినాదాలు ప్రారంభించారు. అంతటితో ఆగకుండా ఎంపీకి వ్యతిరేకంగా పసుపు ఫ్యాక్టరీని వాగ్ధానాన్ని అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌కు చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రసంగ సమయంలో బీజేపీ కార్యకర్తలు చుక్కులు చూపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... రైతులకు యూరియాని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల పోటా పోటీగా నినాదాలు, గందరగోళం మధ్యనే సభ నిర్వహణ జరిగింది. ఇదంతా కేంద్రమంత్రుల ఎదుటనే జరగటం వారు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్ సిమ్రాత్కౌర్ కలుగచేసుకుని.. వారిని శాంతింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ మెగాఫుడ్ పార్క్‌కి ఎక్కువ నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేశాం. కేంద్రప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తోంది. రైతులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. మెగాఫుడ్ పార్క్ వల్ల రైతుల ఉత్పత్తులు ఉపయోగంలోకి వస్తాయి. మంచి గిట్టుబాటు ధరలు కూడా వస్తాయి. కేంద్రం అన్ని పంటలకు ఈసారి గిట్టుబాటు ధరలు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా ఫుడ్ పార్క్‌ని పూర్తి చేశాం. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం పంపిణీ చేస్తోంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment